iDreamPost
android-app
ios-app

మధ్యప్రదేశ్‌ రాజకీయాల్లో మద్యం చిచ్చు

మధ్యప్రదేశ్‌ రాజకీయాల్లో మద్యం చిచ్చు

అందరిదీ ఒకే పార్టీ. అందులోనూ అధికార పార్టీయే. కానీ ఓ అంశం ఆ పార్టీ నేతల మధ్య చిచ్చు రేపుతోంది. మధ్యప్రదేశ్‌ రాజకీయాల్లో సొంత పార్టీ నేతల మధ్య ‘మద్య నిషేధం’ అంశం మంటలు రేపుతోంది. సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌కు, బీజేపీ సీనియర్‌ నాయకురాలు, మాజీ సీఎం ఉమాభారతికి మధ్య మద్యనిషేధం అంశం.. విభేదాలకు, వివాదాలకు దారితీసింది. మద్యనిషేధంపై తరచుగా మాట్లాడే సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌.. ఇప్పుడు మౌనంగా ఎందుకు ఉన్నారంటూ.. ఫైర్‌ బ్రాండ్‌ ఉమాభారతి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో మద్యనిషేధాన్ని అమలుచేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. ముఖ్యంగా పాఠశాలలు, ఆసుపత్రులు,దేవాలయాల సమీపంలోని లిక్కర్‌ దుకాణాలను తక్షణమే మూసివేయాలన్నారు. ఇంటింటికీ మద్యం పంపిణీని వెంటనే నిలిపివేయాలని కోరారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేసిన ఉమా భారతి.. సీఎం చౌహాన్‌ వ్యవహారంపై మండిపడ్డారు. ‘‘శివరాజ్‌ సింగ్‌ నాకు పెద్దన్నయ్య. 1984 నుంచి మామధ్య స్నేహం ఉంది. అనేక పర్యాయాలు ఆయన నా సలహాలు తీసుకున్నారు. మద్యనిషేధంపై కూడా అనేక సందర్భాల్లో నాతో గళం కలిపారు. కానీ, ఇప్పుడు మౌనంగా ఎందుకు ఉన్నారు?’’ అని ప్రశ్నించారు.

ఇటీవల చౌహాన్‌ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు మద్యం తాగడం మానేస్తే షాపులు మూసేస్తామన్నారు. దీనిపైనా ఉమా తనదైన శైలిలో స్పందించారు. ప్రజలు మద్యం తాగడం మానేస్తే షాపులు వాటంతట అవే మూతబడతాయని.. ప్రత్యేకంగా ఎవరూ మూసేయాల్సిన అవసరం లేదన్నారు. మద్యపాన నియంత్రణపై అవగాహన కల్పించే కార్యక్రమాలకు సీఎంతో కలిసి తాను కూడా పనిచేస్తానని తెలిపారు. కాగా, ఈ వివాదంపై స్పందించిన కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు దిగ్విజయ్‌ సింగ్‌.. ‘‘మద్య నిషేధం విషయంలో ఉమాభారతికి, చౌహాన్‌కు ఉన్న తేడా ఏంటో ఈ వ్యాఖ్యలతో స్పష్టమవుతోంది. మద్యనిషేధం విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానం ఏంటో వెల్లడించాలి’’ అని డిమాండ్‌ చేశారు.