iDreamPost
iDreamPost
వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వం. అవసరాన్ని బట్టి ఇతర పార్టీలతో పొత్తులపై చర్చలు జరుపుతాం.. ప్రభుత్వంపై పోరాటానికి బీజేపీ వాళ్లు రోడ్డు మ్యాప్ ఇస్తామన్నారు. దానికోసం ఎదురుచూస్తున్నాను.. అని జనసేన ఆవిర్భావ దినోత్సవసభలో ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చాలా గంభీరంగా ప్రకటించారు. కానీ పవన్ ఎదురుచూస్తున్నానని చెబుతున్న రోడ్డు మ్యాపును తమ అగ్ర నేతలు ఎప్పుడో ఇచ్చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. దాంతో రెండు పార్టీల తీరుపై కొత్త అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎవరు చెప్పింది కరెక్టో అర్థం కాని పరిస్థితి నెలకొంది. పైగా పవన్ తన ప్రసంగంలో బీజేపీని నేరుగా తమ మిత్రపక్షమని ప్రకటించకుండానే.. వారి రోడ్డు మ్యాప్ కోసం ఎదురుచూస్తున్నానని చెప్పడం, అలాగే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వం అని చెప్పడం ద్వారా టీడీపీతో పొత్తుకు పరోక్షంగా సంకేతాలు ఇవ్వడం బీజేపీ నేతలకు మింగుడుపడనట్లు ఉంది. అందుకే సోము వీర్రాజు విశాఖలో మాట్లాడుతూ పదే పదే బీజేపీ-జనసేన కలిసి పనిచేస్తాయని చెప్పారు.
పవన్ కు తెలియని రోడ్డు మ్యాపా?
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై విలేకరుల ప్రశ్నలకు స్పందించిన వీర్రాజు రెండు నెలల క్రితం తిరుపతిలో సమావేశం జరిపినప్పుడే.. తమ పార్టీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వచ్చే ఎన్నికలకు సంబంధించిన రోడ్డు మ్యాప్ ఇచ్చేశారు. జనసేనతో కలిసి రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయాలని దిశానిర్దేశం చేశారన్నారు. అందులో భాగంగానే శక్తి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం, గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నాం, రాయలసీమ సమస్యలపై పోరాటంలో భాగంగా ఈ నెల 19న ఛలో కడప కార్యక్రమం చేపట్టామని వీర్రాజు వివరించారు. రోడ్డు మ్యాప్ కోసమే ఎదురు చూస్తున్నానని పవన్ కళ్యాణ్ చెబుతుంటే.. దాన్ని ఆయనకు ఇవ్వకుండా కనీసం జనసేనను కలుపుకొని వెళ్లకుండా బీజేపీ ఒంటరిగా ముందుకు వెళ్తున్నట్లు సోము మాటలతోనే స్పష్టం అవుతోంది. రాష్ట్రంలో బీజేపీ, జనసేన మధ్య అంతగా పొసగడం లేదని పవన్, వీర్రాజు వ్యాఖ్యలను బట్టి అర్థం చేసుకోవచ్చు.
ఆ రోడ్డు మ్యాప్ కోసం ఎదురుచూస్తున్నారేమో
అమిత్ షా ఇప్పటికే ఇచ్చేసినా రోడ్డు మ్యాపులో బీజేపీ-జనసేన సంబంధాల బలోపేతం, ప్రభుత్వంపై రెండు పార్టీలు కలిసి పోరాడటం గురించే ప్రస్తావించినట్లు స్పష్టం అవుతోంది. కానీ పవన్ వేరే రోడ్డు మ్యాప్ కోరుకుంటున్నట్లు కనిపిస్తోంది. బీజేపీ, జనసేనలతో టీడీపీని కూడా కలుపుకోవాలని ఆయన ఆశిస్తున్నారు. నేరుగా ఆ విషయం చెప్పకపోయినా పొత్తులపై ఇతర పార్టీలతో చర్చిస్తామనడం వెనుక మర్మం అదే. దానికి అవసరమైన రోడ్డు మ్యాప్ ఆయన కోరుకుంటున్నట్లున్నారు. ఆ ఉద్దేశంతోనే రోడ్డు మ్యాప్ కోసం ఎదురుచూస్తున్నానని చెప్పి ఉండవచ్చు. కానీ టీడీపీతో పొసగని బీజేపీ జనసేనతో పొత్తు కోసమే మాట్లాడుతోంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ-జనసేన ఉమ్మడిగా గెలిచి రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. పవన్ తమ మిత్రపక్ష పార్టీకి అధ్యక్షుడని, మిగతా విషయాలను తమ అగ్రనేతలు ఆయనతో మాట్లాడతారని వ్యాఖ్యానించారు.మొత్తం మీద టీడీపీ చుట్టూనే బీజేపీ, జనసేనల రోడ్డు మ్యాప్ రాజకీయాలు నడుస్తున్నాయి.