iDreamPost
android-app
ios-app

సీఎం, మాజీ సీఎంల మధ్య మద్యం వార్‌

సీఎం, మాజీ సీఎంల మధ్య మద్యం వార్‌

ఇటీవల జరిగిన ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాలలో విజయం సాధించి, జోష్‌ మీద ఉన్న బీజేపీని మధ్యప్రదేశ్‌లోని పరిణామాలు కలవరపెడుతున్నాయి. సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్, మాజీ సీఎం, పార్టీ సీనియర్‌ నేత ఉమా భారతి మధ్య గ్యాప్‌ పెరిగి, అది కాస్త ప్రత్యక్ష పోరుకు దారితీస్తోంది. తాజాగా ఉమా భారతి మద్యం విక్రయాలకు వ్యతిరేకంగా ప్రత్యక్ష కార్యాచరణ మొదలుపెట్టారు. రాష్ట్రంలో మద్య నిషేధం విధించాలని కొన్ని నెలలుగా డిమాండ్‌ చేస్తున్న ఆమె.. తాజాగా ఓ మద్యం దుకాణం వద్దకు తన మద్ధతుదారులతో వెళ్లి మద్యం బాటిళ్లను ధ్వంసం చేయడం శివరాజ్‌ సర్కార్‌ను ఇరుకున పెట్టింది.

కోరింది ఒకటి.. చేసింది మరొకటి..

రాష్ట్రంలో మద్య నిషేధం విధించాలని చాలా రోజులగా ఉమా భారతి డిమాండ్‌ చేస్తున్నారు. దీనికి ఆమె ఒక డెడ్‌లైన్‌ కూడా విధించారు. ఈ ఏడాది జనవరి 15వ తేదీ నాటికి మద్య నిషేధం అమలు చేయాలని ఆమె శివరాజ్‌ సర్కార్‌కు తేల్చి చెప్పారు. అయితే ఉమా భారతి డిమాండ్‌ను సీఎం శివరాజ్‌ సింగ్‌ లైట్‌ తీసుకున్నారు. ఉమా డిమాండ్‌కు భిన్నంగా.. మద్యం పాలసీని తీసుకువచ్చారు. స్వదేశీ, విదేశీ మద్యంపై ఎక్సైజ్‌ డ్యూటీని తగ్గించారు. ఫలితంగా మరింత చౌకగా మద్యం లభిస్తోంది. అంతేకాకుండా ద్రాక్ష, బ్లాక్‌ ప్లమ్స్‌ ద్వారా లిక్కర్‌ తయారు చేయడానికి ఉత్పత్తిదారులకు అనుమతులు మంజూరు చేసింది. అంతే కాకుండా గతం కన్నా నాలుగు రెట్లు ఎక్కువగా మద్యం ఇళ్లలో నిల్వ చేసుకునే వెలుసుబాటును ప్రజలకు కల్పించింది. వార్షిక ఆదాయం కోటి రూపాయలకు పైగా ఉన్న వారు ఇంట్లోనే బార్‌ ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది.

రగిలిపోతున్న ఉమా భారతి..

తన డిమాండ్‌కు పూర్తి భిన్నంగా శివరాజ్‌ సింగ్‌ వ్యవహరించడంతో ఉమా భారతికి చిర్రెత్తుకొచ్చింది. మద్య నిషేధం డిమాండ్‌ను పట్టించుకోకపోగా.. మద్యం అమ్మకాలు మరింత పెంచేలా నిర్ణయాలు తీసుకోవడంతో ఉమా భారతి ప్రత్యక్షంగా రంగంలోకి దిగారు. ఆందోళనలు మొదలు పెట్టారు. ఈ పరిస్థితి మధ్యప్రదేశ్‌ బీజేపీలో ఎలాంటి
పరిణామాలకు దారితీస్తాయోనన్న ఆందోళన పార్టీ శ్రేణుల్లో నెలకొంది.

శివరాజ్‌ సింగ్, ఉమా భారతిలు ఇద్దరూ బలమైన నేతలే. ప్రజల్లోనూ, పార్టీలోనూ వారిద్దరికీ పట్టు ఉంది. శివరాజ్‌ నాలుగోసారి ముఖ్యమంత్రిగా పని చేస్తున్నారు. ఉమా భారతి మధ్యప్రదేశ్‌ సీఎంగా, పలుమార్లు కేంద్ర మంత్రిగా పని చేశారు. 2019 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలోనే ఆమె ఎన్నికలకు కొద్ది రోజుల ముందు తాను పోటీ చేయడంలేదని ప్రకటించారు. పార్టీకి అవసరమైన సేవలు చేస్తానని, రాజకీయాల్లో కొనసాగుతానని చెప్పారు. ఆ తర్వాత 2020లో మళ్లీ పోటీ చేయడంపై ప్రకటన చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని 62 ఏళ్ల ఉమా భారతి ప్రకటించారు.

వరుసగా మూడుసార్లు శివరాజ్‌ ముఖ్యమంత్రిగా పని చేశారు. 2018లో కాంగ్రెస్‌పార్టీ స్వల్ప మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే 15 నెలలకే ఆ ప్రభుత్వం కూలిపోయింది. మళ్లీ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. శివరాజ్‌ సింగ్‌ నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చి బీజేపీ అధికారంలోకి వచ్చిందనే భావన రాష్ట్ర ప్రజల్లో నెలకొంది. అదే సమయంలో అవకాశం దొరికినప్పుడల్లా కాంగ్రెస్‌ పార్టీ శివరాజ్‌ సింగ్‌ సర్కార్‌ను ఇరుకునపెడుతోంది. ఇప్పుడు స్వంత పార్టీలోనే శివరాజ్‌కు తలనొప్పులు మొదలయ్యాయి. సీనియర్‌ నేత ఉమా భారతి, శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ల మధ్య రేగిన మద్యం చిచ్చు.. రాబోయో రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి.