Idream media
Idream media
ఏపీ ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో పూర్వవైభవం తెచ్చుకోవడం జీవన్మరణ సమస్యగా మారింది. మూడేళ్లుగా తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. వరుస వైఫల్యాలను మూటగట్టుకుంటోంది. జగన్ సర్కారుపై పోరాటానికి సరైన చాన్స్ రావడంలేదు. ప్రభుత్వం వైఫల్యాలు కనిపించడం లేదు. అప్పులు.. అప్పులు.. అంటూ చేస్తున్న ఊకదంపుడు ప్రచారాన్ని లెక్కలు, ఆధారాలతో సహా ప్రభుత్వం ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది. నిరసన కార్యక్రమాలు చేపడదామంటే.. ఎజెండా కనిపించడం లేదు. దీంతో అసత్యాలనే ఆయుధంగా ఎంచుకున్నట్లుగా కనిపిస్తోంది. ఎల్లో మీడియా సహకారంతో జగన్ సర్కారుపై అసత్యాలను జోరుగా ప్రచారం చేస్తోంది.
దేశమంతా తీవ్ర ఆర్థిక మందగమనం ఉన్న సమయంలో కూడా ఏపీ ప్రభుత్వం సంక్షేమ రథాన్ని ఆపలేదు. సుమారు లక్షన్నర కోట్లను నేరుగా ప్రజల ఖాతాల్లోకి జమ చేసింది. ఏ ఒక్క పథకాన్ని కూడా ఆపకుండా నిర్విరామంగా కొనసాగిస్తోంది. దీంతో అప్పులు, ఆర్థిక ఇబ్బందులు అంటూ ప్రచారాన్ని లేవనెత్తింది టీడీపీ. అందువల్ల ప్రభుత్వ పథకాలను నిలిపేస్తోందని ప్రచారం చేస్తోంది. తాజాగా అమ్మ ఒడి పథకంపై జరుగుతున్న దుష్ప్రచారంపై ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. ఎల్లో మీడియా అమ్మ ఒడి పథకంపై నానా తప్పులు రాస్తుందన్నారు. తల్లిరొమ్ము పాలు తాగిన ఏ వ్యక్తి అమ్మ ఒడిని విమర్శించరు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పథకం తీసుకువచ్చింది అని హైదరాబాద్ లో మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడారు.
అమ్మ ఒడి పథకాన్ని యావత్ భారతదేశం ప్రశంసిస్తోంది. కుల,మత బేధం లేకుండా పిల్లలను విద్యావంతులను చేయడానికి ఈ పథకాన్ని తీసుకువచ్చాం. చదువుకు పేదరికం అడ్డుకాకూడదని జగనన్న ఈ పథకాన్ని తీసుకువచ్చారన్నారు మంత్రి సురేష్. రెండుసార్లు అమ్మ ఒడి ద్వారా ఆర్థిక సాయాన్ని అందించాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకున్నా కూడా ఇంత గొప్పపథకాన్ని చేపడుతున్నాం. అమ్మ ఒడికి నూతన నిబంధనలు పెడుతున్నాం అని రాస్తున్నారు. అదంతా తప్పు. ఈ పథకం పై నూతన ఆంక్షలు ఏవీ పెట్టడం లేదు. విషం చిమ్మే మాటలను ఎల్లో మీడియా రాస్తుందన్నారు. శానిటైజ్ వర్కర్లకు ఈ పథకం వర్తింపజేస్తున్నాం. అన్ని వర్గాలకు చెందిన 81% మహిళలకు ఈ పథకాన్ని వర్తింపజేశాం. గ్రామ సచివాలయాల్లో లబ్దిదారుల లిస్ట్ ఉంటుంది, పరిశీలించుకోవచ్చన్నారు.
జగనన్న ఒక్క బటన్ నొక్కితే లబ్దిదారులకు అన్ని పథకాలు చేరుతున్నాయి. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పథకాలు లబ్ధిదారులకు చేరుతున్నాయి.అమ్మ ఒడి పథకాలపై విషం చిమ్మే మాటలు రాయడం బాధాకరం. కరోనాతో స్కూల్స్ మూతపడినప్పుడు కూడా 70శాతం అటెండెన్స్ లేకున్నా ఆర్థికసాయం చేశాం. ఎన్నికలు వస్తున్నాయంటే టీడీపీ కుట్రలు చేస్తుంది. చంద్రబాబు అంటే వంచనకు చిహ్నం. జగనన్న చెప్పాడంటే చేస్తాడంతే… అని చెప్పుకొచ్చారు. అసత్యాలను వండివార్చినా కూడా ప్రజలకు మాపై విశ్వాసం ఉందని వెల్లడించారు. అమ్మ ఒడికి బదులుగా ల్యాప్ టాప్స్ కూడా త్వరలో అందిస్తున్నాం అని చెప్పారు. అసత్యాలు రాజకీయాల్లో రాణించవని వెల్లడించారు.