iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ లో మత రాజకీయాలు రాజేయాలనే యత్నాలు ఫలించడం లేదు. అప్పట్లో అంతర్వేది రథం ఘటన నుంచి తాజాగా ఓ చిన్న గ్రామంలో జరిగిన సంఘటన వరకూ అన్నింటినీ భూతద్దంలో చూపించి ఫలితం పొందాలని బీజేపీ ఆశిస్తోంది. కానీ వాస్తవాలకు విరుద్ధంగా సాగుతున్న వారి ప్రచారం బెడిసికొడుతోంది. బూమరాంగ్ అవుతోంది. బీజేపీ పరువు తీస్తోంది. అంతర్వేది రథం ఘటనలో సీబీఐ దర్యాప్తు చేయాలని ఏపీ ప్రభుత్వం కోరినప్పటికీ కేంద్రం స్పందించలేదు. అంటే రాష్ట్రంలో బీజేపీ నాయకులు రంకెలేయడమే తప్ప అలాంటి సమస్యల మీద కేంద్ర ప్రభుత్వానికి పెద్దగా ఆసక్తిలేదనే అంశాన్ని అంతర్వేది ఘటన రుజువు చేసింది.
అయినా గానీ ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ దియోదర్ తాజాగా తూర్పు గోదావరి జిల్లా కే గంగవరం లో జరిగిన చిన్న ఘటనను భూతద్దంలో చూపించాలనే యత్నం చేశారు. కుటుంబ తగాదాకి మతం రంగు పూసే ప్రయత్నానికి దిగారు. వాస్తవాలు తెలుసుకోకుండా రామాలయంలో క్రైస్తవ కూటములంటూ ట్విట్టర్ లో ప్రచారానికి దిగారు. వెంటనే అప్రమత్తమైన ఏపీ పోలీస్ యంత్రాంగం, డిజిటల్ కార్పోరేషన్ బృందాలు ఫ్యాక్ట్ చెక్ ద్వారా బీజేపీ సీనియర్ నేతల ప్రచారానికి చెక్ పెట్టాయి. వాస్తవాలను విస్మరించి చేస్తున్న ప్రచారానికి వీడియోల సాక్ష్యంతో విరుగుడు మంత్రం వేశాయి.
వాస్తవానికి ఆ గ్రామంలో కాదా మంగాయమ్మ అనే క్రిస్టియన్ మహిళ కొడుకుల మధ్య ఆస్తితగాదాలో పెద్ద కొడుకు ఆగ్రహంతో ఉన్నారు. తన తల్లి ఇంటి ఎదురుగా రోడ్డు మీద నిర్వహించిన కూటమిని ఆధారంగా చేసుకుని ఆమె మీద ప్రచారానికి దిగాడు. సోషల్ మీడియాలో క్రైస్తవ కూటమి ప్రచారం పోస్ట్ చేశాడు. దానిని అందుకుని బీజేపీ నాయకులు ప్రశాంతంగా ఉన్న చిన్న పల్లెలో ఈ వ్యవహారాన్ని ఆసరాగా చేసుకుని మత కలహాలకు చేసిన యత్నానికి అడ్డుకట్టవేసేందుకు అధికార యంత్రాంగం తీసుకున్న చొరవ అభినందనీయం అని పలువురు భావిస్తున్నారు. రామాలయానికి సమీపంలో రోడ్డు మీద ఉన్న షెడ్డులో చాలాకాలంగా అన్ని మతాల ప్రార్థనలు జరుగుతున్న చోటనే సాగిన చిన్న కూటమిని ఆలయంలో జరిగిందంటూ వక్రీకరించే యత్నాలకు చెక్ పెట్టడం విశేషం.
ఈ పరిణామాలను ఊహించని బీజేపీ నేతలు ఖంగుతిన్నారు. రామాలయానికి కూటమి జరిగిన ప్రాంతానికి సంబంధం లేకపోయినా ఆలయంలో కూటమి అంటూ కూసిన ట్విట్టర్ కూతలను పలువురు దుయ్యబట్టారు. ఇలాంటి కుయత్నాలు ఆపార్టీ మానుకోవాలని సూచించారు. సామాన్య పేదలు అంతా కలిసి మెలిసి సాగుతున్న చోట విచ్ఛిన్నయత్నాలు విరమించుకోవాలని ట్విట్టర్ లో కౌంటర్లు పడుతుండడం విశేషం.