iDreamPost
android-app
ios-app

పార్టీ ప్రోగ్రెస్‌ రిపోర్టు వెల్లడించిన జనసేనాని

పార్టీ ప్రోగ్రెస్‌ రిపోర్టు వెల్లడించిన జనసేనాని

జనసేన పార్టీ పుట్టుక, ప్రయాణం గురించి ఆ పార్టీ అధినేత, సినీనటుడు పవన్‌ కళ్యాణ్‌ వివరించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం, ఇప్పటం గ్రామంలో జనసేన పార్టీ 9వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సభలో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడారు. పార్టీ ఏర్పాటు నుంచి ఇప్పటివరకు సాధించిన ప్రగతిని వివరించారు. 2014 మార్చి 14వ తేదీన హైదరాబాద్‌లో పార్టీని ఏర్పాటు చేశామని, అప్పుడు ఆరుగురు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, 150 మంది క్రియాశీలక కార్యకర్తలతో ప్రారంభించామని చెప్పారు. ఇప్పుడు 3.20 లక్షల క్రియాశీలక కార్యకర్తలు ఉన్నారని, రాష్ట్ర స్థాయి నుంచి పంచాయతీ వరకు కమిటీలు ఉన్నాయన్నారు.

2019 ఎన్నికల్లో ఆరు శాతం ఓట్లు సాధించామని, స్థానిక సంస్థల ఎన్నికల్లో 27 శాతం ఓట్లు వచ్చాయని, రేపు అధికారంలోకి వస్తామని పవన్‌ కళ్యాణ్‌ ధీమా వ్యక్తం చేశారు. 2014లో ప్రశ్నించానని, 2019లో పోటీలో నిలబడ్డానని, 2024లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని పవన్‌ కళ్యాణ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. తనను నమ్మిన అభిమానులను వ్యక్తిగత ప్రయోజనాలకోసం తాకట్టు పెట్టనని హామీ ఇచ్చారు.

రాజకీయాల్లో ప్రజల సమస్యల కోసం మాటా మాటా అనుకుంటామని, రాజకీయాల్లో విభేధాలు ఉంటాయి కానీ.. వ్యక్తిగత ధ్వేషాలు ఉండవని పవన్‌ కళ్యాణ్‌ చెప్పుకొచ్చారు. భారతీయ జనతాపార్టీ ఉభయ రాష్ట్రాల అధ్యక్షులకు, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులకు, సీపీఐ, సీపీఎం కార్యదర్శులకు, టీఆర్‌ఎస్‌ అధినాయకత్వానికి, కేటీఆర్, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు, మాజీ మంత్రి డాక్టర్‌ విజయరామారావు, మాజీ ఎంపీ బూర నర్సన్నగౌడ్, తెలంగాణ, ఏపీ మేథావులు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు, టీడీపీ కార్యకర్తలకు, నాయకులకు పవన్‌ కళ్యాణ్‌ నమస్కారాలు తెలియజేశారు.

తన సంస్కారం వైసీపీ నేతలకు నమస్కారం పెట్టమంటోందని చెబుతూ.. వారికి కూడా నమస్కారం పెడుతున్నట్లు చెప్పారు. మేకపాటి గౌతమ్‌ రెడ్డి, మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మాగుంట శ్రీనివాసుల రెడ్డి, టి. సుబ్బిరామిరెడ్డికి నమస్కారాలు పెడుతున్నామని పవన్‌ కళ్యాణ్‌ పేర్కొన్నారు. ‘‘నమస్కారాల పర్వం పూర్తయింది. ఇంతమందికి నమస్కారాలా..? అంటే అది జనసేన సంస్కారం’’ అంటూ పవన్‌ కళ్యాణ్‌ చెప్పుకొచ్చారు. సభ నిర్వహణకు స్థలం ఇచ్చి సహకరించిన ఇప్పటం గ్రామస్తులకు పార్టీ తరపున గ్రామ పంచాయతీకి 50 లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటించారు.