Idream media
Idream media
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అప్పగించిన బాధ్యతలను నెరవేర్చేందుకు ఏపీ కొత్త మంత్రులు సంసిద్ధమయ్యారు.ఆయా శాఖల పెండింగ్ పనులు,ప్రాజెక్టులపై ఆరా తీస్తున్నారు.దీనిలో భాగంగా కీలకమైన జలవనరుల శాఖా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అంబటి రాంబాబు పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయడమే తన ప్రథమ కర్తవ్యం అన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి పోలవరం మణిహారమని, నిర్మాణదశలో ఉన్న ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు కృషి చేస్తానని జలవనరుల శాఖామాత్యులు అంబటి రాంబాబు పేర్కొన్నారు.
గోదావరి, కృష్ణా నదులను అనుసంధానిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా, పోలవరం సమీపంలో నిర్మాణంలో ఉన్న బహుళార్థ సాధక నీటిపారుదల పథకం పోలవరం ప్రాజెక్టు.విశాఖపట్నం, ఉభయ గోదావరి,కృష్ణా జిల్లాలలోని మెట్టప్రాంతాలకు సాగు నీటిని అందించేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దీనికి శ్రీకారం చుట్టారు. 2004 లో ప్రారంభించారు. దీనికి 2015లో జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపు దక్కింది.పోలవరం జలాశయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో బాటు, ఛత్తీస్ గఢ్, ఒరిస్సాలలోకి కూడా విస్తరించి ఉంటుంది. ఈ పథకం పూర్తయితే వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైన ఏపీ మరింత సస్య శ్యామలం అవుతుంది.
విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల సాగునీటి అవసరాలే కాక, విశాఖ మహానగరం తాగునీటి అవసరాలు, విశాఖపట్నం చుట్టుపక్కలనున్న తీరప్రాంత పరిశ్రమల పారిశ్రామిక అవసరాలు కూడా తీరతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అంతేగాకుండా, విద్యుదుత్పత్తి, జలరవాణాలో కీలక భూమిక పోషించనుంది. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల పోలవరం అంచనా వ్యయం పెరుగుతూ వచ్చి.. నిధుల కొరత అడ్డంకిగా మారింది. వైసీపీ అధినేత జగన్ మేనిఫెస్టోలో పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. ఆ మేరకు ఆయన హయాంలో ప్రాజెక్టు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి.
తాజాగా ఏపీ జలవనరుల శాఖా మంత్రిగా అంబటిని నియమించారు. బాధ్యతలు స్వీకరించిన అంబటి పోలవరంపై ప్రధాన దృష్టి సారించనున్నట్లు ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఇచ్చిన ఈ అవకాశాన్ని పదవిలా కాకుండా కీలకమైన బాధ్యతగా భావిస్తానన్నారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి పోలవరం ప్రాజెక్టు శంకుస్థాపన చేశారని,ఆయన తనయుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌మెహన్‌రెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి ప్రారంభించి ప్రజలకు అంకితం చేస్తారన్నారు. జలవనరుల శాఖ కీలకమైనదని రాష్ట్రానికి, ప్రభుత్వానికి, ప్రజలకు, నియోజకవర్గానికి మంచిపేరు తీసుకొచ్చేలా పారదర్శకంగా పనిచేస్తానన్నారు. ప్రాజెక్టు పురోగతిపై తక్షణం దృష్టి సారించనున్నట్లు ప్రకటించారు.