iDreamPost
android-app
ios-app

కొత్త సంప్రదాయం ,బడ్జెట్ ప్రవేశపెట్టనున్న సీదిరి అప్పలరాజు

కొత్త సంప్రదాయం ,బడ్జెట్ ప్రవేశపెట్టనున్న  సీదిరి అప్పలరాజు

ఆంధ్రప్రదేశ్ లో వెనుకబడిన ప్రాంతంగా ఎంతోకాలంగా అభివృద్ధికి దూరంగా ఉన్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజుకు అరుదైన అవకాశం దక్కింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను ఆర్థిక బడ్జెట్ ను శాసనమండలిలో ప్రవేశపెట్టే అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అప్పలరాజు కి కల్పించారు. మార్చి 11వ తేదీన శుక్రవారం నాడు ఈ మేరకు ఆయన శాసనమండలిలో ఆర్థిక వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. మరోపక్క శాసనసభలో ఆర్థికమంత్రి బుగ్గన బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.

నిజానికి సీదిరి అప్పలరాజు 2019 ఎన్నికల్లో పలాస నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గౌతు శిరీష మీద 16 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. వృత్తిరీత్యా డాక్టర్ కావడం, మంచి వాగ్దాటి కలిగి ఉండడమే కాక శ్రీకాకుళం జిల్లా వాసుల సమస్యల మీద అవగాహన కలిగి ఉన్న అప్పలరాజు ముందు నుంచి కూడా వైఎస్ జగన్ కు ప్రియమైన వ్యక్తి గా మెలగుతూ వచ్చారు. బాగా చదువుకున్న వ్యక్తి కావడమే కాక అన్ని విషయాల మీద అవగాహన ఉన్న వ్యక్తి కావడంతో వైఎస్ జగన్ కూడా అప్పలరాజుకు అనేక అవకాశాలు కల్పిస్తున్నారు. అందులో భాగంగా ఆయనకు అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు.

ఇటీవల కన్నుమూసిన గౌతమ్ రెడ్డి శాఖలను కూడా మంత్రి సీదిరి అప్పలరాజుకు అప్పగించారు. గౌతమ్ రెడ్డి నిర్వహించిన ఐటీ, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, వాణిజ్యం, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ శాఖల బాధ్యతలను సీదిరి అప్పలరాజుకు అప్పగించారు. సీదిరి అప్పలరాజు 2020లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో మత్స్య, పశుసంవర్ధక, డెయిరీ విభాగాలు చూసేవారు. ఇప్పుడు దానికి అదనంగా మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, పరిశ్రమలు, వాణిజ్యం, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ శాఖలను కూడా ఆయన అండర్ లో ఉండనున్నాయి. ఇక మరోపక్క వ్యవసాయ మంత్రి కన్నబాబు అయినా వ్యవసాయ బడ్జెట్ ను శాసనమండలిలో ప్రవేశపెట్టే అవకాశం మంత్రి వేణుకు దక్కింది.