iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు అనివార్యంగా కనిపిస్తున్నాయి. జనసేన ఈసారి మళ్లీ పాత స్నేహితుడి చెంతకు చేరుతున్నట్టు సంకేతాలు వస్తున్నాయి. టీడీపీ కూడా దాని కోసమే ఎదురుచూస్తున్న తరుణంలో జనసేనాని తుది ప్రకటన కోసం ఆశాభావంతో ఉంది. బీజేపీతో కలిసి టీడీపీ గుమ్మం తొక్కాలని పవన్ ఆశిస్తుంటే పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ఏమయినా జనసేన, టీడీపీ కలిసి పోటీ పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అవి ఆచరణలోకి వస్తాయా లేదా అన్నది పక్కన పెడితే ప్రస్తుతం జనసేనతో పొత్తు యత్నాలు ఫలిస్తున్నాయనే అభిప్రాయం టీడీపీ అధిష్టానంలో ఉంది. అందుకు అనుగుణంగా తన పార్టీ నేతలను సన్నద్ధం చేసే ప్రయత్నంలో ఉన్నారు.
ఇదే ఇప్పుడు గోదావరి జిల్లాల టీడీపీ నేతలకు పెద్ద చిక్కుగా మారుతోంది. గతంలో జనసేన, టీడీపీ కలిసి 2014లో పోటీ చేశాయి. కానీ అప్పట్లో జనసేన బరిలో దిగలేదు. భేషరతుగా టీడీపీని బలపరిచింది. దానికి ప్రతిపలం తెలుగుదేశానికి దక్కింది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఈసారి జనసేన ఎన్నికల్లో పోటీ చేయబోతోంది. దాంతో ప్రస్తుతమున్న గోదావరి జిల్లాల మీద ప్రధానంగా జనసేన ఆశలు పెట్టుకునే అవకాశం ఉంటుంది. విశాఖ నుంచి గుంటూరు మధ్య జనసేన అత్యధికంగా టికెట్లు ఆశిస్తుంది. అందులోనూ ఉభయ గోదావరి జిల్లాల్లో మెజార్టీ కోరుకుంటుంది. అదే ఇప్పుడు ఆయా ప్రాంతాల టీడీపీ నేతల ఉలికిపాటుకి కారణమవుతోంది.
జనసేనకు అండగా ఉన్న కాపులు ఎక్కువగా ఈ ప్రాంతంలో కేంద్రీకృతం కావడం దానికి ప్రధాన కారణం. ఆ కాపుల అండదండల కోసమే చంద్రబాబు కూడా పవన్ తో కలిసి సాగేందుకు ప్రయత్నించారన్నది కాదనలేని వాస్తవం. దాంతో కాపులు కేంద్రీకరించబడిన ప్రాంతంలో జనసేన ఎక్కువ సీట్లు కోరుకుంటే టీడీపీ నేతలు త్యాగాలకు సిద్ధం కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం 34 సీట్లున్న గోదావరి జిల్లాల్లో జనసేన గత ఎన్నికల్లో ఓ సీటు రాజోలులో గెలిచింది. దాంతో పాటుగా కనీసం మరో 15 సీట్లు వరకూ ఆశించే అవకాశం ఉంది. జిల్లాకు 5 చొప్పున 10 సీట్లయినా ఆపార్టీ దక్కించుకుంటుంది. దాంతో ఇప్పుడు 10 మంది టీడీపీ నేతలు తమ సీట్లు వదులుకునేందుకు సిద్ధం కావాల్సి ఉంటుంది. అందులో కీలకమైన స్థానాలుంటాయని భావిస్తున్నారు.
పిఠాపురం, కాకినాడ రూరల్, రాజమండ్రి రూరల్, పెద్దాపురం, జగ్గంపేట, అమలాపురం, కొత్తపేట వంటి సీట్లు జనసేన ఆశించే జాబితాలో ఉంటాయి. ఇక భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం, ఏలూరు, నిడదవోలు, గోపాలపురం వంటివి పశ్చిమాన కోరుకునేందుకు అవకాశం ఉంటుంది. వీటిలో ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న స్థానాలు కూడా ఉన్నాయి. దాంతో వారు ఏమి కావాలన్నది ఓ పెద్ద ప్రశ్న. అదే సమయంలో ఇన్ఛార్జులుగా పార్టీ కోసం పనిచేసిన వారి పరిస్థితి ఏమవుతుందన్నది కూడా ప్రశ్నార్థకం. ఈ తరుణంలో టీడీపీ నేతలు తీవ్రంగా కలత చెందుతున్నారు. బీజేపీని కూడా కలుపుకోవాలని టీడీపీ ఆశిస్తున్న తరుణంలో ఆపార్టీకి మరో రెండు మూడు సీట్లు వదులుకోవాల్సి ఉంటుంది. అందులో రాజమహేంద్రవరం అర్బన్, పి గన్నవరం, తాడేపల్లిగూడెం కోరుకునే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో గోదావరి జిల్లాల తెలుగుదేశం నేతల ఆశలు అడియాశలు కావాల్సిందేనా అనే అభిప్రాయం వినిపిస్తోంది. ఈ తాజా పరిణామాలతో చాలామంది గోదావరి జిల్లాల నేతలు బాబుని నమ్ముకుంటే మునిగిపోతామనే అభిప్రాయానికి వచ్చేస్తున్నట్టు తెలుస్తోంది.