iDreamPost
iDreamPost
నారా చంద్రబాబునాయుడు. సుదీర్ఘ ఉపన్యాసాల్లో ఆయనదో ప్రత్యేక శైలి. గంటల తరబడి మాట్లాడుతూ ఉండడం ఆయన నైజం. వినేవాళ్లు ఎదురుగా ఉన్నా లేకున్నా ఆయన చెప్పాలనుకున్నది చెప్పి తీరడం ఆయనకున్న అలవాటు. బహిరంగసభల్లో కూడా కుర్చీలన్నీ ఖాళీ అయిన తర్వాత కూడా కనీసం గంట పాటు ఉపన్యసించి గానీ దిగి రావడం ఆయనకు తెలియదు. ఎదురుగా సభ ఉన్నవాళ్లు లేచివెళ్లిపోయినా టీవీలలో చూస్తున్న వారంతా తన ఉపన్యాసం వింటారనేది ఆయన నమ్మకం అనుకోవాలి. కానీ ఇప్పుడు ఆయన నమ్మకాన్ని తమ్ముళ్లే వమ్ము చేస్తున్నారు. చంద్రబాబు సుదీర్ఘ ఉపన్యాసాలకు తెలుగుదేశం పార్టీ నేతలు కూడా తలలు పట్టుకునే పరిస్థితి వచ్చింది.
అధికారంలో ఉన్నప్పుడు గంటల తరబడి సమీక్షలు, పగ్గాలు కోల్పోయి పక్కన కూర్చున్న తర్వాత కూడా సుదీర్ఘ ప్రెస్ మీట్లతో మీడియా వాళ్ల సహనానికి కూడా చంద్రబాబు పరీక్షలు పెడుతూ ఉంటారు. అలాంటిది ఇటీవల ఆయన తీరు మారింది. చివరకు ప్రెస్ మీట్ పెట్టి చాలాకాలమే అయిపోతోంది. ఇంత పెద్ద విరామం ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితంలోనే లేదేమో. గడిచిన 20 ఏళ్లతో రెండు నెలల పాటు మీడియా ముందుకు రాకుండా ఆయన ఓపిక పట్టిన వైనం లేదు. కానీ ఇప్పుడు ప్రెస్ మీట్ కి కూడా ఆయన దూరమయిన తీరు ఆసక్తిగా మారింది.
ఇటీవల రాధాకృష్ణ వంటి తమ ఆంధ్రజ్యోతి పత్రికలో సైతం చంద్రబాబుని ఎద్దేవా చేశారు. అలాంటి ఉపన్యాసాలతో తమ్ముళ్లే తల్లడిల్లిపోతున్నారని బహిరంగంగానే వ్యాఖ్యానించాల్సి వచ్చింది. అంతకుముందు నుంచి అనేక మంది నేతలు చంద్రబాబు సుదీర్ఘ ఉపన్యాసాల వల్ల క్యాడర్ సత్తువ హరించుకుపోయేలా ఉందనే అభిప్రాయం వెలిబుచ్చుతూ వచ్చారు. అధికారంలో ఉండగా చంద్రబాబుకి చెప్పలేకపోయిన వారు సైతం, ఇటీవల ఆయన ఇమేజ్ తగ్గుతున్న సంకేతాలతో బాబుని నియంత్రించే దిశలో సాగుతున్నారు. అందుకు తగ్గట్టుగా ఆయన నోరు నియంత్రణలో పెట్టుకోవాలనే అభిప్రాయం కుండబద్దలు కొట్టినట్టు చెప్పేసినట్టు తెలుస్తోంది. ఓవైపు జగన్ తక్కువ మాట్లాడుతూ, ఎక్కువ పనులు చేస్తుంటే చంద్రబాబు దానికి విరుద్ధంగా ఎక్కువ మాట్లాడుతూ, తక్కువ పనులు చేసే నాయకుడిగా జనంలో ముద్రపడుతుందనే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లగలిగినట్టు కనిపిస్తోంది.
చివరకు చంద్రబాబు నోరు నొక్కేశారో లేక ఆయనే తన నోరు కట్టేసుకున్నారో తెలియదు గానీ పెగాసస్ వంటి అంశాల్లో సైతం ఆయన పెదవి విప్పలేని పరిస్థితి వచ్చేసింది. అదే సమయంలో రాజకీయంగానూ టీడీపీకి ఏది మాట్లాడితే ఎక్కడికి దారితీస్తుందోననే ఆందోళన కూడా ఉంది. రాజకీయంగా ప్రజల్లో పట్టు చిక్కకపోవడం కూడా కలవరపెడుతోంది. ఈ దశలో చంద్రబాబు మాటలతో తలవంపులు తెస్తున్నాయనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. ఇటీవల ఉక్రెయిన్ విషయంలో వీడియో కాన్ఫరెన్సులో చేసిన వ్యాఖ్యలే వైరల్ అయ్యాయి. పలువురు ఎద్దేవా చేశారు. దాంతో బాబుని నియంత్రించేందుకు టీడీపీ ప్రయత్నం చేసిందనే వాదన బలపడుతోంది. ఏమయినా చంద్రబాబు మీడియా సమావేశాలు, బహిరంగ ఉపన్యాసాలు తగ్గించుకోవడం మాత్రం ఆసక్తికరమే.