iDreamPost
iDreamPost
గత కొద్దిరోజులుగా కాంగ్రెస్, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చుట్టూ తిరుగుతున్న రాజకీయాలలో అతిపెద్ద ట్విస్ట్ చోటుచేసుకుంది. 2024 ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ను ధీటుగా నిలబెట్టి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రశాంత్ కిషోర్ తో ఆ పార్టీ వరుసపెట్టి సమావేశాలు నిర్వహించడం, ఈరోజో రేపో పీకే కాంగ్రెస్ లో చేరి, కీలక బాధ్యతలు చేపట్టబోతున్నారని ప్రచారం జరుగుతున్న తరుణంలో.. ప్రశాంత్ కిషోర్ పార్టీలో చేరడంలేదని ప్రకటన రావడం రాజకీయవర్గాలను విస్మయానికి గురిచేసింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలాతోపాటు పీకే కూడా తమ ట్విట్టర్ పోస్టుల ద్వారా ధృవీకరించారు.
కాంగ్రెస్ లో చేరికకు నిరాకరణ
కాంగ్రెస్ లో చేరేందుకు ప్రశాంత్ కిషోర్ నిరాకరించారని రణదీప్ సూర్జేవాలా వెల్లడించారు. 2024 ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేసేందుకు పీకే ఇచ్చిన వ్యూహాలు, సూచనల అమలుకు పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఎంపవర్మెంట్ కమిటీని నియమించారు. అందులో చేరి, వ్యూహాలు అమలు బాధ్యత స్వీకరించాలని పీకేను సోనియా కోరగా ఆయన నిరాకరించారని సూర్జేవాలా వెల్లడించారు. ప్రశాంత్ కిషోర్ కూడా తన ట్విట్టర్ పోస్టులో ఇదే విషయం పేర్కొన్నారు. సాధికార కమిటీలో చేరి ఎన్నికల వ్యూహాల అమలు బాధ్యత తీసుకోవాలని కాంగ్రెస్ ఉదారంగా ఇచ్చిన ఆఫర్ ను తిరస్కరించినట్లు చెప్పారు. అతి పురాతనమైన కాంగ్రెస్ పార్టీలో జవసత్వాలు నింపడానికి తన అవసరం కంటే సమిష్టి సంకల్పం, సమర్థ నాయకత్వం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. గత ఏడాది కూడా ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ లో చేరికపై తీవ్ర చర్చ జరిగింది. ఆయన పలుమార్లు సోనియా, రాహుల్, ప్రియాంకలతో భేటీ అయ్యారు. పీకేను పార్టీలో చేర్చుకుంటే ఏ పదవి ఇవ్వాలన్న దానిపైనా మంతనాలు జరిగాయి. కానీ చివరికి ఆ ప్రతిపాదన నిలిచిపోయింది. ఇప్పుడు కూడా అదే జరగడం రాజకీయవర్గాలను విస్మయపరుస్తోంది.
ఇంతలోనే ఎందుకీ మార్పు?
ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ లో చేరడంపై దాదాపు నెలరోజులుగా విస్తృత ప్రచారం జరుగుతోంది. అందుకు తగినట్లే ఆయన పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో వరుసగా పలుమార్లు సమావేశం అయ్యారు. 2024 ఎన్నికల్లో ఆ పార్టీని అధికారానికి చేర్చేందుకు అనుసరించాల్సిన వ్యూహాలతో సుదీర్ఘమైన ప్రజంటేషన్ కూడా ఇచ్చారు. దాంతో పీకే కాంగ్రెస్ లో చేరడం ఖాయమని ప్రచారం జరిగింది. పీకే సూచనలపై చర్చించేందుకు సీనియర్ నేతలతో సోనియా ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. అది సమర్పించిన నివేదిక మేరకు పీకే సూచనల అమలుకు పార్టీలో ఎంపవర్మెంట్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో సభ్యుడిగా చేరి వ్యూహాల అమలు బాధ్యత చేపట్టాలన్న సోనియా ఆఫర్ ను పీకే తిరస్కరించడానికి కారణం ఆయన చేరికను పార్టీలో పలువురు సీనియర్లు వ్యతిరేకిస్తుండటమేనని అంటున్నారు. ప్రియాంక, అంబికాసోనీ, అశోక్ గెహ్లాట్ తదితరులు పీకే చేరికకు సుముఖంగా ఉండగా దిగ్విజయ్ సింగ్, ముకుల్ వాస్నిక్, జైరాం రమేష్ వంటి నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఎన్నికల వ్యూహకర్తగా పీకే పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలతో పనిచేస్తున్నందునే ఆయన పార్టీలోకి రావడాన్ని వారు వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ లో చేరకూడదని పీకే నిర్ణయించుకున్నట్లు సమాచారం.