Dharani
బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన కడియం శ్రీహరి తొలిసారి పార్టీ మార్పుపై స్పందిస్తూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..
బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన కడియం శ్రీహరి తొలిసారి పార్టీ మార్పుపై స్పందిస్తూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..
Dharani
లోక్ సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. పార్టీ కీలక నేతలైన కేకే, కడియం శ్రీహరి కారు దిగారు. ఇక .. స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీకి గుడ్‌బై చెప్పి.. కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. శ్రీహరి తన కుమార్తె డాక్టర్ కడియం కావ్యతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తం పార్టీ జెండా కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంటనే కావ్యను వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఇదిలా ఉంటే కడియం పార్టీ మార్పుపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తమ పార్టీలో డిప్యూటీ సీఎం సహా.. అన్ని రకాల పదవులు కట్టబెడితే.. కడియం మాత్రం కష్టకాలంలో పార్టీని వీడి తమకు ద్రోహం చేశారని విమర్శిస్తున్నారు.
బీఆర్ఎస్ నేతల విమర్శలపై స్పందిస్తూ.. కడియం కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌లో చేరిన తర్వాత తొలిసారిగా ఆయన మీడియాతో మాట్లాడారు. ’’బీఆర్ఎస్ పార్టీని వీడటం కొంత బాధగానే ఉంది. కారు పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పట్ల నాకు ఇప్పటికీ గౌరవం ఉంది. అందుకే నేను ఆయన మీద ఎలాంటి విమర్శలు చేయదల్చుకోవడం లేదు. అలాగే బీఆర్ఎస్ పార్టీ నాకు అనేక అవకాశాలు ఇచ్చినప్పటికి.. నేను వాటిని సరిగా సద్వినియోగం చేసుకోలేకపోయాను‘‘ అన్నారు కడియం. ఇక పార్టీ మార్పుపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలపై ఘాటుగా స్పదించారు కడియం. చాలా మంది పార్టీ మారినా.. బీఆర్ఎస్ నేతలు స్పందించలేదన్నారు. కానీ తన విషయంలో మాత్రం తీవ్రంగా స్పందిస్తున్నారని కడియం ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు మారిపోయాయని.. స్టేషన్ ఘన్‌పూర్ నియోజవర్గం అభివృద్ధి చెందాలంటే పార్టీ మార్పు ఒక్కటే మార్గమని అన్నారు కడియం. అందుకే తాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు చెప్పుకొచ్చారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలను నాశనం చేస్తోందన్నారు. ప్రతిపక్షంలో ఉండి అభివృద్ధి చేయలేనన్న ఆవేదన తనలో ఉందని చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే కడియం కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత మొట్టమొదటిసారి వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావులతో సహా ముఖ్యనేతలు హాజరయ్యారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముఖ్య నేతలంతా కడియం శ్రీహరిపై తీవ్ర విమర్శలు చేశారు.