iDreamPost
iDreamPost
నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు వైఖరి రోజురోజుకీ ఆశ్చర్యకరంగా మారుతోంది. చిన్నపిల్లల చేష్టలను తలపిస్తోంది. తానేదో ఊహించుకుని, ఏదో జరిగిపోతుందనే ఆందోళనలో ఉన్నట్టు కనిపిస్తోంది. తాజాగా ఆయన ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు రాసిన లేఖ దానికి అద్దంపడుతోంది. తాను హైదరాబాద్ లో ఉంటే కిడ్నాప్ చేస్తారని భయపడినట్టు ఆయనే పేర్కొన్నారు. అందుకే భయపడి ఢిల్లీకి వచ్చేశానని వివరించారు. ఏపీ పోలీసులు కిడ్నాప్ చేస్తారని భయపడి తాను ఢిల్లీని వదిలి వెళ్లడంలేదని పేర్కొనడం ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఆయన రాసిన లేఖలో పేర్కొనడం విస్మయకరంగా కనిపిస్తోంది.
నరసాపురం నుంచి ఆయన ఎంపీగా విజయం సాధించారు. బీఫారం ఇచ్చిన పార్టీ అధినేతను ఆయన ఎలానూ విమర్శిస్తున్నారు. జగన్ మీద ఆయన పదేపదే రాళ్లేసే ప్రయత్నం చేస్తున్నారు. చివరకు తనకు ఓట్లేసి గెలిపించిన ఓటర్లను కూడా ఆయన ఖాతరుచేయడం లేదు. కనీసం సొంత నియోజకవర్గానికి ఏదోటి చేయాలనే ఆలోచనే ఆయనకు లేదు. ప్రజలకు మొఖం చూపించడానికి కూడా ఆయన ససేమీరా అన్నారు. దానికి ఆయనచెప్పిన సాకులు చూసి ప్రజలు కూడా నోరెళ్లబెట్టారు. తాను ఏపీలో అడుగుపెడితే అరెస్ట్ చేస్తారని ఆయనే చెప్పుకున్నారు. అరెస్ట్ భయం ఎవరికుంటుంది, తప్పులుచేసినా, తప్పుడు కూతలు కూసినా భయపడాలి, లేదంటే అరెస్ట్ చేస్తారనే భయం ఎందుకుంటుందని సామాన్యులు సైతం ఆశ్చర్యపోవాల్సి వచ్చింది.
నరసాపురం వెళితే తనను ఏపీలో అరెస్ట్ చేస్తారని గతంలో చెప్పిన ఈ ఎంపీ, ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటే కిడ్నాప్ చేస్తారని లేఖరాయడం చూస్తుంటే అతనికి ఏమయ్యిందోననే చర్చ మొదలవుతుంది. మానసికంగా ఆయన ఏదయినా సమస్యతో ఉన్నారా అనే ప్రశ్న ఉదయిస్తోంది. ఓ ఎంపీని, అందులోనూ సీఆర్పీఎఫ్ రక్షణలో ఉన్న ఆయన్ని కిడ్నాప్ చేస్తారని ఢిల్లీ పారిపోవడం విస్మయకరంగా మారుతోంది. గత ఏడాది మే నెలలో తనను ఏపీకి తరలించినట్టుగా మరోసారి తీసుకెళతారనే భయం తనలో ఉందని ఆయనే చెబుతున్నారు. అప్పట్లో ఆయన విద్వేషాలు రగల్చడానికి చేసిన కేసులో అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాతనయినా బాధ్యతాయుతంగా మెలగకపోవడంతో మరిన్ని కేసులు ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ తరుణంలో నిందితులను విచారణకోసం అదుపులోకి తీసుకోవడం, ఆధారాలుంటే అరెస్టులు చేయడం పోలీసుల విధి.
నేరాలకు పాల్పడినవాళ్లు భయంతో పారిపోవాలి గానీ, ఇలా తాను నిబద్ధతతో ఉన్నానని చెప్పుకునే ఎంపీ భయంతో హైదరాబాద్ కూడా రావడంలేదని లేఖరాయడం నభూతో నభవిష్యత్ అన్నట్టుగా మారింది. పైగా తాను భయపడుతున్నానని లేఖరాయడం మరింత విచిత్రంగా కనిపిస్తోంది. ఈ ఎంపీ తీరు రానురాను జనాలు కూడా అనుమానించాల్సిన స్థితికి చేరుతోంది. ఆయనకు ఎవరు సలహాలు ఇస్తున్నారో గానీ ఇలాంటి చర్యలద్వారా తన పరువు తానే తీసుకుంటున్నాననే విషయం మరచిపోతున్నట్టున్నారనే అభిప్రాయం కొందరు వ్యక్తం చేస్తున్నారు