పవన్ కళ్యాణ్ తీరు ఇప్పటికీ రాజకీయవర్గాలకు అంతుబట్టదు. చివరకు సినీరంగంలోనూ ఆయన్ని సమర్థించేవాళ్లు కనిపించడం లేదు. దాంతో ఆయన సోదరుడు నాగబాబు నేరుగా వాపోయారు. తమకు అన్యాయం జరుగుతుంటే పరిశ్రమలో ఒక్కరూ నోరు మెదపడంలేదని బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఆయన మాటలు వారిలో పెరుగుతున్న నిస్తేజాన్ని చాటుతున్నాయి. ఒంటరిపాలయిన వైనాన్ని తెలియజేస్తున్నాయి.
సినిమా, రాజకీయాలు కలిపేసి సినీవేదికల నుంచి రాజకీయ విమర్శలకు పూనుకున్న పవన్ కి ఇలాంటి పరిస్థితి అనివార్యమనే అభిప్రాయం పలువురిలో ఉంది. నిజానికి సాయిధరమ్ తేజ్ సినిమా వేడుకలో పాల్గొన్న పవన్ నేరుగా ఏపీ ప్రభుత్వం మీద విమర్శలు ఎక్కుపెట్టారు. గతంలో కూడా పలువురు సినీప్రముఖులు రాజకీయవ్యాఖ్యలు చేసినప్పటికీ నేరుగా విమర్శలు చేసిన దాఖలాలు లేవు. కానీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభుత్వం మీద విమర్శలు ఎక్కుపెట్టడం పవన్ చేసిన తప్పిదంగా పలువురు భావిస్తున్నారు.
ఈ విషయంలో పవన్ కళ్యాణ్ కి కూడా విషయం బోధపడినట్టు కనిపిస్తోంది. భీమ్లానాయక్ వేదికపై నుంచి తాను రాజకీయ విమర్శలుచేయడం సబబుకాదని తనే చెప్పడం దానికి నిదర్శనం. తన తప్పులు గ్రహించినట్టు ఈ వ్యవహారం చెబుతోంది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. పవన్ మూలంగా సినీ పరిశ్రమ, ఏపీ ప్రభుత్వం మధ్య దూరం పెరిగింది. దానిని తగ్గించేందుకు స్వయంగా చిరంజీవి రంగంలోకి దిగారు. ఏపీ సీఎంతో చర్చలు జరిపారు. అంతా సానుకూలంగా మారుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. పరిస్థితి అంతా చక్కబడుతుందని భావిస్తున్న తరుణంలో పవన్ నేరుగా చిరంజీవిని సైతం తప్పుబట్టేలా మాట్లాడారు. ఇటీవల నరసాపురం సభలో పవన్ చేసిన కామెంట్స్ చిరుని కూడా అసంతృప్తికి గురిచేసినట్టు చెబుతున్నారు. స్వయంగా ఆయన అన్నయ్య కూడా పవన్ వ్యాఖ్యలను జీర్ణం చేసుకోలేని నేపథ్యంలో ఇతరులు ఎలా సానుకూలంగా ఉంటారనే ప్రశ్న వస్తోంది.
చివరకు భీమ్లా నాయక్ సినిమా విడుదలయిన నేపథ్యంలో జరిగిన పరిణామాలకు బాధ్యుడిగా పవన్ మిగిలిపోయారు. ఆ సినిమాకు ఏపీలో అదనపు షోలు, టికెట్ ధరల వంటి నిబంధనలు అడ్డంకిగా మారాయి. పైగా తొలి రోజే డివైడ్ టాక్ రావడంతో సినిమా ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో పవన్ కి అండగా పరిశ్రమ వర్గాలు రాలేదనే బాధ నాగబాబు మాటల్లో వ్యక్తమయ్యింది. అయితే సినీ రంగానికి సమస్యలు లేకుండా చేయాలని చిరంజీవి చేసిన ప్రయత్నాలకు ఫలితం దక్కకుండా అడ్డుపుల్లలు వేసిన పవన్ తీరు మాత్రమే దానికి కారణమని, తామంతా ఎందుకు అతడికి అండగా ఉండాలనే వాదన ఇండస్ట్రీ నుంచే వస్తోంది. ఈ నేపథ్యంలో రాజకీయంగా పవన్ కి చంద్రబాబు అండగా ఉన్నప్పటికీ పరిశ్రమలో మాత్రం పట్టుమని ఒక్కరు కూడా సానుకూలత వ్యక్తంచేయకపోవడంతో ఒంటరిగా మిగిలిపోవాల్సి వచ్చింది.