iDreamPost
android-app
ios-app

పేటీఎం సీఈవో అరెస్ట్.. ఆలస్యంగా వెలుగులోకి అసలు విషయం!

పేటీఎం సీఈవో అరెస్ట్.. ఆలస్యంగా వెలుగులోకి అసలు విషయం!

పేటీఎంకు వరుస కష్టాలు వదిలేట్టు కనిపించడంలేదు. నిజానికి కొద్దిరోజుల క్రితమే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ కొత్త కస్టమర్‌లను చేర్చుకోకుండా నిలిపివేయాల్సిందిగా ఆదేశించింది. పేటీఎం ఐటి సిస్టమ్‌పై సమగ్ర అడిట్ నిర్వహించడానికి ఆడిట్ సంస్థను నియమించాలని ఆదేశించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949లో సెక్షన్ 35A కింద కొత్త కస్టమర్లను చేర్చుకోవడం తక్షణమే నిలిపివేయాలని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌ని ఆర్బీఐ ఆదేశించింది. అది మరువక ముందే Paytm వ్యవస్థాపకుడు, సీఈవో అయిన విజయ్ శేఖర్ శర్మను దక్షిణ ఢిల్లీ పోలీసులు గత నెలలో అరెస్టు చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అయితే అరెస్ట్ అయిన కాసేపటికే ఆయన బెయిల్‌పై విడుదలయ్యాడు. అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేసిన కారణంగా విజయ్‌ శేఖర్‌ను అరెస్టు చేశారు. అయితే ఈ అరెస్ట్ ఘటన ఫిబ్రవరి 22న జరిగింది కానీ చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి నమోదైన ఎఫ్‌ఐఆర్ ప్రకారం, ఢిల్లీ పోలీసు డిసిపి కార్ ను ఒక జాగ్వార్ ల్యాండ్ రోవర్ కారు ఢీకొట్టింది. డీసీపీ సౌత్ బనితా మేరీ జాకర్‌ కార్ డ్రైవర్‌ అయిన కానిస్టేబుల్ దీపక్ కుమార్ ఫిర్యాదుపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. డీసీపీ వద్ద డ్రైవర్ అయిన దీపక్ కుమార్ పెట్రోల్ నింపుకునేందుకు అరబిందో మార్గ్‌కు వెళ్లాడు.

ఢిల్లీలోని అరబిందో మార్గ్‌లోని మదర్స్ ఇంటర్నేషనల్ స్కూల్ వెలుపల డిసిపి వాహనాన్ని జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఢీకొట్టింది. దీనిని పేటీఎం సీఈవో నడుపుతున్నట్లు తెలిసింది. కారు ఢీకొని ఆగకుండా వెళ్లిపోవడంతో వెళ్ళిపోతున్న ఆ వాహనం నంబర్ నోట్ చేసుకుని డీసీపీకి ఫోన్ చేసి చెప్పాడు దీపక్. ఎఫ్‌ఐఆర్ తర్వాత విచారణ చేయగా, ఈ వాహనం విజయ్ శేఖర్ శర్మకు చెందినదని తేలింది. దీంతో ఆయనను పోలీస్ స్టేషన్ కు పిలిపించి అరెస్ట్ చేశారు. అయితే, అది బెయిలబుల్ అఫెన్స్ కావడంతో అతనికి వెంటనే బెయిల్ మంజూరైంది. ఘటన జరిగిన సుమారు ఇరవై రోజుల తర్వాత ఈ విషయం బయటకు వచ్చింది. విజయ్ శేఖర్ శర్మ మీద IPC సెక్షన్ 279 (వేగం లేదా నిర్లక్ష్యంగా నడపడం) కింద ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.