iDreamPost
iDreamPost
విద్యుత్ చార్జీల పెంపుతో ప్రభుత్వం ప్రజలపై విపరీతమైన భారం మోపిందని బలంగా చెప్పే ప్రయత్నంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తమ నోటికొచ్చిన లెక్కలు చెబుతున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చెప్పే లెక్కకు, రాష్ట్ర అధ్యక్షుడు పేర్కొంటున్న అంకెలకు అసలు లంకె కుదరడంలేదు. ఇక ఇతర నాయకులైతే ఎవరికి తోచిన లెక్క వారు చెప్పేస్తున్నారు.
చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మూడేళ్లలో ఏడుసార్లు విద్యుత్ చార్జీలు పెంచిందని చెప్పారు. రూ.42,172 కోట్ల భారం ప్రజలపై మోపిందని ఒక లెక్క చెప్పారు. అచ్చెన్నాయుడు విలేకరులతో మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలో వచ్చాక ఇప్పటికి ఐదుసార్లు విద్యుత్ చార్జీలు పెంచిందన్నారు. రూ.11.600 కోట్ల మేర జనంపై విద్యుత్ చార్జీల భారం వేసిందని అన్నారు. ఇప్పుడు పెంచిన చార్జీల ద్వారా ఏటా రూ.4.400 కోట్ల భారం వేస్తోందని మరో లెక్క చెప్పారు. ఇక ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ అయితే తెలుగుదేశం హయాంలో అసలు విద్యుత్ చార్జీలే పెంచలేదన్నారు. రాష్ట్ర చరిత్రలో ఈ స్థాయిలో విద్యుత్ చార్జీల పెంపు ఎప్పుడూ లేదన్నారు. దీనిపై చర్చకు కూడా సిద్ధమని ప్రకటించేశారు.
వాస్తవం ఇదీ..
వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మూడేళ్లుగా అసలు విద్యుత్ చార్జీలు పెంచలేదు. రూ.19 వేల కోట్లు ట్రూఅప్ చార్జీలు చంద్రబాబు హయాంలోనివి. వాటిని ఈ ప్రభుత్వం సరి చేసింది. ఈ నేపథ్యంలో విద్యుత్ చార్జీలు స్వల్పంగా పెంచుతూ రెగ్యులేటరీ కమిషన్ నిర్ణయం తీసుకుంది. గతంలో చంద్రబాబు చేసిన అప్పులు ఇబ్బంది పెడుతున్నాయని, తప్పనిసరి పరిస్థితుల్లో స్వల్పంగా చార్జీలు పెంచాల్సి వచ్చిందని ప్రభుత్వం చెబుతోంది. ఈ పెంపు వల్ల రూ. 1,400 కోట్ల భారం జనంపై పడుతుందని స్పష్టం చేస్తోంది. గత ప్రభుత్వం దీర్ఘకాలిక విద్యుత్ సరఫరా ఒప్పందాలు అధిక ధరలకు చేసుకుంది. దీనివల్ల తీవ్రనష్టం జరుగుతోంది.పీపీఏల రద్దు వల్లే ప్రస్తుతం చార్జీలు పెరిగాయన్న వాదన నిజం కాదని, పీపీఏలను ప్రభుత్వం రద్దు చేయలేదని అధికారులు చెబుతున్నారు.
టీడీపీ అసత్య ప్రచారం
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎప్పుడూ కరెంటు చార్జీలు పెంచలేదని, కరెంటు కోతలు కూడా లేవని చంద్రబాబు, ఆయన పార్టీ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారు. వారు ఎంతగా ప్రచారం చేసినా అప్పట్లో చార్జీల భారం భరించిన ప్రజలకు వారు చెప్పేది వాస్తవమో.. కాదో తెలియదా? నిజానికి కొద్దిగా విద్యుత్ చార్జీలు పెంచక తప్పటం లేదంటూ అప్పట్లో చంద్రబాబునాయుడు అసెంబ్లీలోనే ప్రకటించారు. జనం ఆ సంగతి మరచిపోయి ఉంటారనే నమ్మకంతో తామెప్పుడూ చార్జీలే పెంచలేదని ఇప్పుడు బుకాయిస్తున్నారు. దానికితోడు వాస్తవానికి దూరంగా లెక్కలు చెబుతూ జనాన్ని తప్పుదోవ పట్టించాలని ప్రయత్నిస్తున్నారని అధికార పార్టీ నాయకులు అంటున్నారు.