iDreamPost
iDreamPost
హిందుత్వాన్ని వ్యతిరేకిస్తూ దేశద్రోహానికి పాల్పడుతున్న వారందరినీ ఏ క్షణంలోనైనా హతమారుస్తామంటూ వచ్చిన ఒక లేఖ కర్ణాటకలో కలకలం రేపుతోంది. మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి, మరో మాజీ సీఎం, ప్రతిపక్ష నేత సిద్ధరామయ్యలతో పాటు 61 మంది రచయితలు, కళాకారులను కూడా చంపేస్తామని ఆ లేఖలో దుండగులు బెదిరించారు. పోస్టు ద్వారా సీనియర్ అభ్యుదయ రచయిత కుమ్ వీరభద్రప్ప అలియాస్ కుంవీ నివాసానికి ఒక కవర్లో ఈ లేఖ అందింది. షిమోగా జిల్లా భద్రావతి ప్రాంతం నుంచి ఆ లేఖ వచ్చినట్లు దాని మీద ఉన్న పోస్టల్ ముద్రలను బట్టి గుర్తించారు. రెండు పేజీల ఆ లేఖను ఎవరు రాశారో తెలియదుగానీ.. లేఖ చివరిలో షాహిష్ణు హిందూ( సహనపరుడైన హిందువు) అని ఉంది. సామాజిక మాధ్యమాల్లోనూ ఈ లెటర్ వైరల్ కావడంతో పోలీసులు దీనిపై ఆరా తీస్తున్నారు.
హిందుత్వాన్ని వ్యతిరేకించడం దేశద్రోహం
ముస్లిం వర్గానికి అండగా నిలుస్తూ.. హిందూ సంస్థలను, ప్రభుత్వ చర్యలను విమర్శించడం ద్వారా దేశద్రోహానికి పాల్పడుతున్నారని.. అందుకే కుమారస్వామి,సిద్ధరామయ్య, కుంవీ సహా మొత్తం 63 మందిని చంపేస్తామని
హెచ్చరించారు. ‘చావు మీకు చాలా దగ్గరగా ఉంది. ఏ క్షణంలోనైనా మిమ్మల్ని చంపేస్తాం. అంత్యక్రియలకు సిద్ధంగా ఉండమని మీ కుటుంబ సభ్యులకు చెప్పండి’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. దీనిపై రచయిత కుంవీ మాట్లాడుతూ బెదిరింపు లేఖపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదన్నారు. స్వయంగా రాష్ట్ర హోమ్ మంత్రే మతపరమైన అశాంతి రగిలేలా ప్రసంగాలు చేస్తుంటే.. ఆయన ఆధ్వర్యంలో పని చేసే పోలీసులు దీనిపై చర్యలు తీసుకుంటారన్న నమ్మకం తనకు లేదన్నారు. మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి స్పందిస్తూ ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ బెదిరింపుతో తానేమీ భయపడటంలేదని.. అయితే మిగతా రచయితలు, కళాకారులకు తగిన భద్రత కల్పించాలని కోరారు.
మతపరమైన అశాంతే కారణం
గత రెండు మూడు నెలలుగా కర్ణాటకలో మతపరమైన వివాదాలు ఒకదాని తర్వాత ఒకటిగా రాజుకుంటున్నాయి. మొదట హిజాబ్ వివాదం రెండు మతాల మధ్య ఉద్రిక్తతలకు కారణమైంది. హలాల్ మాంసం అమ్మకాలపై ఆంక్షలు, దాని నేపథ్యంలో దేవాలయాల సమీపంలో ముస్లింలు వ్యాపారాలు చేయరాదనడం, పళ్లు, ట్రాన్స్ పోర్ట్ వ్యాపారాల నుంచి కూడా తప్పుకోవాలనడం, తాజాగా మసీదులు దేవాలయాలు ఇతర ప్రార్థన మందిరాల్లో లౌడ్ స్పీకర్లు, మైకులు పెట్టి ప్రార్థనలు చేయరాదని అధికారులు విధించిన ఆంక్షలు మత ఉద్రిక్తతలు రేపుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సహజంగానే అక్కడి బీజేపీ సర్కారుపై కుమారస్వామి, సిద్ధరామయ్యలతోపాటు వారి పార్టీలు విమర్శలు గుప్పిస్తూ ప్రభుత్వ నిర్ణయాలు, చర్యలను వ్యతిరేకిస్తున్నాయి. అదే సమయంలో ఇటీవల బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో రచయిత కుంవీ మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయాల వల్ల రాష్ట్రంలో మతసహనం స్థానంలో అసహనం పెరుగుతోందని విమర్శించారు. మతపరమైన అశాంతి మరింత పెరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆ సందర్భంగా సీఎం బసవరాజ్ బొమ్మైకి ఒక బహిరంగ లేఖ కూడా విడుదల చేశారు. లేఖపై కుంవీతో పాటు 61 మంది రచయితలు, వివిధ రంగాల కళాకారులు సంతకాలు చేశారు. వారినే చంపేస్తామని లేఖలో బెదిరించారు.