iDreamPost
android-app
ios-app

కాంగ్రెస్ రాసుకుంటున్న మరణశాసనం

  • Published Mar 10, 2022 | 6:53 PM Updated Updated Mar 11, 2022 | 6:15 AM
కాంగ్రెస్ రాసుకుంటున్న మరణశాసనం

గ్రాండ్ ఓల్డ్ పార్టీగా, కొన్ని దశాబ్దాలపాటు దేశాన్ని ఏకఛత్రాధిపత్యంతో ఏలిన పార్టీగా ఎంతో ఘనచరిత్ర కలిగిన కాంగ్రెసు క్రమంగా పాతాళానికి దిగజారిపోతోంది. కేంద్రంలో అధికారానికి రెండు విడతలు దూరమైన ఆ పార్టీ రాష్ట్రాల్లోనూ ప్రాభవం కోల్పోతోంది. ఎన్నికలు జరుగుతున్నప్పుడల్లా ఒక్కో రాష్ట్రాన్ని కోల్పోతూ వస్తోంది. పునర్వైభవం కోసం ఎంత ప్రయత్నిస్తుంటే అంతగా పతనం అవుతోంది. తాజాగా వెలువడిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే కాంగ్రెస్ పరిస్థితే దారుణం. అంతర్గత కలహాలతో పంజాబ్ లో ఉన్న అధికారాన్ని కోల్పోయింది. ఉత్తరాఖండ్ హస్తగతం అవుతుందనుకుంటే అదీ చేజారిపోయింది. ఇక పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ దీనస్థితి చెప్పనలవి కాదు. 400 స్థానాల్లో పోటీ చేస్తే ఇంతవరకు ఒక్కటి మాత్రమే గెలిచింది. గత ఎన్నికల్లో గెలిచిన 9 సీట్లనైనా నిలబెట్టుకోలేక పూర్తిగా చతికిల పడింది. మణిపూర్, గోవాల్లోనూ ప్రస్తుతం ఉన్న సీట్లను కాపాడుకోవడంలో దారుణంగా విఫలమైంది. ఈ పరిణామాలు చూస్తే కాంగ్రెస్ భవిష్యత్తులో పుంజుకోవడం కష్టంగానే కనిపిస్తోంది.

రెండు రాష్ట్రాల్లోనే అధికారం

ఒకప్పుడు దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ జెండా ఎగురవేసిన కాంగ్రెస్ పంజాబ్ రాష్ట్రాన్ని కోల్పోవడంతో రెండు రాష్ట్రాలకే పరిమితం అయ్యింది. మహారాష్ట్ర, చత్తీస్గఢ్ రాష్ట్రాల్లోనే ఆ పార్టీ ప్రభుత్వాలు ఉండగా మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వ భాగస్వామిగా ఉంది. గత ఏడాది జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో తమిళనాట డీఎంకేతో పొత్తు వల్ల కొన్ని సీట్లు గెలుచుకున్నా.. పశ్చిమ బెంగాల్, కేరళ, పుదుచ్చేరి, అసోం ఎన్నికల్లో పెద్ద ప్రభావం చూపలేకపోయింది. ప్రస్తుత ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పంజాబ్ ను చేజార్చుకుంది.

యూపీలో పతనం ఇప్పటిది కాదు

ఇక దేశంలో అతిపెద్ద రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వానికి గేట్ వే గా పేరుపొందిన యూపీలో కాంగ్రెస్ పతనం ఇప్పటిది కాదు. 1985 తర్వాత నుంచి అక్కడ కాంగ్రెస్ క్రమంగా కుంగిపోతూ వచ్చింది. 1985 అసెంబ్లీ ఎన్నికల్లో 269 స్థానాలతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ఆ తర్వాత ఇంకెప్పుడు ఆ స్థాయి పనితీరు కనబరచలేదు. 1991లో 46 సీట్లకే పరిమితమై బీజేపీకి అధికారం అప్పగించింది. ఆరేళ్ల కాలంలో కాంగ్రెస్ 83 శాతం పతనంకావడం గమనార్హం. ఆ తర్వాత కూడా కోలుకోలేకపోయింది. 1996 నుంచి యూపీ అసెంబ్లీలో కాంగ్రెస్ బలం సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యింది. ఈసారి ఎన్నికల భారం మొత్తాన్ని కాంగ్రెస్ తరుపుముక్కగా భావిస్తున్న ప్రియాంక గాంధీ మోసి, విస్తృత ప్రచారం చేసినా, మహిళా అజెండా ఎత్తుకున్నా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారని ఫలితాలు స్పష్టం చేశాయి.

జాతీయ స్థాయిలోనూ అదే పరిస్థితి

జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్ పరిస్థితి ఆశాజనకంగా లేదు. 1984 లోక్సభ ఎన్నికల్లో 404 సీట్లతో భారీ విజయం సాధించిన ఆ పార్టీ పరిస్థితి ఆ తర్వాత నుంచి క్రమంగా దిగజారుతూ వచ్చింది. 1989లో దాని బలం 207కు తగ్గింది. 2004లో యూపీఏ కూటమి ఏర్పాటు చేసి ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగినా 2009లో 206 సీట్లకు తగ్గిపోయింది. 2014లో కేవలం 44 సీట్లకు పరిమితమై ఎన్డీయేకు అధికారం అప్పగించింది. 2019 ఎన్నికల్లోనూ 52 సీట్లకే పరిమితం అయ్యింది.

కాంగ్రెస్ పతనానికి దాని స్వయంకృతాపరాధాలే చాలా వరకు కారణం. అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో పార్టీ నేతల మధ్య ఆధిపత్యపోరు, సమయానుకూల నిర్ణయాలు తీసుకోవడంలో వైఫల్యం, సరైన విధానాలు, వ్యూహాలు లోపించడం, వరుస ఓటముల వల్ల రాష్ట్రాల్లో నేతలు, కార్యకర్తలు చెదిరిపోవడం తదితర కారణాల కాంగ్రెస్ పతనాన్ని శాసిస్తున్నాయి. అన్నింటికీ మించి పార్టీని ముందుండి నడిపించే బలమైన నాయకత్వ లోపం కాంగ్రెసును తీవ్రంగా దెబ్బతీస్తోంది. మరోవైపు బీజేపీ దూకుడు విధానాలు, మతపరమైన పోలరైజేషన్, ఒకసారి ఓటమిపాలైనా కుంగిపోకుండా రెట్టించిన ఉత్సాహంతో లేచి నిలబడగలిగే ఆ పార్టీ విధానాలను ధీటుగా ఎదుర్కోలేని పరిస్థితి కాంగ్రెసును పతనావస్థకు చేర్చింది.