Idream media
Idream media
ప్రధానమంత్రి మోడీ సర్కారుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి డెడ్‌లైన్ విధించారు. ఇరవై నాలుగు గంటల్లో తెలంగాణలోని ధాన్యం మొత్తం కొనకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. పంటి నొప్పి కోసం ఢిల్లీ వెళ్లిన ఆయన వారం రోజులుగా అక్కడే ఉండి నేడు జరిగిన వరి పోరులో పాల్గొన్నారు. హస్తిన వేదికగానే ఢిల్లీ పెద్దలపై తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. అనంతరం రాష్ట్రానికి చేరుకున్న ముఖ్యమంత్రి రేపు కేబినెట్ భేటీ కానున్నట్లు ప్రకటించారు. నేడు ఆందోళన జరిగిన వెంటనే మంత్రి వర్గ సమావేశం నేపథ్యంలో కేంద్రంపై యుద్ధం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. డెడ్ లైన్ ముగిసిన వెంటనే జరగనున్న ఈ సమావేశంలో ప్రత్యేక ఆందోళనలకు పిలుపు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
ధాన్యం కొనుగోలు చేయాలంటూ టీఆర్‌ఎస్ పార్టీ ఈ నెల 4వ తేదీ నుంచి ఆందోళన బాట పట్టింది. వరుసగా రాష్ట్రంలో టీఆర్ ఎస్ శ్రేణులు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తున్నాయి. సోమవారం ఆందోళన గల్లీ నుంచి ఢిల్లీకి చేరుకుంది. అక్కడి తెలంగాణ భవన్‌లో ఆ పార్టీ నేతలు సోమవారం కేసీఆర్ అధ్యక్షతన దీక్ష చేపట్టారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ముఖ్యనేతలంతా దీక్షలో పాల్గొన్నారు. ఢిల్లీలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ నిర్వహించిన ధర్నాకు ఇరత రాజకీయ పార్టీల నేతలెవరూ హాజరుకాలేదు. రైతు సంఘం నేత రాకేశ్ టికాయత్ ఒక్కరే దీక్షా స్థలికి వచ్చి కేసీఆర్ కు సంఘీభావం ప్రకటించారు. దీక్షలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో భూకంపం సృష్టిస్తాం.. పీయూష్ గోయల్ పరుగులు తీయాల్సిందేనని కేసీఆర్ హెచ్చరించారు. హిట్లర్, నెపోలియన్ వంటి అహంకారులు కాలగర్భంలో కలిసిపోయారు.. ఇప్పుడున్న కేంద్రానికి ఎందుకింత అహంకారం? అని నిలదీశారు.
మోడీ సర్కార్ కార్పొరేట్లకు కొమ్ము కాస్తూ.. రైతుల జీవితాలతో ఆటలాడుకుంటోందని కేసీఆర్ మండిపడ్డారు. కేంద్రానికి ఎదురు తిరిగితే సీబీఐ, ఈడీ వంటి సంస్థలతో దాడులు చేస్తారు. బీజేపీలో అందరూ సత్యహరిశ్చంద్రులే ఉన్నారా? వాళ్ల దగ్గరకు ఈడీ, సీబీఐ వెళ్లదు.. ప్రతి రాష్ట్రంలో ఇతర పార్టీల నాయకులను బెదిరిస్తున్నారు. సీఎంను జైలుకు పంపుతామని రాష్ట్ర బీజేపీ నేతలు అంటున్నారు. దమ్ముంటే రావాలని కేసీఆర్ సవాల్ విసిరారు. ఊరికే మొరగడం సరికాదనీ బీజేపీని పంచ్ విసిరారు. 24 గంటల్లోపు ధాన్యం సేకరణపై కేంద్రం ఓ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రంపై పోరాటానికి తెలంగాణ ప్రజులు, రైతులు సిద్ధంగా ఉన్నారని, తాడోపేడో తేల్చుకుంటామని సీఎం తేల్చిచెప్పారు. కేంద్రం రియాక్షన్ ను బట్టి రేపు జరగబోయే కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. వారం రోజులుగా టీఆర్ఎస్ దశల్లో వరిపోరు నిర్వహించగా, రేపటి భేటీలో యుద్ధం 2.0 కేసీఆర్ ప్రకటిస్తారని తెలుస్తోంది.