Idream media
Idream media
ఎన్నికలు వస్తున్నాయంటే.. రాజకీయపార్టీ నేతల కన్నా.. ఏ పార్టీకీ చెందని ప్రశాంత్ కిశోర్ పేరు ప్రధానంగా తెరపైకి వస్తుంది. ఆయన 2013లో ఎన్నికల వ్యూహకర్తగా తొలి అడుగు వేశారు. 2014 లోక్ సభ ఎన్నికలకు బీజేపీ, నరేంద్ర మోడీతో కలిసి పనిచేశారు. ఆ ఎన్నికలలో బీజేపీ విజయం సాధించింది. మోడీ ప్రధాని అయ్యారు. ఏమైందో ఏమో కానీ.. ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన బీజేపీతో తెగతెంపులు చేసుకున్నారు. అంతే కాదు, ఇప్పుడు బీజీపీని ఓడించడమే ప్రధాన అజెండాగా పనిచేస్తున్నారు. అలాగే, ఆయన గతంలో కాంగ్రెస్, ఆప్, జేడీయూ, వైసీపీ పార్టీలకు కూడా పనిచేశారు. అదలా ఉంటే.. గతేడాది జరిగిన పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో, తృణమూల్ కాంగ్రెస్ కు వ్యూహకర్తగా పనిచేశారు.
అక్కడ ఆ పార్టీ కూడా ఘనవిజయం సాధించింది. మూడింట రెండు వంతుల మెజారిటీతో హ్యాట్రిక్ సాధించింది. మమతా బెనర్జీ ముచ్టటగా మూడవసారి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే, ఈ విజయం తృణమూల్ విజయమా? మమతా బెనర్జీ విజయమా? లేక ఆ ఎన్నికలలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా వ్యవహరించిన ప్రశాంత్ కిశోర్ (పీకే) విజయమా? అనే ప్రశ్నలు తలెత్తాయి. ప్రశాంత్ కిశోర్ విజయంగానే ప్రచారం జరిగింది. గెలిచింది తృణమూల్ మమత, గెలిపించింది పీకే అనే ప్రచారమే ఎక్కువగా జరిగింది. అంతేకాకుండా, అసెంబ్లీ ఎన్నికల తర్వాత, ఇకపై తాను ఎన్నికల వ్యూహకర్తగా కొనసాగనని, ప్రకటించిన ప్రశాంత్ కిశోర్ జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటుకు నడుం బిగించారు.
అయితే తృణమూల్ కాంగ్రెస్ లో పీకే చిచ్చు రగిల్చారని కూడా వార్తలొచ్చాయి. ఆయన వల్ల పార్టీ రెండుగా చీలిపోయే స్థితికి చేరుకుందని అంటున్నారు. మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీని జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించి, పార్టీ విస్తరణ బాధ్యతలను ఆయనకు అప్పగించడం వివాదాలకు ఆజ్యం పోసింది. దాని వెనుక పీకే డైరెక్షన్ ఉన్నట్లు ప్రచారం జరిగింది. పాత కొత్త తరం నాయకుల మధ్య విబేధాలు తలెత్తాయి. పార్టీ మమత వర్గం, అభిషేక్ వర్గంగా విడిపోయినట్లుగా మారింది. దీంతో మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీని జాతీయ ప్రదాన కార్యదర్శి పదవి నుంచి తప్పించారు. ఈ అంతర్గత కుమ్ములాటల కారణంగా, తృణమూల్ లో చేరిన గోవా మాజీ ముఖ్యమంత్రి ఫిలెరియో సహా పార్టీ టికెట్ ఇచ్చినా కొందరు నాయకులు అభ్యర్ధులు కూడా, మళ్ళీ సొంత గూటికి చేరుకున్నారు.
ఆ పరిణామాల నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ తో ప్రశాంత్ కిశోర్ హనీమూన్ ముగిసిపోయిందనే వార్తలు వచ్చాయి. పీకే పేరు వింటేనే దీదీ మండిపోతున్నారని పార్టీ సీనియర్ నాయకులు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. కాగా కోల్‌కతా వేదికగా టీఎంసీ రాష్ట్ర కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. సమావేశంలో భాగంగా పార్టీ నూతన రాష్ట్ర కమిటీని మమత ఎంపిక చేశారు. సుబ్రతో భక్షీని రాష్ట్ర అధ్యక్షునిగా, పార్థ చటర్జీని జనరల్ సెక్రటరీగా ఎంపిక చేశారు. వీరికి అదనంగా మరో 20 మందికి ఉపాధ్యక్ష పదవిని కట్టబెట్టారు. ఇదలాఉంటే.. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(పీకే) ఈ సమావేశానికి హాజరవ్వడం సంచలనంగా మారింది. మంగళవారం మమతతో కలిసి వేదిక పంచుకున్న ప్రశాంత్ కిషోర్ ఇప్పటి వరకు జరుగుతున్న ప్రచారానికి తెరదించారు.