iDreamPost
android-app
ios-app

టీడీపీకి 40 ఏళ్లు, గతమంతా ఘనమని చెప్పుకుంటూ వర్తమానంలో ఉక్కిరిబిక్కిరి, భవిష్యత్తు మీద బెంగ

  • Published Mar 29, 2022 | 10:54 AM Updated Updated Mar 29, 2022 | 1:13 PM
టీడీపీకి 40 ఏళ్లు, గతమంతా ఘనమని చెప్పుకుంటూ వర్తమానంలో ఉక్కిరిబిక్కిరి, భవిష్యత్తు మీద బెంగ

తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన 9 నెలల్లోనే అధికారం చేజిక్కించుకుంది. గడిచిన 4 దశాబ్దాల్లో సగానికి పైగా కాలం అధికారంలో ఉంది. 21 ఏళ్ల పాటు అధికారం అనుభవించిన పార్టీ ఇప్పుడెందుకు ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఆపార్టీకి భవిష్యత్తు మీద భరోసా ఎందుకు కరువవుతోందన్నది కీలక ప్రశ్న. ఎన్టీఆర్ ప్రారంభించి, చంద్రబాబుకి అప్పగించిన పార్టీ ఇప్పుడు తీవ్రంగా సతమతమవుతోంది.ఆ పార్టీ ఆవిర్భవించిన తొలి 20 ఏళ్ల కాలంలో 14 ఏళ్లు పాలనలో ఉంది. కానీ తదుపరి 20 ఏళ్లలో కేవలం ఏడేళ్లు మాత్రమే అధికారం సాధించగలిగింది. ఆపార్టీ ప్రస్థానంలో ఇంత వైరుధ్యం ఎందుకు వస్తోందన్నది కీలకాంశంగా చూడాల్సి ఉంటుంది.

2004 నుంచి తెలుగుదేశం పార్టీ అత్యంత గడ్డుకాలం ఎదుర్కొంటోంది. రాష్ట్ర విభజన తర్వాతి పరిణామాలు కలిసి వచ్చి ఏపీలో 2014లో అధికారం కైవసం చేసుకున్నప్పటికీ ఆపార్టీ దానిని నిలుపుకోలేకపోయింది. చరిత్రలోనే అత్యంత పేలవమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది. గతంలో పార్టీ పరాభవం తర్వాత ఎన్నడూ చవిచూడని స్థితిని ఈకాలంలో చూస్తోంది. గడిచిన మూడేళ్లలో తెలుగుదేశం అత్యంత గడ్డుస్థితిని ఎదుర్కొంది. నాయకత్వం మీద ఆశలు నీరుగారిపోతుండడం, భవిష్యత్తు నేతలెవరన్న దాని గురించి బెంగతో గడపాల్సి వస్తోంది. ఇప్పటికే చంద్రబాబు తర్వాత ఎవరూ అనే చర్చ మొదలయ్యింది. నారా లోకేష్ కోసం చంద్రబాబు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కానీ పార్టీ శ్రేణులు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ని తీసుకురావాలని ఆయన్నే అడుగుతున్నారు.

ఓవైపు దీర్ఘకాలంగా అధికారం లేకుండా గడపడం, మరోవైపు నాయకత్వం మీద నమ్మకం సన్నగిల్లిపోవడం టీడీపీని సతమతం చేస్తోంది. అదే సమయంలో ప్రత్యర్థులు నేరుగా టీడీపీ కంచుకోటల మీద గురిపెట్టిన దశలో కాచుకోవడం పెద్ద సమస్య అవుతోంది. స్థానిక ఎన్నికల్లో లభించిన అవకాశాలను పదిలపరుచువాలని ఏపీలో అధికారపక్షం వేస్తున్న ఎత్తులు టీడీపీ అధినేత చంద్రబాబు సహా కీలక నేతలందరికీ కంటిమీద కునుకులేని స్థితిని తీసుకొచ్చింది. కుప్పం కాపాడుకోవడానికే చంద్రబాబు కసరత్తులు చేయాల్సిన దశలో రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని ఆయన ఎలా గట్టెక్కిస్తారన్నది అనేక మందికి మింగుడుపడడం లేదు.

చంద్రబాబు తర్వాత చినబాబు మీద పెద్దగా ఆశలు కనిపించడం లేదు. కుల, ప్రాంతీయ సమీకరణాలు పెద్ద సవాల్ గా తయారవుతున్నాయి. పార్టీ చుట్టూ సవాలక్ష ప్రశ్నలు సంధిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు స్టామినా మీద విశ్వాసం పార్టీ శ్రేణుల్లోనే తగ్గిపోతుంటే ఇక సామాన్యులను ఆకర్షించడం ఎలా అన్నదే టీడీపీకి ఎదురవుతున్న ప్రశ్న. అయితే చివరి వరకూ..ఇంకా చెప్పాలంటే పదే పదే చంద్రబాబు చెప్పినట్టు సంక్షోభంలో అవకాశాలు వెతుక్కోవడంలో ధిట్టగా భావించే చంద్రబాబు తీరు మాత్రమే నేటికీ టీడీపీని నిలబెడుతుందన్నది వాస్తవం. కానీ ఇప్పుడు ఆయనకే వ్యక్తిగతంగానూ సవాళ్ళు ఎదురవుతున్న దశలో నిలదొక్కుకోవడం ఎలా అన్నదే టీడీపీకి అర్థంకాని అంశంగా మారిపోయింది. ఈ అస్తవ్యస్త పరిస్థితుల్లో వేస్తున్న ఎత్తులు, తీసుకుంటున్న నిర్ణయాలు వ్యూహాత్మకంగా ఎదురుదెబ్బలుగా మిగులుతున్నాయి. దాంతో తెలుగుదేశం మళ్లీ అధికారం రుచి చూసేనా అనే సందేహాలను ఉధృతం చేస్తుండడం విశేషం.