Idream media
Idream media
ఏపీలో రాజకీయాల్లో వివాదరహితుడిగా పేరొందిన మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణాన్ని తెలుగు ప్రజలు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. మేకపాటి లేకపోవడం అధికార వైసీపీకి పెద్ద లోటు అని చెప్పొచ్చు. ఇప్పుడు ఆయన లేని లోటుని భర్తీ చేయాల్సి వచ్చింది. ఏపీ క్యాబినెట్‌లో మేకపాటి ఉన్నత విద్యావంతుడు. విదేశాలకు వెళ్ళి అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడి, పెట్టుబడులు ఆకర్షించే సత్తా గలిగిన నేతగా గుర్తింపు పొందారు. పరిశ్రమలు, ఐటీ, వాణిజ్యం, నైపుణ్యాభివృద్ధి, చేనేత జౌళి శాఖలు బాధ్యతలు నిర్వహించారు. అత్యధిక శాఖలు ఆయన దగ్గరే ఉండేవి.
మేకపాటి హఠాన్మరణం అనంతరం ఆయన శాఖలను వేరే మంత్రులకు అప్పగిస్తారా, లేదా సీఎం జగన్ వద్దే ఈ శాఖలని ఉంచుకుంటారా అనే చర్చ జరిగింది. మంత్రుల్లో ఉన్న విద్యావంతుల్లో ఆదిమూలపు సురేష్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పుష్పశ్రీ వాణి, సీదిరి అప్పలరాజు, కన్నబాబు లాంటి వారు మేకపాటి తర్వాత వరసలో ఉన్నారు. ఈ క్రమంలో వీరిలో ఒకరికి ఆయన శాఖలు అప్పగించే అవకాశం ఉందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి సంబంధించిన శాఖలను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి కేటాయించింది ప్రభుత్వం. ఈ మేరకు సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో… గౌతంరెడ్డి శాఖలను ఇతర మంత్రులుకు కేటాయించిన విషయం తెలిసిందే. మంత్రి సీదిరి అప్పలరాజుకు ఐటీ, పరిశ్రమలు, స్కిల్ డెవలప్‌మెంట్ శాఖలు, మంత్రి ఆదిమూలపు సురేష్‌కు లా అండ్ జస్టిస్ శాఖ, మంత్రి కురసాల కన్నబాబుకు జీఏడీ శాఖ, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్, ఎన్ఆర్ఐ ఎంపవర్‌మెంట్ కేటాయించగా.. అసెంబ్లీ సమావేశాల్లో ఆయా శాఖల వ్యవహారాలను సదరు మంత్రులు చూస్తున్నారు. అయితే, ఇప్పుడు మేకపాటి శాఖలు మంత్రి బుగ్గనకు కేటాయిస్తూ జీవో జారీ చేశారు.. ఇప్పుడు ఉన్న ఫైనాన్స్, శాసనసభ వ్యవహారాలు, కమర్షియల్ టాక్స్ శాఖలకు అదనంగా ఐటీ, పరిశ్రమలు, కామర్స్ శాఖలు బుగ్గనకు కేటాయిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.