iDreamPost
android-app
ios-app

మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.. సొంత ఇల్లు లేదు.. ఆర్టీసీలోనే ప్రయాణం

  • Published Oct 27, 2023 | 8:47 PM Updated Updated Oct 27, 2023 | 8:47 PM

సర్పంచ్‌గా గెలిస్తేనే.. లక్షలు ఆర్జించే నేటి రోజుల్లో మూడు సార్లు ఎమ్మెల్యేగా చేసినా.. కనీసం సొంతిల్లు కూడా లేకుండా మిగిలిపోయారు ఓ నేత. ఆయన జీవితం నేటి తరం నాయకులకు ఆదర్శం. ఇంతకు ఎవరా వ్యక్తి అంటే..

సర్పంచ్‌గా గెలిస్తేనే.. లక్షలు ఆర్జించే నేటి రోజుల్లో మూడు సార్లు ఎమ్మెల్యేగా చేసినా.. కనీసం సొంతిల్లు కూడా లేకుండా మిగిలిపోయారు ఓ నేత. ఆయన జీవితం నేటి తరం నాయకులకు ఆదర్శం. ఇంతకు ఎవరా వ్యక్తి అంటే..

  • Published Oct 27, 2023 | 8:47 PMUpdated Oct 27, 2023 | 8:47 PM
మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.. సొంత ఇల్లు లేదు.. ఆర్టీసీలోనే ప్రయాణం

మన దగ్గర ఎన్నికలు అంటేనే ధన ప్రవాహం అనే అభిప్రాయం పాతుకుపోయింది. ఇక కొందరు నేతలు కూడా ఎన్నికల్లో గెలవడానికి ఒక్కసారి ఖర్చు చేస్తే చాలు.. ఆపైన భారీగా సంపాదించవచ్చని భావిస్తారు. సర్పంచ్‌ మొదలు.. ఎమ్మెల్యే, ఎంపీ వరకు.. వారి వారి స్థాయిలకు తగ్గట్టుగా ఆర్జిస్తారనే అభిప్రాయం ఉంది. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే నేత మాత్రం ఇందుకు భిన్నం. ఆయన ఏకంగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. కానీ సొంతిల్లు కూడా లేదు. ఎక్కడికైనా వెళ్లాలంటే ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేసేవారు. తన రాజకీయ జీవితంలో నిజాయతీకి నిలువుటద్దంలా నిలిచిన ఆ నేత ఎవరంటే..

సర్పంచ్‌గా గెలిస్తేనే.. లక్షలు ఆర్జించే నేటి రోజుల్లో మూడు సార్లు ఎమ్మెల్యేగా చేసినా.. కనీసం సొంతిల్లు కూడా లేకుండా మిగిలిపోయారు గుర్రం యాదగిరి రెడ్డి. రాజకీయాల్లో వివాదరహితుడిగా, నిజాయితీకి మారు పేరుగా గుర్తింపు తెచ్చుకున్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ నుండి వరుసగా మూడుసార్లు రామన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందారు యాదగిరి రెడ్డి.

వారసత్వంగా వచ్చిన పెంకుటింట్లోనే..

ఆయన స్వస్థలం యాదాద్రి జిల్లా గుండాల మండలం సుద్దాల. 1931, ఫిబ్రవరి 5న గుర్రం నర్సమ్మ, రాంరెడ్డి దంపతులకు ఆఖరి సంతానంగా జన్మించాడు. చిన్నతనంలో గొర్రెల కాపరిగా, వ్యవసాయం చేస్తూ జీవనం సాగించాడు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా సరే.. చివరి వరకు.. ఆయనకు తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా ఇచ్చిన మూడెకరాల భూమితో పాటు పాత పెంకుటింట్లోనే జీవనం సాగించాడు.

చిన్నప్పటి నుండి వామపక్ష భావాలు కలిగిన యాదగిరి రెడ్డి కమ్యూనిస్టు పార్టీ కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొనేవాడు. ఆ ఆసక్తితోనే రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1978 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. తొలసారి ఓడిపోయారు. ఆ తర్వాత ఉమ్మడి నల్గొండ జిల్లా రామన్నపేట నియోజకవర్గం నుంచి సీపీఐ తరపున పోటీ ఎన్నికల్లో పోటీ చేశారు.

1985, 1989, 1994 శాసనసభ ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు విజయం సాధించాడు. ఉప్పునూతల పురుషోత్తం రెడ్డిపై గెలుపొంది ఎమ్మెల్యే అయ్యాడు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నియోజకవర్గం అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించారు. నియోజకవర్గంలోని గ్రామాలకు రోడ్లు, విద్యుత్, మంచినీటి సౌకర్యాలను కల్పించడంతోపాటు పాఠశాలల, ప్రభుత్వ భవనాల ఏర్పాటు కోసం ఎనలేని కృషి చేశారు.

పిల్లల చదువంతా గవర్నమెంట్‌లోనే..

గుర్రం యాదగిరిరెడ్డికి నలుగురు సంతానం కాగా.. పెద్ద కుమారుడు గుర్రం రాజశేఖరరెడ్డి న్యాయవాదిగా, చిన్న కుమారుడు రాంమోహన్‌రెడ్డి హైదరాబాద్‌లోని ఓ పత్రికలో రిపోర్టర్‌గా పని చేస్తున్నారు. ఇక పెద్ద కుమార్తెను మోటకొండూర్‌ మండలం తేర్యాల గ్రామంలో వ్యవసాయ కుటుంబానికి చెందిన వ్యక్తికి వచ్చి పెళ్లి చేశాడు. చిన్న కుమార్తె హైదరాబాద్‌లో నివసిస్తోంది. యాదగిరి రెడ్డి తన పిల్లలను ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లోనే చదివించి అందరికి ఆదర్శంగా నిలిచాడు.

మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ యాదగిరిరెడ్డికి హైదరాబాద్‌లో సొంత ఇల్లు లేదు. స్వగ్రామం సుద్దాలలో తల్లిదండ్రుల ద్వారా సంక్రమించిన పెంకుటిల్లు మాత్రమే ఉంది. ఆయనకు కారు కూడా లేదు. ఎక్కడికన్నా వెళ్లాలంటే.. సామాన్యుల మాదిరి ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేసేవారు. ఆయన ఎమ్మెల్యేగా పని చేసినప్పుడు మాత్రమే కాక ఆ తర్వాత కూడా సామాన్య జీవితం గడిపారు. రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు ప్రజా శ్రేయస్సు కోసం పని చేస్తూ.. ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన గుర్రం యాదగిరిరెడ్డి 2019 నవంబరు 22న గుండెపోటుతో మృతి చెందారు. కానీ నియోజకవర్గ ప్రజలు మాత్రం ఆయన సేవలను స్మరించుకుంటూనే ఉన్నారు.