Idream media
Idream media
పాకిస్తాన్‌లో మరోసారి రాజకీయ సంక్షోభం తలెత్తింది. ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం పతనం అంచున నిలిచింది. ప్రధాన భాగస్వామి ముత్తహిదా క్వామీ మూవ్‌మెంట్ – పాకిస్తాన్ (ఎంక్యూఎం-పీ) ప్రభుత్వం నుంచి వైదొలిగింది. ఈ మేరకు ఎంక్యూఎం-పీ చీఫ్ ఖలీద్ మక్బూల్ సిద్దిఖీ బుధవారం ప్రకటించారు.తాము ప్రతిపక్షంలో కూర్చొంటామని చెప్పారు. నిజమైన ప్రజాస్వామ్యం కోసం కొత్త రాజకీయాలను మొదలు పెడతామని ఆయన వెల్లడించారు. ఏడుగురు సభ్యులున్న ఎంక్యూఎం-పీ మద్దతు ఉపసంహరించడంతో జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్ ప్రభుత్వం మైనారిటీలో పడింది.
ఐదుగురు సభ్యులున్న మరో సంకీర్ణ భాగస్వామి కూడా విపక్షాల అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేస్తామని సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా బుధవారం సాయంత్రం జాతినుద్దేశించి ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ప్రసంగిస్తారని హోం మంత్రి షేక్ రషీద్ వెల్లడించారు. ఆయన చివరి బంతివరకు పోరాడతారని వివరించారు. కేబినెట్ మొత్తం ఇమ్రాన్‌పై విశ్వాసముంచిందన్నారు. కాగా 342మంది సభ్యులున్న జాతీయ అసెంబ్లీలో కావాల్సిన మ్యాజిక్ నంబర్ 172. ప్రస్తుతమున్న లెక్కల ప్రకారం సంకీర్ణ ప్రభుత్వానికి 176 మంది సభ్యుల మద్దతుంది. ఏడుగురు సభ్యులున్న ఎంక్యూఎం-పీ ప్రభుత్వంనుంచి వైదొలగడంతో వీరి బలం మైనారిటీలో పడిపోనుంది.
ఇదేకాక ఇమ్రాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్(పీటీఐ) పార్టీకి 155మంది సభ్యులున్నారు. ఇందులో కొంతమంది ఆయనను వ్యతిరేకిస్తున్నారు. వీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తామంటున్నారు. దీంతో ఇమ్రాన్ ప్రభుత్వం పతనమవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే జరిగితే పాకిస్తాన్ చరిత్రలో ఒక ప్రధాని అవిశ్వాస తీర్మానం ద్వారా పదవీచ్యుతుడు కావడం ఇదే తొలిసారి అవుతుంది. కాగా, తమకు 175 మంది సభ్యుల మద్దతు ఉందని, ఇమ్రాన్ రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
రాజకీయ సంక్షోభం తలెత్తిన నేపథ్యంలో బుధవారం సాయంత్రం ఇమ్రాన్ ఖాన్ జాతినుద్దేశించి ప్రసంగిస్తారని ఆ పార్టీ నేతలు తొలుత ప్రకటించారు. అయితే ఇమ్రాన్ తన ప్రసంగాన్ని రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని ఇమ్రాన్ పార్టీకి చెందిన సభ్యుడు ఫైజల్ జావెద్ ఖాన్ ధ్రువీకరించారు. అయితే, పాక్ ఆర్మీ చీఫ్ , నిఘా విభాగం(ఐఎస్‌ఐ) చీఫ్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను బుధవారం ఉదయం కలిసిన తర్వాతే ప్రసంగం రద్దు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. వీరిద్దరూ బుధవారం రాత్రి మరోసారి ప్రధానితో భేటీ కానున్నారని తెలిసింది.