iDreamPost
android-app
ios-app

సీఎం జగన్ ను కలిసి ధన్యవాదాలు తెలిపిన ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన విద్యార్థులు

సీఎం జగన్ ను కలిసి ధన్యవాదాలు తెలిపిన ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన విద్యార్థులు

తీవ్రమైన యుద్ద పరిస్థితుల్లో ఉక్రెయిన్‌ నుంచి తిరిగొచ్చిన ఏపీ వైద్య విద్యార్థులు.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని సోమవారం అసెంబ్లీ ఛాంబర్‌లో కలిశారు. యుద్ధ సమయంలో ఉక్రెయిన్ నుండి తమను సురక్షితంగా తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలకు, తీసుకున్న నిర్ణయాల విషయంలో కృతజ్ఞతలు తెలిపేందుకు ప్రతి జిల్లాకు ఒక్కొక్కరు చొప్పున విద్యార్థుల బృందం సచివాలయంలోని ఆయన ఛాంబర్‌లో సీఎంను కలుసుకుంది. నిజానికి ఉక్రెయిన్ నుంచి 692 మంది ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన విద్యార్థులను క్షేమంగా స్వదేశానికి తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. ఢిల్లీకి 549, ముంబైకి 143 మంది విద్యార్థులు చేరుకున్నారు. వారందరూ ఇంటికి చేరుకోవడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.

మరో 226 మంది విద్యార్థులు వారి స్వంత ఏర్పాట్ల ద్వారా వారి ఇళ్లకు చేరుకున్నారు. అలా మొత్తం 918 మంది ఉక్రెయిన్ నుండి తిరిగి వచ్చారు. ఉక్రెయిన్‌లో సంక్షోభం ప్రారంభమైన వెంటనే ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. విద్యార్థులను స్వదేశానికి తీసుకురావడానికి అన్ని చర్యలు తీసుకోవాలని విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్‌ను లేఖ ద్వారా అభ్యర్థించారు. ఈ ప్రయత్నాలకు కేంద్రానికి అండగా ఉంటామని సీఎం హామీ కూడా ఇచ్చారని తెలిపారు. భారత్‌కు తిరిగి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న తెలుగు విద్యార్థులు, ఎన్‌ఆర్‌టీల సమాచారం ఇవ్వాలని కోరుతూ జనవరి 30న రాయబార కార్యాలయానికి సీఎం జగన్ లేఖ రాశారు.

అంతేకాదు విద్యార్థులు సురక్షితంగా తిరిగి వచ్చేలా చూడడానికి రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ అధికారుల నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఉక్రెయిన్ సహా దాని సరిహద్దు దేశాలలోని భారత రాయబార కార్యాలయాలతో సమన్వయం చేసుకుంటూ టాస్క్‌ఫోర్స్ పని చేసింది. ఇక ఈ క్రమంలో వైఎస్ జగన్‌కు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఉక్రెయిన్‌లో పడ్డ ఇబ్బందుల్ని సీఎం జగన్‌కు వివరించారు. వారందరి మాటలు చాలా ఓపికగా విన్న జగన్ వారికి ధైర్యం చెప్పారు. చదువు కొనసాగే విషయం మీద అవసరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు.