Idream media
Idream media
తెలుగు జాతి గర్వించదగ్గ కవి శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ) కుమార్తె నిడుమోలు మాలా మద్రాస్ హైకోర్టు అడిషనల్ జడ్జిగా నియమితులయ్యారు. మద్రాస్ హైకోర్టుకు సుప్రీంకోర్టు కొలీజియం న్యాయవాదుల కోటాలో ఆరుగురి పేర్లను సిఫారసు చేసింది. అయితే వీరిలో మాలా, ఎస్. సౌందర్ పేర్లకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. ఈ నేపథ్యంలో మాలా ను అదనపు న్యాయమూర్తిగా నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ అడిషనల్ సెక్రటరీ రాజేందర్ కశ్యప్ ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీశ్రీ- సరోజ దంపతులకు నలుగురు సంతానం కాగా ఆ అందరిలో మాలా చిన్నవారు. మద్రాస్ లా కాలేజీ నుంచి ఆమె న్యాయశాస్త్రంలో డిగ్రీ పట్టా పొందారు.
1989లో మద్రాస్-పుదుచ్చేరి బార్ అసోసియేషన్ లో సభ్యురాలిగా నమోదు చేసుకున్నారు. అంటే సుమారుగా 32 ఏళ్లుగా మద్రాస్ హైకోర్టులో ప్రాక్టీసు చేస్తున్న ఆమె 2020 నుంచి పుదుచ్చేరి గవర్నమెంట్ ప్లీడర్ (జీపీ)గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మాలా భర్త నిడుమోలు రాధారమణ చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఉన్నతాధికారిగా పని చేస్తున్నారు. మాలా-రాధా రమణ దంపతులకు ఇద్దరు కుమారులు కాగా వారిలో పెద్దకుమారుడు శ్రీనివాస్ జయప్రకాశ్ కూడా హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు చేస్తున్నారు. సుప్రీంకోర్టు కొలీజియం ఈమధ్య కాలంలో తొమ్మిదిమందిని దేశంలోని ఐదు హైకోర్టుల్లో న్యాయమూర్తులు గా నియమించింది. వీరిలో ఆరుగురు న్యాయవాదులు, ముగ్గురు జ్యుడీషియల్ అధికారులు ఉన్నారు.
న్యాయవాదులైన రాహుల్ భర్తీ, మోక్షా ఖజూరియా ఖాజ్మీలను జమ్మూ కశ్మీర్ హైకోర్టుకు అదనపు న్యాయమూర్తులుగా నియమించారు. జ్యుడీషియల్ అధికారులు అయిన స్వర్ణకాంత్ శర్మ, పూనమ్ ఏ బొంబాలను ఢిల్లీ హైకోర్టుకు జడ్జ్‌లుగా, మరో జ్యుడీషియల్ అధికారి ఉమేశ్ చంద్ర శర్మను అలహాబాద్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమించారు. అడ్వకేట్ రాజీవ్ రాయ్, హరీశ్ కుమార్‌లను పాట్నా హైకోర్టులో న్యాయమూర్తులుగా నియమించారు.