iDreamPost
iDreamPost
2024లో ఏపీలో అధికారం మాదే అని బీజేపీ నేతలు స్టేట్‌మెంట్‌లు ఇస్తున్నా అంత సీన్ లేదన్న సంగతి వారికీ తెలుసు! జనాన్ని ఆకర్షించడానికి, కేడర్‌లో జోష్ నింపడానికి, పబ్లిసిటీకి పనికొస్తుందని అలా మాట్లాడతారు అంతే. నిజానికి వారి దృష్టంతా ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదగడం పైనే. రాష్ట్రంలో తెలుగుదేశం పరిస్థితి బాగా దెబ్బతినడంతో ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి వారు ఎప్పటి నుంచో తీవ్రంగా యత్నిస్తున్నారు. అందుకే 2019 ఎన్నికలు ముగియగానే అధికార వైఎస్సార్ సీపీకి, టీడీపీకి సమాన దూరం పాటిస్తూ ఏపీలో పార్టీని విస్తరిస్తామని చెప్పుకున్నారు. ప్రజలు టీడీపీని తిరస్కరించారని, రాష్ట్రంలో తాము అసలైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని బీజేపీ నేతలు ప్రకటించారు కూడా. అప్పటి నుంచి టీడీపీతో పోటీపడి ప్రజల దృష్టిని ఆకర్షించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన పాదయాత్ర ప్రకటన తెలుగుదేశం పార్టీని డామినేట్ చేయడానికి వేసిన ఎత్తుగా కనిపిస్తోంది.
ఆదరా బాదరాగా ఎందుకు?
రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం త్వరలో బీజేపీ పాదయాత్ర చేపడుతోందని సోము వీర్రాజు తెలిపారు. ఆయన బుధవారం విజయనగరంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ధాన్యానికి సరైన గిట్టుబాటు ధర లేదన్నారు. ప్రభుత్వ ఆలోచనతో రైతులు సతమతమవుతున్నారని, వైఎస్సార్ సీపీ, టీడీపీ కలిసి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాయని ఆరోపించారు. అయితే పాదయాత్ర ఎప్పుడు చేస్తారు? ఎవరు చేస్తారు? లేక ఎందరు నాయకులు కలసి చేస్తారు? ఎన్నాళ్ల పాటు ఎక్కడి నుంచి ఎక్కడకు చేపడతారు వంటి వివరాలేమీ చెప్పకుండానే సోము వీర్రాజు ప్రకటన చేయడం ఆశ్చర్యం కలిగించింది. స్పష్టత లేకుండా ఆదరా బాదరాగా పాదయాత్ర ప్రకటన చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అన్న సందేహం ఎవరికైనా కలుగుతుంది.
వచ్చే ఎన్నికల్లో గెలుపు ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ తరపున పాదయాత్ర నిర్వహించాలని నిర్ణయమైతే జరిగింది కానీ అది ఎలా? ఎవరు నిర్వహించాలి? అన్న దానిపై తేల్చుకోలేకపోతున్నారు. వయసు రీత్యా చంద్రబాబు సుదీర్ఘ పాదయాత్ర చేయడం కష్టం కనుక పరిమిత ప్రాంతాల్లో ఆయన, ఎక్కువ ఏరియాల్లో ఆయన తనయుడు లోకేశ్ నిర్వహించేలా ప్రణాళికలు రచిస్తున్నారు. బహుశా జూన్ నుంచి ఆ పార్టీ తరపున పాదయాత్రలు ప్రారంభం కావచ్చు అంటున్నారు. దీనికి సంబంధించి టీడీపీ ప్రకటన రాకుండానే ముందుగా బీజేపీ తరపున పాదయాత్ర ప్రకటన చేస్తే తమకు మైలేజీ వస్తుందని భావించే సోము వీర్రాజు ఈ ఎత్తు వేశారని పరిశీలకులు భావిస్తున్నారు. అందుకే ఐడియా రావడం తడవుగానే పాదయాత్ర నిర్వహిస్తామని ప్రకటించేశారు. 2024 ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో మొట్టమొదట పాదయాత్ర చేసింది బీజేపీ అని జనం అనుకోవాలనేది ఆయన ఉద్దేశం కావచ్చని అనుకుంటున్నారు