iDreamPost
android-app
ios-app

ఏది కామెడీ మనోహర్?

  • Published Mar 10, 2022 | 8:32 AM Updated Updated Mar 10, 2022 | 8:49 AM
ఏది కామెడీ మనోహర్?

సినీ పరిశ్రమకు చెందిన పెద్దలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సన్మానం చేసేందుకు సిద్ధపడుతుండడం కామెడీ సీన్ లా ఉందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలను అధికారపార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. బుధవారం అమరావతిలో మీడియాతో మాట్లాడిన మనోహర్ ఏపీలో పేదలంతా ఒక్కసారిగా ధనవంతులుగా మారిపోయారని సినిమా టికెట్ల ధరలు పెంచారా అని ప్రశ్నించారు. రూ.7 లక్షల కోట్ల అప్పుతెచ్చి వారిని ధనవంతులను చేశారా అని ఎద్దేవా చేశారు. సినిమా టికెట్ల ధరలను పెంచుతూ ఇచ్చిన జీవో వల్ల పరిశ్రమకు మేలు జరుగుతుంది అని భావించిన ఆ రంగ ప్రముఖులు ముఖ్యమంత్రికి సన్మానం చేయాలని సిద్ధపడడం మనోహర్ కు కామెడీలా అనిపించడం వింతగా ఉంది.

టికెట్ల ధర పెంపు పరిశ్రమ మనుగడకు ఎంతో అవసరం. అందుకే గతంలో ధరలను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని పునసమీక్షించాలని ఆ రంగ ప్రముఖులు ప్రభుత్వాన్ని కోరారు. దీంతో ప్రభుత్వం నిపుణుల కమిటీని వేసి, అది ఇచ్చిన సిఫార్సుల ప్రకారం ధరలు పెంచింది. ఇటు సామాన్యులకు ఇబ్బంది లేకుండా, అటు పరిశ్రమ దెబ్బ తినకుండా బ్యాలెన్స్ చేస్తూ ప్రభుత్వం ధరలను నిర్ణయించింది. ఆ రంగంలో ప్రముఖులు, ఫిల్మ్ చాంబర్ వారు దీనిపై హర్షం వ్యక్తంచేశారు. తెలుగు రాష్ట్రాల సీఎంలకు సన్మానం చేస్తామని తెలిపారు. ఇది మనోహర్ కు కామెడీ సీన్ లా కనిపించింది అంటే సినీ పరిశ్రమపైన, ఆ రంగంలోని వారు ఎదుర్కొంటున్న సమస్యలపైన ఆయనకు ఉన్న చులకనభావాన్ని సూచిస్తోందని అధికారపార్టీ నేతలు అంటున్నారు.

అన్నింటిలోనూ అవగాహనా రాహిత్యం..

ప్రజలు ఎదుర్కొంటున్న ఏ సమస్యపైనా జనసేన నేతలు అవగాహన లేకుండా స్పందిస్తుంటారని, ఇప్పుడు సినిమా టికెట్ల ధరల పెంపుపై కూడా మనోహర్ అలాగే మాట్లాడారని వైఎస్సార్ సీపీ నేతలు అంటున్నారు. ఈ అవగాహనా రాహిత్యం వల్లనే జనసేన పార్టీ ఒక కామెడీగా మారింది. జనం ప్రాణసంకటంగా భావించే సమస్యలను చాలా ఈజీగా తీసుకోవడం ఆ పార్టీ నైజంగా మారింది. ఒక సమస్యపై ఒక ప్రకటన చేయడమో, లేకపోతే ఒక సభ నిర్వహించడమో చేసేస్తే తమ బాధ్యత తీరిపోయిందని జనసేన నేతలు భావిస్తున్నారు. అప్పుడప్పుడు తెరపై పాత్రల్లా వచ్చి మాయమైపోవడం తప్ప జనంలో ఉండి వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడడం ఆ పార్టీ నేతలు ఇప్పటికీ నేర్చుకోలేదు.

ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కాల్షీట్ ఇచ్చినప్పుడే జనసేన ఏదో సమస్యపై హడావుడి చేస్తుంది. ఆయన ఆవేశపూరిత ప్రసంగంతో, అభిమానులు కొట్టే చప్పట్లు, వేసే ఈలలతో మీడియా దృష్టిని ఆకర్షిస్తుంది. అంతే ఇక సమస్య పరిష్కారం అయిపోయినట్టు భావిస్తుంది. మళ్లీ పవన్ కు తీరిక ఉన్నప్పుడు మరో సమస్యపై మళ్లీ హంగామా చేస్తుంది. అంతే తప్ప ఏ సమస్యపై కడదాకా పోరాడదు. దీనికి ఎన్ని ఉదాహరణలు అయినా చెప్పుకోవచ్చు. పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచీ ఇదే తంతు. అందుకే ఏ వర్గం సమస్య పరిష్కారం అయినా మనోహర్ లాంటి వారికి కామెడీగా ఉంటుందని వైఎస్సార్ సీపీ నాయకులు అంటున్నారు.

పొత్తులతో కాలక్షేపం..

నిజానికి జనసేన పార్టీయే రాజకీయాల్లో ఒక కామెడీగా మారిపోయింది. 2014లో అట్టహాసంగా పార్టీని స్థాపించి ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ, బీజేపీలకు మద్దతు ఇచ్చి ప్రేక్షకపాత్రకు పరిమితం అయింది. 2019లో ఆ రెండు పార్టీలకు గుడ్ బై చెప్పి కమ్యూనిస్టులతో జట్టు కట్టి ఎన్నికల్లో పోటీ చేసి ఒక్క స్థానం గెలుచుకొంది. పోటీ చేసిన రెండుచోట్లా పవన్ ఓడిపోవడంతో కమ్యునిష్టులకు కటీఫ్ చెప్పి మళ్లీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది. టీడీపీతో రహస్య మితృత్వం కొనసాగిస్తోంది.

ఇలా గాలివాటుగా అటు ఇటు మారడమే తప్ప జనంలో అభిమానం సంపాదించలేకపోయింది. ఓట్లు సాధించలేకపోతోంది. అందుకే కేంద్ర ఎన్నికల సంఘం ఆ పార్టీకి ఇచ్చిన ఎన్నికల గుర్తు గాజుగ్లాసును రద్దు చేసింది కూడా. ఈ విధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీరాజకీయాల్లో కామెడీ స్టార్ గా మారిపోయింది. బహుశా అందుకేనేమో ఆ పార్టీ నేత మనోహర్ కు సినిమా టికెట్ల ధరలు పెంచడం, సీఎంకు సన్మానం చేస్తామని సినీ పెద్దలు చెప్పడం కామెడీ సీన్ లా అనిపిస్తోందని వైఎస్సార్ సీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు.