iDreamPost
android-app
ios-app

రైతులపై పవన్ కళ్యాణ్‌ కి ప్రేమ పుట్టుకొచ్చిందా

  • Published Apr 02, 2022 | 7:44 PM Updated Updated Apr 02, 2022 | 9:02 PM
రైతులపై పవన్ కళ్యాణ్‌ కి ప్రేమ పుట్టుకొచ్చిందా

ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ దాదాపు నాలుగేళ్ల కాలం పాటు టీడీపీతో కలిసి సాగింది. చంద్రబాబు అధికారంలో ఉండగా ఆయనకు అన్ని విధాలుగానూ పవన్ కళ్యాణ్ అండగా నిలిచారు. సరిగ్గా ఆ సమయంలోనే రైతుల రుణమాఫీ సహా అనేక హామీలను చంద్రబాబు తుంగలో తొక్కారు. రుణమాఫీ ప్రక్రియనే అపహాస్యం చేశారు. 84 వేల కోట్ల రూపాయలను రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి దశల వారీగా కేవలం రూ. 14వేల కోట్లను మాత్రమే రైతులకు ప్రయోజనం చేకూర్చిన చంద్రబాబుని పవన్ ఎన్నడూ పల్లెత్తుమాట అన్న దాఖలాలు లేవు. రైతులను నమ్మించి మోసగించిన తీరుని ప్రశ్నించిన వైనం లేదు. కానీ ఇప్పుడు అనూహ్యంగా కౌలు రైతులను ఆదుకుంటామంటూ పవన్ కొత్త పాట అందుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో రైతు సంక్షేమానికి జగన్ ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాన్నిస్తున్నాయి. రైతు భరోసా కేంద్రాల అనుభవాన్ని దేశంలోని అనేక రాష్ట్రాలు అధ్యయనం చేస్తున్నాయి. ఏపీ మోడల్ ని అనుసరిస్తామని ప్రకటిస్తున్నాయి. అదే సమయంలో రైతు భరోసా ఏటా సకాలంలో చెల్లించడం నుంచి ఇన్సూరెన్స్, పంట నష్టం, ఇన్ ఫుట్ సబ్సిడీ వంటివి పెండింగ్ లేకుండా చెల్లించడం జగన్ హయాంలోనే జరుగుతోంది. చంద్రబాబు పాలనలోనూ పెండింగ్ పెట్టిన బకాయిలను జగన్ ప్రభుత్వం వచ్చి క్లియర్ చేసిన అనుభవం ఉంది. అలాంటిది అప్పటి ప్రభుత్వానికి కొమ్ము కాసిన కాలంలో నోరుమెదపని పవన్ కళ్యాణ్‌ తాజాగా కౌలు రైతుల కుటుంబాలను ఆదుకుంటామంటూ ప్రకటించారు.

గోదావరి జిల్లాల్లో ఆత్మహత్యకు పాల్పడిన 73 మంది కౌలుదారులను ఆదుకుంటామంటూ పవన్ ప్రకటించడం విడ్డూరంగా ఉంది. బహుశా 2014 నుంచి 19 మధ్యలో అంటే పవన్ కళ్యాణ్‌ మద్ధతుతో నడిచిన ప్రభుత్వ హయాంలోనూ మరణించిన వారికి ఇప్పుడు సాయం చేసేందుకు ముందుకొచ్చినట్టు కనిపిస్తోంది. గడిచిన మూడేళ్లుగా ఏపీలో వరుణుడు కరుణించడంతో పంట దిగుబడులు పెరిగాయి. అదే సమయంలో వరదల వల్ల నష్టపోయిన రైతులందరికీ ప్రభుత్వ సహాయం అందించారు. దాంతో చాలామంది వ్యవసాయదారులు సైతం కష్టాల నుంచి గట్టెక్కేందుకు అవకాశం ఏర్పడింది. అయితే కౌలురైతులకు పలు సమస్యలున్నాయి. వాటిని పరిష్కరించే దిశలో జగన్ ప్రభుత్వం కూడా చొరవ తీసుకుంటోంది. కానీ దానిని రాజకీయం చేసి తాను రైతు ఉద్దరణకు ప్రయత్నిస్తున్నట్టు కనిపించాలని పవన్ తహతహలాడుతున్నట్టు కనిపిస్తోంది.

నిజానికి గడిచిన మూడేళ్లలో ఏపీలో మరణించిన కౌలుదారుల సంఖ్యనే 73 మంది లేరు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లెక్కల ప్రకారం గడిచిన మూడేళ్లలో ఏపీలో 260 మంది వరకూ రైతులు మరణించారు. అదే 2014-19 మధ్య 1513 మంది రైతులు ఏపీలో ఆత్మహత్యకు పాల్పడినట్టు అధికారికంగా ప్రకటించారు. ఆయా కుటుంబాలను ఆదుకునే దిశలో ప్రభుత్వం సహాయం కూడా అందించింది. కానీ ఒక్క గోదావరి జిల్లాల్లోనే 73 మంది కౌలుదారులంటూ పవన్ పేర్కొనడం ఆశ్చర్యంగా కనిపిస్తోంది. ఏదోటి చేసి జగన్ సర్కారుని బద్నాం చేయాలనే తాపత్రయం తప్ప ఈ వ్యవహారంలో ఎటువంటి చిత్తశుద్ధి కనిపించడం లేదు. పైగా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వమే ఉదారంగా సాయం చేస్తున్న దశలో తాను ఏదో చేస్తున్నట్టు కనిపించాలని పవన్ రాజకీయ యత్నాలు ఫలిస్తాయా అన్నది సందేహమే.