iDreamPost
android-app
ios-app

ఆ ఎత్తిపోతల పథకాన్ని ఆపండి..బోర్డ్ ఆదేశం

  • Published Mar 10, 2022 | 8:56 AM Updated Updated Mar 10, 2022 | 8:56 AM
ఆ ఎత్తిపోతల పథకాన్ని ఆపండి..బోర్డ్ ఆదేశం

తుంగభద్రా నుంచి కేసీ కెనాల్ కి రావాల్సిన జలాల వినియోగం విషయంలో అటు కర్ణాటక, ఇటు తెలంగాణా ప్రభుత్వాల తీరు మీద కృష్ణా బోర్డు సందేహాలు వ్యక్తం చేసింది. కర్ణాటక నుంచి రావాల్సిన నీళ్లు రావడం లేదని తెలంగాణా నీటిపారుదల శాఖ అధికారులు వివరణ ఇచ్చినప్పటికీ రోజోలి బండ డైవర్షన్ స్కీమ్ విషయమై అధ్యయానం చేయాలని నిర్ణయించింది. దానికి ఏపీ, తెలంగాణా ప్రభుత్వాలు కూడా అంగీకరించాయి. దాంతో పూణేకి చెందిన సెంట్రల్ వాటర్ అండ్ రీసెర్చ్ స్టేషన్ నిపుణుల బృందం రంగంలో దిగబోతోంది. ఆరు నెలల్లోగా నివేదిక వస్తుందని కృష్ణా బోర్డు అధికారులు ప్రకటించారు. వచ్చే రబీ నాటికి పూర్తి చేయాలని సంకల్పించారు.

రాజోలి బండ చుట్టూ సుదీర్ఘకాలంగా వివాదాలున్నాయి. నీటి విడుదల విషయంలో ఎగువ నుంచి తగిన విధంగా కర్ణాటక ప్రభుత్వం వ్యవహరించడం లేదనే ఆరోపణలున్నాయి. అదే సమయంలో విడుదలయిన నీటి వినియోగంలో తెలంగాణా అధికారుల జోక్యం కూడా వివాదాస్పదమవుతోంది. ఈ నేపథ్యంలో ఆర్డీఎస్ లక్ష్యాల అమలు తీరుపై సమీక్ష చేయాలని కృష్ణా బోర్డు సభ్యుడు ఆర్కే పిళ్లై తాజాగా ప్రతిపాదించారు. ఆర్డీఎస్ లక్ష్యాలు ఏమేరకు అమలవుతున్నాయి. అందుకు ఆటంకాలు ఏమిటి, పరిష్కారం ఏమిటనేది నిపుణుల బృందం అధ్యయనం చేస్తుంది. ఆ రిపోర్టు ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటారు.

కృష్ణా జలాలతో పాటుగా తుంగభద్ర ప్రాజెక్టు నుంచి దిగువకు విడుదలయిన నీటిని అటు మహబూబ్ నగర్, ఇటు కర్నూలు జిల్లా రైతాంగానికి అందించి పొలాలు సాగులోకి తీసుకొచ్చేందుకు ఆర్డీఎస్ అందుబాటులోకి వచ్చింది. దీనికోసం బచావత్ ట్రిబ్యూనల్ 17.1 టీఎంసీల నీటిని కేటాయించింది.  అయితే తుంగభద్ర జలాల విషయంలో 7 టీఎంసీలను విడుదల చేయాల్సి ఉండగా కర్ణాటక అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందనే విషయాన్ని తెలంగాణా అధికారులు కృష్ణా బోర్డు దృష్టికి తీసుకెళ్లారు. 87,500 ఎకరాల పాలమూరు జిల్లా ఆయకట్టుకి అవాంతరం ఏర్పడుతోందని వివరించారు. దానిని ఏపీ ప్రభుత్వం తప్పుబట్టింది. కేసీ కెనాల్ కోటా నీటిని కూడా దారి మళ్లించి కర్ణాటక, తెలంగాణా కూడా జలచౌర్యానికి పాల్పడుతున్నాయంటూ పేర్కొంది.

ఈ వివాదాల నేపథ్యంలో ఆర్డీఎస్ లక్ష్యాల మీద కృష్ణాబోర్డు సమీక్ష మీద పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కృష్ణా జలాల వినియోగం బోర్డు పర్యవేక్షణలోకి తీసుకోవాలని కేంద్రం నిర్ణయించిన తరుణంలో ఆర్డీఎస్ కి సంబంధించిన పరిష్కారం కూడా దక్కుతుందనే అంచనాలు వినిపిస్తున్నాయి.