iDreamPost
android-app
ios-app

అందువల్లే మాయావతి ఓడిపోయారట..!

అందువల్లే మాయావతి ఓడిపోయారట..!

ఎన్నికల సమయంలోనూ, ఎన్నికలు అయిపోయి ఫలితాలు వచ్చిన తర్వాత బీఎస్పీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి మాయావతి వ్యవహరిస్తున్న తీరు హాస్యాస్పదంగా ఉంది. అన్ని పార్టీలు ప్రజా తీర్పును గౌరవిస్తూ.. ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుంటామని, ప్రజల తరఫున మరింతగా పోరాడతామని ప్రకటనలు చేస్తుంటే.. మాయావతి మాత్రం తమ ఓటమికి మీడియానే కారణమంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. మీడియా దుష్ప్రచారం చేయడం వల్లే ముస్లింలు బీఎస్పీకి దూరమయ్యారని, లేకుంటే బీజేపీని అడ్డుకునేవాళ్లమంటూ ఎన్నికలు అయిపోయాక నిమ్మలంగా చెబుతున్నారు.

ఆడలేక మద్దెలఓడు..

మాయావతి తీరు ఆడలేక మద్దెలఓడు అన్న మాదిరిగా ఉంది. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో మొత్తం 403 సీట్లలోనూ పోటీ చేసిన మాయావతి పార్టీ.. కేవలం ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది. అయితే దీనికి కారణం మీడియానే అంటూ మాయావతి అనడం విచిత్రంగా ఉంది. ఎన్నికల్లో పోటీ చేస్తున్నామనే సోయ కూడా లేని విధంగా మాయావతి వ్యవహరించారు. తాను పోటీ చేయలేదు. కానీ పార్టీ అభ్యర్థులను అన్ని స్థానాల్లోనూ నిలబెట్టారు. సరే వారి తరఫున అయినా ప్రచారం చేశారా..? అంటే అదీ లేదు. తాము అన్ని పార్టీలకు భిన్నమని, బహిరంగ సభలు నిర్వహించబోమని, ఇంటింటి ప్రచారం చేయబోమంటూ మడికట్టుకుని కూర్చుకున్నారు. అడగనిదే అమ్మ అయినా పెట్టదంటారు. ఇంట్లో కూర్చుంటే ఓట్ల వేయరన్న సంగతి మాయావతికి తెలియంది కాదు. ముక్కోణపు పోటీ జరిగి ఉంటే.. బీజేపీని అడ్డుకునే వాళ్లమంటూ మాట్లాడుతున్న మాయావతి.. ఆ తరహాలో పోటీ ఉండేలా ఎన్నికల్లో పని తాము పని చేయలేదనే విషయం మరిచిపోతున్నారు.

తప్పు అంతా తన వద్ద పెట్టుకుని.. ఓటమికి కారణం మీడియానే అంటూ నిందించడం మాయావతి దుస్థితికి అద్దం పడుతోంది. బీజేపీకి బీఎస్పీ బి టీం అంటూ మీడియా ప్రచారం చేసిందట. దాని వల్ల ముస్లింలు బీఎస్పీకి దూరమయ్యారని చెప్పుకొచ్చారు మాయావతి. సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వస్తే.. మళ్లీ గుండారాజ్‌ కార్యకలాపాలు మొదలవుతాయనే భయంతో ముస్లింలు అందరూ బీజేపీకి వెళ్లిపోయారంటూ మాయావతి చిత్రమైన వాదనను తెరపైకి తెచ్చారు. ఓటమికి ఎవరిని నిందించినా.. ఈ ఎన్నికల్లో మాయావతి వ్యవహరించిన తీరు ఆత్మహత్యాసదృశ్యమే.