iDreamPost
android-app
ios-app

లాలూ పార్టీలో విలీనం కానున్న శరద్ యాదవ్ పార్టీ

  • Published Mar 17, 2022 | 4:57 PM Updated Updated Mar 17, 2022 | 5:31 PM
లాలూ పార్టీలో  విలీనం కానున్న శరద్ యాదవ్ పార్టీ

ఒకప్పటి జనతాదళ్ నుంచి ఏర్పడిన లోక్ తాంత్రిక్ జనతాదళ్ (ఎల్జేడీ), రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)లు కలిసిపోనున్నాయి. ఎల్జేడీ అధ్యక్షుడు శరద్ యాదవ్ ఈ విషయం ప్రకటించారు. ఈ నెల 20న తమపార్టీని ఆర్జేడీలో విలీనం చేయనున్నట్లు చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా 2024 నాటికి బలమైన ప్రతిపక్షాన్ని సిద్ధం చేయాలన్న లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. జనతాదళ్ గ్రూపులతో పాటు.. ఒకే భావజాలం ఉన్న పార్టీలను ఒకే గూటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నానని వివరించారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ పాలన తీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని యాదవ్ వ్యాఖ్యానించారు. దానికి వ్యతిరేకంగా బలమైన ప్రతిపక్షం కోసం వారంతా ఎదురుచూస్తున్నారని అన్నారు.

నాలుగేళ్లకే విలీనం

లోక్ తాంత్రిక్ జనతాదళ్ పార్టీని శరద్ యాదవ్ 2018 మే నెలలో ఏర్పాటు చేశారు. అప్పటివరకు జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ)లో ఉన్న ఆయన ఆ పార్టీ బీజేపీతో జతకట్టినందుకు నిరసనగా బయటకొచ్చి ఎల్జేడీని స్థాపించారు. దేశంలో సీనియర్ రాజకీయనేతల్లో ఒకరైన శరద్ యాదవ్ జనతా పార్టీ, జనతాదళ్ లలో కీలకపాత్ర పోషించారు. ఏడుసార్లు లోకసభ సభ్యుడిగా, మూడుసార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. సోషలిస్ట్ నేత జయప్రకాష్ నారాయణ్ నేతృత్వంలో పనిచేసిన శరద్ యాదవ్ ఆయన ప్రోత్సాహంతో 1974లో తొలిసారి లోకసభకు ఎన్నికయ్యారు. 1979లో జనతా ప్రయోగం విఫలమైన తర్వాత ఆ పార్టీ నుంచి వేరుపడిన చరణ్ సింగ్ నేతృత్వంలోని లోక్ దళ్ లో చేరారు. అనంతరం ఏర్పడిన జనతాదళ్ పార్టీలో చేరారు. 1999లో వాజపేయి నేతృత్వంలో ఏర్పడిన ఎన్డీయే ప్రభుత్వంలో పౌరవిమానయాన, వినియోగదారుల వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. 2003 నుంచి 2016 వరకు జేడీయూ జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో ఆయన్ని 2017లో జనతాదళ్ నుంచి తొలగించడమే కాకుండా రాజ్యసభ సభ్యుడిగా అనర్హత వేటు వేశారు.

రాజకీయ విరోధి చెంతకే

ఎల్జేడీని ఆర్జేడీలో విలీనం చేయాలని శరద్ యాదవ్ నిర్ణయించుకోవడం ఆసక్తి రేపుతోంది. ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ తో శరద్ కు దశాబ్దాల రాజకీయ వైరం ఉండటమే దానికి కారణం. బీహార్ రాష్ట్రానికి చెందిన ఈ ఇద్దరు నేతలు సుమారు మూడున్నర దశాబ్దాలు జనతాదళ్ లో కలిసి పనిచేసినా విరోధులుగానే ఉండేవారు. పశుగ్రాస కుంభకోణం కేసు విచారణ బాధ్యతను సీబీఐకి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ లాలూప్రసాద్ 1997లో జనతాదళ్ నుంచి బయటకొచ్చి ఆర్జేడీ పార్టీ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కూడా వారి మధ్య వైరం కొనసాగింది. తన సొంత నియోజకవర్గమైన మాధే పురాలో నాలుగుసార్లు గెలిచిన శరద్ ను 1998, 2004లో అదే నియోజకవర్గంలో లాలూ యాదవ్ స్వయంగా పోటీచేసి ఓడించారు. 2014లో ఆర్జేడీ అభ్యర్థి పప్పు యాదవ్ ఓడించారు. అయితే అదే శరద్ యాదవ్ 2019లో లాలూ పార్టీ ఆర్జేడీ టికెట్ పై పోటీ చేయడం విశేషం. అయితే జేడీయూ అభ్యర్థి దినేష్ యాదవ్ చేతిలో ఓటమి పాలయ్యారు.