iDreamPost
android-app
ios-app

కాంగ్రెస్ పార్టీలో మళ్లీ పాత కథే, రాహుల్ పలాయనం, సోనియానే మళ్లీ దిక్కు

  • Published Mar 14, 2022 | 10:16 AM Updated Updated Mar 14, 2022 | 4:49 PM
కాంగ్రెస్ పార్టీలో మళ్లీ పాత కథే, రాహుల్ పలాయనం, సోనియానే మళ్లీ దిక్కు

కాంగ్రెస్ పార్టీ కథ మారడం లేదు. ఓవైపు దేశవ్యాప్తంగా వరుసగా ఆపార్టీ ఎదురుదెబ్బలు తింటోంది. ఒకనాడు రెండుపదుల సంఖ్యలో రాష్ట్రాలను ఏలిన పార్టీ ఇప్పుడు రెండు రాష్ట్రాలకే పరిమితమయ్యింది. అయినా గానీ పార్టీ నేతల్లోనూ, వారి వైఖరిలోనూ మార్పు కనిపించడంలేదు. అందుకు తాజాగా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన వర్కింగ్ కమిటీ సమావేశం అద్దంపడుతోంది. పార్టీకి అధ్యక్షులే లేకుండాపోయిన పరిస్థితిపై చాలాకాలంగా చర్చ సాగుతున్నా ఇంకా ఈ వ్యవహారమే కొలిక్కిరాలేదు. సారధి లేకుండా పార్టీ ముందుకు నడిచే అవకాశం కనిపించకపోయినా కాంగ్రెస్ నాయకత్వం కళ్లుతెరవడం లేదన్నది తాజా సమావేశం చెబుతున్న వాస్తవం.

కాంగ్రెస్ లో ఎవరు అవునన్నా,కాదన్నా గాంధీల కుటుంబానిదే పెత్తనం.కానీ రాహుల్ గాంధీ సమర్థవంతంగా వ్యవహరించలేక పోవడం ఆ కుటుంబానికే కాకుండా, కాంగ్రెస్ కే గుదిబండగా మారింది. కీలక సందర్భాల్లో ఆయన వైఖరి జనాలను ఆకట్టుకోలేకపోతోంది. పార్టీని నైరాశ్యం నుంచి గట్టెక్కించలేక పోతోంది. దాంతో అనివార్యంగా ఆరోగ్యం సహకరించక పోయినా సోనియా గాంధీనే పెద్దదిక్కుగా మారాల్సిన స్థితి వస్తోంది. తాజాగా జరిగిన సీడబ్య్లూసీ భేటీలో అద్యక్ష స్థానం మీద చర్చ సాగింది. అసమ్మతి వర్గం కూడా ముఖుల్ వాస్నిక్ పేరు ప్రతిపాదించినట్టు ప్రచారంలోకి వచ్చింది. అయితే సంస్థాగత ఎన్నికలు జరిగే వరకూ సోనియాగాంధీనే సారధిగా ఉంటారంటూ అధికారిక ప్రకటన వెలువడింది.

త్వరలో చింతన్ భైఠక్ సమావేశాలుంటాయని, దానికి ముందు సీడబ్య్లూసీ మరోసారి సమావేశమవుతుందని ప్రకటించారు. కానీ ఏడుపదుల వయసు దాటిన సోనియా ఇటీవల అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. చివరకు కీలక రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలోనూ కాలు బయట పెట్టలేకపోయారు. అలాంటి నాయకురాలిని సారధిగా ఎన్నుకోవాల్సిన స్థితిలో కాంగ్రెస్ ఉండడం ఆపార్టీ దుస్థితిని తేటతెల్లం చేస్తోంది. రాహుల్ గాంధీకి అనేక అవకాశాలు వచ్చినా సత్తా చాటలేకపోయారు. అవసరమైన సందర్భాల్లో సామర్థ్యాన్ని నిరూపించుకోలేకపోయారు. దాంతో ఆయన నాయకత్వాన్ని అత్యధికులు అంగీకరించే పరిస్థితి కనిపించడం లేదు. ప్రియాంక గాంధీ తన శక్తినంతా యూపీలో ధారపోశారు. అయినా కాంగ్రెస్ కుంచించుకుపోయింది. ఆమె ప్రభావం ఫలితాల్లో కనిపించలేదు. ఈ తరుణంలో రాహుల్ ని నాయకులు అంగీకరించకపోగా, ప్రియాంకకి నాయకత్వం ఇచ్చేందుకు ఆ కుటుంబంలో సుముఖతలేనట్టు కనిపిస్తోంది. అంతిమంగా మళ్లీ మళ్లీ సోనియా పేరుతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది.

1991లో రాజీవ్ గాంధీ హత్య తర్వాత సోనియా పేరు తెరమీదకు వచ్చింది. కాంగ్రెస్ సారధ్యం కొంతకాలంగా ప్రత్యక్షంగానూ, మరికొంతకాలం పరోక్షంగానూ ఆమె కనుసన్నల్లో సాగుతోంది. అంటే 30 ఏళ్ల పైబడి కాంగ్రెస్ కి ఆమె నాయకత్వం వహించాల్సిన స్థితి వచ్చింది. ఇంత సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ లో అన్నీతానై వ్యవహరించిన నాయకులు ఎవరూలేరంటే ఆశ్చర్యమే. నాయకత్వంలో మార్పు రాకపోవడం, పార్టీలో ఉత్తేజం నింపలేకపోవడం, చివరకు ప్రజలను ఆకట్టుకోలేకపోవడంతో కాంగ్రెస్ పరిస్థితి నానాటికీ తీసికట్టు అన్న చందంగా తయారవుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటూ మోడీ ఇచ్చిన పిలుపు ఆచరణలో కనిపించినా ఆశ్చర్యం లేదనే వారి సంఖ్య పెరుగుతుండడానికి ఈ పరిణామాలే కారణంగా భావించాల్సి ఉంటుంది.