iDreamPost
iDreamPost
తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసిందన్నట్టు ఉంది ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ధోరణి. పచ్చ పాత్రికేయంతో జబ్బు చేసిన ఆయన తాను రాసిందే రాత.. పలికిందే పలుకు అన్నట్టుగా రెచ్చిపోతున్నారు. ఈ వారం కొత్తపలుకులో రాజ్యాంగం, చట్టసభలు, న్యాయస్థానాలు. పాత్రికేయుడిగా తన హక్కులూ అంటూ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై తనదైన శైలిలో వక్రభాష్యం చెప్పేశారు.మూడు రాజధానులు, అమరావతి రైతులకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో అసెంబ్లీలో జరిగిన చర్చను తనదైన శైలిలో విశ్లేషించారు. కొన్ని కేసుల్లో నిందితులు అయిన సీఎం జగన్మోహన్ రెడ్డి,ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు న్యాయస్థానాలను దోషిగా నిలబెడుతూ ప్రసంగించారు అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. నిందితులకు అన్ని హక్కులూ ఉంటాయి అని,చట్టసభ సభ్యులుగా వారికి తమ అభిప్రాయాలను వ్యక్తంచేసే స్వేచ్ఛ ఉంటుంది అన్న సంగతి విస్మరించి రాధాకృష్ణ వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో సుదీర్ఘంగా, సవివరంగా ప్రసంగించిన సీఎం,ధర్మాన లేవనెత్తిన అంశాలపై కాకుండా పాఠకులను పక్కదారి పట్టించేలా సీఎంపై వ్యక్తిగత విమర్శలు గుప్పించారు.
2004లో అధికారంలోకి రాకముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆర్థిక పరిస్థితి ఏమిటి? 2009లో ఆ కుటుంబానికి అన్ని ఆస్తులు ఎలా వచ్చాయి అని ప్రశ్నించారు. ఇలాంటి ఆరోపణలకు రాజశేఖర రెడ్డి శాసనసభలో గతంలో చెప్పిన సమాధానం ఆంధ్రజ్యోతి ఉద్దేశ్యపూర్వకంగా మర్చిపోయినట్లు ఉంది.రాజశేఖర్ రెడ్డి ఆస్తులు, వ్యాపారాలు కట్టిన టాక్స్ ల గురించి శాసనసభలో సుదీర్ఘ వివరణ ఇచ్చారు.అదే సందర్భంలో మరి ఒక సాధారణ జర్నలిస్టు గా ఒకప్పుడు సైకిల్ పై తిరిగి వార్తలు సేకరించిన రాధాకృష్ణ ఇప్పుడు ఒక మీడియా హౌస్ కు అధిపతిగా ఎలా కాగలిగారు? అన్న విషయం మీద కూడా చర్చ జరిగింది.
సీఎం, అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ ప్రసంగంలో చట్ట సభలకు శాసనాలు చేసే స్వేచ్ఛ లేదంటే ఎలా అని ప్రశ్నించారు. 151 మంది సభ్యుల బలం ఉంది కదా అని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా ప్రశ్నించారని దీన్ని రాధాకృష్ణ వక్రీకరించారు.తనకు తిరుగులేని మెజార్టీ ఉందికదా అని జగన్ ఏమిచేసినా చెల్లుతుందని అనుకుంటున్నారని, తనను ఎవరూ ప్రశ్నించకూడదు అని అనుకుంటున్నారని రాసేశారు. అసలు సీఎం జగన్ తన మనసులో ఏమి అనుకుంటున్నారో రాధాకృష్ణకు ఎలా తెలుసు? సీఎం ఒక అహంభావి అని చిత్రీకరించడానికి వేమూరి వారు ఇలా దిగజారిపోయారని మనం అర్థం చేసుకోవాలన్న మాట!
జగన్ ప్రతిపక్షంలో ఉండగా పలు కేసుల విషయంలో కోర్టు తీర్పుల నుంచి ఊరట పొందారు. ఇప్పుడు రాజధాని అంశంలో తప్పు పట్టకూడదంటే ఎలా? అంటూ రాధాకృష్ణ తన తెలివితేటలు మొత్తం రంగరించి ఒక ప్రశ్న సంధించారు. అయితే గతంలో కోర్టులు తనకు అనుకూలంగా తీర్పు ఇచ్చాయి కదా అని ఇక ఎప్పుడూ కోర్టు తీర్పులను ప్రశ్నించకూడదనా రాధాకృష్ణ ఉద్దేశం!మరి అటువంటప్పుడు క్రమానుగత శ్రేణిలో ఇన్ని కోర్టులు, అప్పీలు చేసుకునే వెసులుబాటును న్యాయ వ్యవస్థ ఎందుకు కల్పించిందో రాధాకృష్ణ వివరిస్తే బావుండేది.
సీఎం కానీ, ఇతర అధికార పార్టీ ఎమ్మెల్యేలు కానీ కోర్టు తీర్పులో రాజధానిపై అసెంబ్లీకి చట్టం చేసే అధికారం లేదనడంపైనే అభ్యంతరం వ్యక్తం చేశారు. చట్టాలు చేయడం అనే మౌలికమైన హక్కును చట్టసభ ఎలా వదులుకుంటుంది అని ప్రశ్నించారు. ఇలా ప్రశ్నించడం జగన్ అహంకారానికి, గర్వానికి నిదర్శనం అన్నట్టు రాధాకృష్ణ తప్పుగా అన్వయించారు.
రామోజీరావు, రాధాకృష్ణ పేర్లను అసెంబ్లీలో ప్రస్తావించడం వారి హక్కులకు భంగమట!
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ప్రసంగంలో రామోజీరావు, రాధాకృష్ణ పేర్లను అసెంబ్లీలో ప్రస్తావించడం పాత్రికేయులుగా వారి హక్కులకు భంగం కలిగించినట్టు వేమూరి వారు అభివర్ణించారు. మరి నిత్యం ప్రజలెన్నుకున్న ప్రభుత్వంపై పాత్రికేయం ముసుగులో దాడిచేయడం ప్రజా ప్రయోజనాలకు భంగం కలిగించడం కాదా? నిరాధారమైన ఆరోపణలతో తమ మీడియా ద్వారా ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయడం, ముఖ్యమంత్రిపై వ్యక్తిత్వ హననానికి పాల్పడడం హక్కుల భంగం కాదా? సీఎం తమ పేర్లను చంద్రబాబుతో ముడిపెట్టి అసెంబ్లీలో ప్రస్తావించడం ద్వారా తమ విశ్వసనీయతను దెబ్బ తీయాలని చూశారని భాధాకృష్ణ వాపోయారు. తమ మీడియాలో తెలుగుదేశం అధినేతపై ఒక్క వ్యతిరేక కథనం కూడా ఇవ్వకుండా ఆయన భజన చేస్తున్నారు.సీఎం పైన, ఆయన పార్టీ పైన పాత కక్షలు ఉన్న వ్యక్తుల మాదిరిగా రోజూ దాడి చేస్తూ కూడా ఇంకా జనంలో విశ్వసనీయత ఉండాలని కోరుకోవడం, దాన్ని సీఎం జగన్ దెబ్బ తీస్తున్నారని వాపోవడం ఏమిటో..
అమరావతే రాజధానిగా ఉండాలట..
అధికార వికేంద్రీకరణతో అభివృద్ధి జరగదని, అందుకు హైదరాబాద్ లో హైకోర్టు ఉన్న పాతబస్తీ ఉదాహరణ అని రాధాకృష్ణ తేల్చేశారు. హైకోర్టు ఏర్పాటు చేస్తే రాయలసీమ అభివృద్ధి చెందుతుందని చెప్పడం జనాన్ని మోసగించడమే అని నిర్థారించేశారు. అసలు అధికార వికేంద్రీకరణ అంటే స్థానిక సంస్థలకు అధికారాలు బదలాయించడమే కాని మూడు రాజధానులు ఏర్పాటు చేయడం కాదని సూత్రీకరించారు. అంటే అమరావతి రాజధానిగా ఉండడమే జాతి ప్రయోజనాల రీత్యా అత్యావశ్యకమని వేమూరి వారు పరోక్షంగా ఉద్భోదించారు.
ప్రజలు గొంతెత్తకపోతే ఏపీ శ్రీలంకలా మారుతుందట…
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పటికైనా తమకు ఏమి కావాలో తేల్చుకోవాలి. అభివృద్ధి వద్దు, కులమతాల రొచ్చులోనే మునిగి తేలతాం అంటే వారి ఇస్టం. జగన్ కు ఒక్క రాజధాని కట్టే శక్తికూడా లేదని తేలిపోయింది! తలసరి ఆదాయం పెరుగుదలతో తెలంగాణ దూసుకుపోతుంటే, అప్పుల్లో ఏపీ ముందుకుపోతోంది అని వ్యాఖ్యానించిన రాధాకృష్ణ ప్రజలు గొంతెత్తాలని పిలుపునిచ్చారు. అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తలసరి ఆదాయాన్ని, అప్పును పోలుస్తూ వ్యాఖ్యానించిన రాధాకృష్ణ కేవలం తెలంగాణ తలసరి ఆదాయాన్ని మాత్రమే పేర్కొని ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో మునిగిపోయిందని బురద జల్లేశారు. రెండు రాష్ట్రాల తలసరి ఆదాయాన్ని, అప్పులను పేర్కొని ఉంటే ఈయన గారి విమర్శలో డొల్లతనం బయట పడుతుందని జాగ్రత్త పడి ఉంటారు.
ప్రజలు గొంతెత్తకపోతే ఆంధ్రప్రదేశ్..శ్రీలంకలా మారిపోతుందని హెచ్చరించారు. అంటే ప్రజలంతా ఏకమై ఏదోవిధంగా జగన్మోహనరెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేయాలి.ఈ రాష్ట్రాన్ని పాలించే సత్తా ఉన్న వన్ అండ్ ఓన్లీ నాయకుడు చంద్రబాబునాయుడిని మళ్లీ అధికారంలోకి తెచ్చేయాలి. అమరావతి రాజధానిగా ఆ చంద్ర తారార్కం నారా వారి వంశం పాలించాలి. అప్పుడే ఆంధ్ర ప్రజలు 2019లో చేసిన పాపానికి నిష్కృతి పొందుతారు. లేదంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కులమతాల రొచ్చులో కొట్టుకు పోతున్నట్టేనట!
ఇదీ రాధాకృష్ణ పాత్రికేయ హృదయం!