Idream media
Idream media
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడి వారంరోజులు గడిచినా దాని ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపాలైంది. పంజాబ్‌లో అధికారం కోల్పోగా, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాలలోనూ అధికారంలోకి రాలేకపోయింది. ఇక ఉత్తరప్రదేశ్‌లో ఆ పార్టీ పరిస్థితి మరింత దిగజారింది. 403 సీట్లు ఉన్న ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ కేవలం రెండు సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్ ఎన్నికల బాధ్యత తీసుకున్నా.. పార్టీ చెప్పుకోదగ్గ ఫలితాలు సాధించలేకపోయింది.
ఐదు రాష్ట్రాలలో పార్టీ ఓటమి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రక్షాళన మొదలుపెట్టారు. ఐదు రాష్ట్రాల పీసీసీ అధ్యక్షుల రాజీనామాలను కోరారు. ఆ వెంటనే పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు సిద్ధూ, ఉత్తరాఖండ్ అధ్యక్షుడు గణేష్ గోడియాల్, ఉత్తరప్రదేశ్ అధ్యక్షుడు అజయ్ కుమార్ లల్లూ రాజీనామా చేశారు. ఇతర రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు అదే బాటలో ఉన్నారు. అయితే ఇక్కడే సోనియా గాంధీని బీజేపీ లక్ష్యంగా చేసుకుంటోంది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అంతా తానై నడిపించిన ప్రియాంక గాంధీపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది. ప్రియాంక గాంధీ ఇందుకు అతీతులా..? అంటూ సోనియా గాంధీని ఇరుకునపెట్టే ప్రయత్నం చేసింది.
ఉత్తరప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు అజయ్‌కుమార్ లల్లూ అయినా.. వాస్తవంగా ఎన్నికల్లో కర్త, కర్మ, క్రియ అంతా ప్రియాంక గాంధీనే. ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచే ఆమె ఓట్ల వేట మొదలుపెట్టారు. పార్టీ మేనిఫెస్టోను ప్రకటించడం నుంచి ప్రచారం వరకూ అంతా తానై నడిపారు. మహిళలకు 50 శాతం సీట్లు కేటాయించారు. పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు శాయశక్తులా కృషి చేశారు. అయినా ఫలితం లేకపోయింది. ప్రజల తరపున తాము పోరాడామని, వారి అభిమానాన్ని గెలుచుకున్నామని, అయితే ఆ అభిమానాన్ని ఓట్లుగా మలుచుకునే క్రమంలో విఫలమయ్యామని ఫలితాల తర్వాత ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారు. మళ్లీ ప్రతిపక్ష బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తామని, ప్రజల తరపున పోరాటం కొనసాగిస్తామని ఆమె స్పష్టం చేశారు. ఈ తరహాలో అంతా తానై వ్యవహరించిన ప్రియాంక గాంధీని ఓటమికి బాధ్యురాలిని చేయకుండా.. పీసీసీ అధ్యక్షుడిని రాజీనామా చేయమని ఆదేశించడంపై బీజేపీ విమర్శలు ఎక్కుపెట్టింది.
కాగా, ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకునేందుకు సోనియా గాంధీ సిద్ధమైన వేళ.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) వారించింది. పార్టీకి అధ్యక్షురాలుగా సోనియానే ఉండాలని ముక్తకంఠంతో కోరింది. కష్టకాలంలో పార్టీ ఐకత్యగా ముందుకు వెళ్లాలంటే సోనియా నాయకత్వం ద్వారానే సాధ్యమని సీడబ్ల్యూసీ సభ్యులు పేర్కొన్నారు. ఈ క్రమంలో సోనియా తన రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. అయితే సోనియా తప్పుకోవాలని కాంగ్రెస్ పార్టీ అసంతృప్తి జీ 23 నేతలు డిమాండ్ చేస్తున్నారు.