ఆ వైసీపీ నేత గెలిస్తే సినీ నటుడు శివాజీ ఆత్మహత్య చేసుకుంటాడట..!

సినిమాల్లో కామెడీ చేస్తూ ప్రేక్షకులను నవ్వించే కొంతమంది నటులు.. రాజకీయాల్లోనూ అదే తరహా తీరును కొనసాగిస్తున్నారు. సినిమాల్లో మాదిరిగా రాజకీయాల్లోనూ కామెడీ చేస్తూ.. సినిమా అయినా, రాజకీయమైనా తమకు ఒకటేనని తాజాగా చాటిచెబుతున్నారు కామెడీ యాక్టర్‌ శివాజీ. సినిమాలు లేక ఖాళీగా ఉన్న శివాజీ టిక్కెట్‌ లేకుండానే ప్రేక్షకులకు వినోదం పంచుతున్నారు. తాజాగా శివాజీ చేసిన వ్యాఖ్యలు.. ఆయన మానసిక ప్రవర్తనపై అనుమానం కలిగేలా ఉన్నాయి.

కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే, మంత్రి కొడాలి నాని ఈ సారి గెలిస్తే.. తాను ఆత్మహత్య చేసుకుంటానని శివాజీ అన్నారు. అనడమే కాదు శపథం కూడా చేశారు. 2024 ఎన్నికల్లో కొడాలి నాని ఓడిపోతారని, ఒకవేళ గెలిస్తే తాను ఆత్మహత్య చేసుకుంటానని శివాజీ అనడం రాజకీయాల్లోనూ కామెడీ పండించవచ్చని నిరూపితమైంది. రాజకీయాల్లోకి వచ్చిన నటులు హుందాగా ఉన్నా.. శివాజీ, బండ్ల గణేష్‌ వంటి వారు తమ సహజసిద్ధమైన వ్యవహారశైలిని ఇక్కడ కూడా కొనసాగిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బండ్ల గణేష్‌ కూడా శివాజీ తరహాలోనే కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని ఓ ఇంటర్వ్యూలో ధీమా వ్యక్తం చేశారు. ఒక వేళ రాకపోతే ఏం చేస్తారని యాంకర్‌ ప్రశ్నించగా.. అత్యుత్సాహంతో 7 ఓ క్లాక్‌ బ్లేడ్‌తో పీక కోసుకుంటానని సవాల్‌ చేశారు. కాంగ్రెస్‌ గెలవలేదు. పీకకోసుకుంటానని సవాల్‌ చేసిన బండ్ల గణేష్‌ ఆ తర్వాత కూడా కామెడీ పండించారు. కొన్నాళ్లు మీడియాకు కనిపించకుండా తిరిగారు.

సినీ నటులు ఈ తరహా ప్రకటనలు చేయడం వెనుక.. అందరి అటెన్షన్‌ను తమ వైపునకు తిప్పుకోవడానికేనని స్పష్టంగా తెలుస్తోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో హడావుడి చేసిన శివాజీ.. గరుడ పురాణం చెబుతూ నిత్యం టీడీపీ అనుకూల మీడియాలో కనిపించేవారు. టీవీ9 సీఈవోగా రవిప్రకాశ్‌ ఉన్నప్పుడు.. ఆ ఛానెల్‌లో ఎక్కువగా కనిపించేవారు. టీడీపీకి అనుకూలంగా, వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ వార్తల్లో నిలిచేవారు. అయితే 2019 ఎన్నికల తర్వాత శివాజీ కనిపించకుండా పోయారు. కేసులు కూడా నమోదు కావడంతో పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లారు. మళ్లీ ఇప్పుడు వెలుగులోకి వచ్చారు. ప్రజలు, మీడియా మరచిపోయిన తనను.. మళ్లీ గుర్తుచేసుకునేలా కొడాలి నానిని లక్ష్యంగా చేసుకుని ఇలాంటి హాస్యాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. అనుకున్నట్లే అందరి అటెన్షన్‌ సంపాదించారు. కానీ 2024 ఎన్నికల్లో కొడాలి నాని గెలిస్తే.. ఆత్మహత్య చేసుకుంటానన్న శివాజీ.. 2019 ఎన్నికల తర్వాత మూడేళ్లు కనిపించకుండా పోయినట్లే.. కొన్నాళ్లపాటు కనుమరుగై పోతారనడంలో సందేహం లేదు.

Show comments