iDreamPost
android-app
ios-app

రాష్ట్రంలో మరో గిరిజన జిల్లా? -మంత్రి పేర్ని నాని సంకేతాలు

  • Published Apr 05, 2022 | 4:18 PM Updated Updated Apr 05, 2022 | 5:09 PM
రాష్ట్రంలో మరో గిరిజన జిల్లా?  -మంత్రి పేర్ని నాని సంకేతాలు

అధికార వికేంద్రీకరణ, ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల విభజన చేపట్టి పార్లమెంటు నియోజకవర్గం యూనిట్ గా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసింది. అయితే భౌగోళికంగా సుదూర ప్రాంతాల్లో విస్తరించి ఉన్న అరకు పార్లమెంటు నియోజకవర్గాన్ని మాత్రం రెండు జిల్లాలుగా విడదీసింది. దాంతో రాష్ట్రంలో మొత్తం 26 జిల్లాలు ఏర్పాటయ్యాయి. అయితే మరో జిల్లా ఏర్పాటు అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. సమాచార శాఖ మంత్రి పేర్ని నాని స్వయంగా దీనిపై సంకేతాలు ఇచ్చారు. గిరిజన ప్రాంతాలతో మరో జిల్లా ఏర్పాటు విషయం ముఖ్యమంత్రి జగన్ పరిశీలనలో ఉందని వెల్లడించారు. ఆ మేరకు పాడేరు అల్లూరి సీతారామరాజు జిల్లాను విడదీసి రంపచోడవరం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గిరిజనుల నుంచి ఈ డిమాండ్ కూడా ఉంది.

రెండు నుంచి మూడుకు గిరిజన జిల్లాలు

జిల్లాల పునర్విభజనలో భాగంగా ఎస్టీ నియోజకవర్గమైన అరకు పార్లమెంట్ నియోజకవర్గాన్ని ప్రభుత్వం రెండుగా విడదీసింది. శ్రీకాకుళం జిల్లాలో పాలకొండ, విజయనగరం జిల్లాలో పార్వతీపురం, సాలూరు, కురుపాం నియోజకవర్గాలు కలిపి పార్వతీపురం మన్యం జిల్లా ఏర్పాటయ్యింది. అలాగే విశాఖ జిల్లా పాడేరు, అరకు, తూర్పు గోదావరి జిల్లా రంప చోడవరంతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న చింతూరు, కేఆర్ పురం తదితర గిరిజన ప్రాంతాలను కలిపి పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు జిల్లా ఏర్పాటు చేశారు. అయితే ఉమ్మడి ఏపీలో ఖమ్మం జిల్లాలో ఉంటూ.. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో చేరి ఉభయ గోదావరి జిల్లాల్లో విలీనం అయిన భద్రాచలం నియోజకవర్గంలోని ఏజెన్సీ మండలాలను అల్లూరి జిల్లాలో చేర్చడంతో కష్టాలు తప్పవన్న ఆందోళన ఏర్పడింది. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన రంపచోడవరం, రాజవొమ్మంగి, దేవిపట్నం, చింతూరు, అడ్డతీగల, వై.రామవరం, మారేడుమిల్లి, కూనవరం, వీఆర్ పురం, నెల్లిపాక, గంగవరం మండలాలను అల్లూరి జిల్లాలో చేర్చారు. వీటిలో చాలా మండలాలలోని గ్రామాలు కొత్త జిల్లా కేంద్రమైన పాడేరుకు సుమారు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అందువల్ల రంపచోడవరం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని ఆయా ప్రాంతాల ప్రజలు కొత్త జిల్లాల ప్రతిపాదన తెరపైకి వచ్చినప్పుడే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

రవాణా సౌకర్యాలే ప్రధాన సమస్య

ఈ మండలాలన్నీ అటవీ ప్రాంతాల్లో ఉన్నవే కావడం వల్ల రవాణా సమస్య ఎక్కువ. మారుమూల పల్లెల్లో ఉన్నవారు ప్రధాన మార్గాల్లోకి రావడానికి చాలా కష్టపడుతుంటారు. ఏ అవసరం ఉన్నా రాజమండ్రికి వెళ్తుంటారు. ఇప్పుడు పాడేరు జిల్లాలో చేర్చడంతో ప్రభుత్వ పనులకోసం పాడేరుకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ గిరిజన గ్రామాల నుంచి సరైన రోడ్లు, బస్సు సౌకర్యాలు లేనందున పాడేరు వెళ్లాలంటే దాదాపు ఒక రోజు పడుతుంది. ఈ సమస్యలతోపాటు, స్థానికుల డిమాండ్లను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. ఈ మండలాలను కలిపి ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేసే అంశాన్ని సీఎం జగన్ పరిశీలిస్తున్నట్లు మంత్రి పేర్ని నాని మాటలను బట్టి అర్థం అవుతోంది. అదే జరిగితే ఇప్పటికే అల్లూరి సీతారామరాజు, మన్యం జిల్లాకు అదనంగా మూడో గిరిజన జిల్లా అవతరిస్తుంది.