iDreamPost
android-app
ios-app

రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. ‘రైతులకు ఉచిత కరెంట్‌ ఇవ్వకూడదు’!

  • Published Jul 11, 2023 | 12:54 PM Updated Updated Jul 11, 2023 | 12:54 PM
  • Published Jul 11, 2023 | 12:54 PMUpdated Jul 11, 2023 | 12:54 PM
రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. ‘రైతులకు ఉచిత కరెంట్‌ ఇవ్వకూడదు’!

ఈ ఏడాది నిర్వహించిన తానా సభలు.. వివాదాలకు కేంద్ర బిందువులుగా మారుతున్నాయి. తానా వేదికగా టీడీపీ, జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులు తన్నుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా తానా మహాసభల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉచిత పథకాలపై మాట్లాడుతూ.. కేసీఆర్‌ అనవసరంగా రైతులకు 24 గంటల పాటు ఉచిత కరెంట్‌ ఇస్తున్నాడంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అన్నదాతల మేలు కోసం కేసీఆర్‌ సర్కార్‌ దేశంలో ఎక్కడా లేని విధంగా.. 24 గంటల పాటు ఉచిత కరెంట్‌ ఇస్తుండగా.. రేవంత్‌ రెడ్డి.. ఫ్రీ కరెంట్‌ ఇవ్వడం మంచిది కాదంటూ చేసిన వ్యాఖ్యలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు..

తానా మహాసభల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన రేవంత్ రెడ్డి.. ఈ సందర్భంగా అక్కడ కాంగ్రెస్ అభిమానులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. వారితో ముచ్చటిస్తూ.. ఉచిత పథకాలపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు అనవసరంగా ఉచిత పథకాలు అందిస్తున్నారని, అలా అందించకూడదన్నారు రేవంత్‌ రెడ్డి. అంతేకాక కేసీఆర్ అనవసరంగా రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తున్నారని.. అలా ఇవ్వకూడదని.. రైతులకు కేవలం 3 గంటలు కరెంట్ ఇస్తే సరిపోతుందంటూ రేవంత్‌ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

రేవంత్ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతులకు 24 గంటలు కరెంట్ ఇస్తే తప్పేంటని జనాలు ఆయనను ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఉచిత పథకాలు అమలు చేయడం లేదా అని నిలదీస్తున్నారు. ఇటీవల కర్ణాటకలో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ ఇచ్చిన ఉచిత హామీలతో పాటు తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు వృద్ధులకు రూ.4 వేల పింఛన్‌తో పాటు రైతులు, యువ డిక్లరేషన్లలో ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ.. ఉచితాలు మంచిది కావు అన్నారు.. బానే ఉంది.. మరి మీ పార్టీ ఎందుకు ఇన్ని ఉచిత హామీలు ప్రకటించింది అని ప్రశ్నిస్తున్నారు.

రేవంత్ వ్యాఖ్యలపై అధికార బీఆర్ఎస్ మండిపడుతోంది. రైతులకు 24 గంటల ఫ్రీ కరెంట్ ఇస్తే.. రేవంత్‌కు జరిగే నష్టమేంటి అని బీఆర్‌ఎస్‌ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇక రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలను తప్పుపట్టిన కేటీఆర్‌.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చారు. ఇక రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పు పట్టారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.