Idream media
Idream media
ఏపీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన భౌతిక కాయాన్ని ప్రత్యేక హెలికాప్టర్ లో హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్ట్ నుండి నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్ కు, అక్కడ నుండి ప్రజల సందర్శనార్ధం గౌతమ్ రెడ్డి పార్థివ దేహాన్ని నెల్లూరులోని మేకపాటి క్యాంపు కార్యాలయానికి తరలించారు. గౌతమ్ రెడ్డి కుమారుడు అర్జున్ రెడ్డి యూఎస్ నుంచి ఈ ఉదయం చేరుకున్నారు. దీంతో దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలు ఈరోజు జరగనున్నాయి.
ఈ ఉదయం 6 గంటలకు నెల్లూరులోని డైకాస్ రోడ్‌లోని మేకపాటి నివాసం నుంచి అంతిమ యాత్ర ప్రారంభమైంది. జొన్నవాడ, బుచ్చి, సంగం, నెల్లూరు పాలెం, మర్రిపాడు, సరిహద్దు, బ్రాహ్మణపల్లి, నందిపాడు మీదుగా ఉదయగిరి వరకు అంతిమయాత్ర సాగుతోంది. మధ్యలో ఆత్మకూరు నియోజకవర్గ ప్రజల సందర్శనార్థం భౌతిక కాయాన్ని నెల్లూరు పాలెం సెంటర్లో ఐదు నిమిషాలు ఉంచనున్నారు. ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో జరిగే అంత్యక్రియలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి హాజరు కానున్నారు.
బుధవారం ఉదయం 11 గంటలకు గౌతమ్ రెడ్డి పార్థివదేహానికి ముఖ్యమంత్రి నివాళులు అర్పించనున్నారు. అంతిమ సంస్కార కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డితో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. అనంతరం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేస్తారు. ఇక అంత్యక్రియలు ఏర్పాట్లను జిల్లాకు చెందిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పర్యవేక్షిస్తున్నారు. అయితే అంతిమయాత్రలో కూడా అనిల్ సామాన్యుడి వలె రోడ్డు క్లియర్ చేస్తూ పరుగులు పెడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక అనిల్ పూర్తిగా విషణ్ణ వదనంతో కనిపిస్తున్నారు.