iDreamPost
android-app
ios-app

ఆ పంచాయితీకి పవన్ 50 లక్షల విరాళం..

ఆ పంచాయితీకి పవన్ 50 లక్షల విరాళం..

జనసేన పార్టీ స్థాపించి నేటికి ఎనిమిదేళ్లు పూర్తయి పార్టీ 9వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా అమరావతి ప్రాంతంలోని ఇప్పటం అనే గ్రామంలో జనసేన ఆవిర్భావ దినోత్సవ సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జనసేన నేతలతో పాటు పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ప్రభుత్వం మీద విమర్శలు చేసి ఎప్పటిలానే విరుచుకుపడ్డారు కానీ ఆయన చేసిన ఒక ప్రకటన ఆసక్తికరంగా మారింది. ఈ సభను మా పొలాల్లో జరుపుకోండి అని సహకరించిన ఇప్పటం రైతులకు ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని పేర్కొన్న పవన్ ఇక్కడ సభ పెట్టుకోండి అని సహకరించిన మీకు ఈ సభాముఖంగా మాటిస్తున్నాను. ఇప్పటం గ్రామానికి నా ట్రస్టు తరపున రూ.50 లక్షలు ప్రకటిస్తున్నానని అన్నారు.

అలాగే, సభ నిర్వహణకు అనుమతిచ్చిన అధికారులకు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేసిన పోలీసు అధికారులకు, నా సోదరులైన పోలీస్ కానిస్టేబుళ్లకు, తోటి భీమ్లానాయక్ లైన మా ఎస్సైలకు… మీ అందరికీ పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు” అంటూ వ్యాఖ్యానించారు. ఇక రైతు పెద్దల ద్వారా గ్రామ పెద్దలకు విరాళం అందజేస్తానని అన్నారు. దామోదరం సంజీవయ్య స్ఫూర్తిని కొనసాగిస్తానని అంటూనే తాను తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చానని వెల్లడించారు. పార్టీని నడపాలంటే సైద్ధాంతిక బలం ఉండాలనీ, బలమైన సిద్ధాంతాన్ని పట్టుకున్న లక్షల మంది ఉండాలని ఇప్పటికీ జనసేన సభ్యత్వం 5 లక్షలకు చేరిందని అన్నారు.

2019 ఎన్నికల్లో 137 స్థానాల్లో పోటీ చేశాం,7 శాతం ఓట్లు సాధించామని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో జనసేన తరపున 1,209 మంది సర్పంచులు గెలిచారని ఆయన అన్నారు. అలా 7 నుంచి 27 శాతానికి జనసేన ఓట్లు పెరిగాయి కాబట్టి అధికారం సాధించే స్థాయికి జనసేన చేరుతుందని పవన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రశ్నించడం అంటే మార్పునకు శ్రీకారం చుట్టడమే అని ప్రశ్నించడం చాలా బలమైన ఆయుధం అని అన్నారు. 2024లో ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిస్తామని పవన్‌ కల్యాణ్‌ చెప్పుకొచ్చారు.