చంద్రబాబుకి జగన్ మరో షాక్, కుప్పం స్థాయి పెరగబోతోంది..

కుప్పం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యంత చిట్టచివరన, కర్ణాటక,తమిళనాడు సరిహద్దుల్లో ఉండే ప్రాంతం. రాజకీయంగా అదే తనకు సేఫ్ జోన్ అనుకుని చంద్రబాబు ఎంచుకున్న నియోజకవర్గం. రాష్ట్ర రాజకీయాల ప్రభావం లేకుండా సైలెంట్ గా తన పని చక్కబెట్టుకుంటూ వస్తున్నారు. వరుసగా ఏడు ఎన్నికల్లో విజయం సాధించారు. ఆరుసార్లు ఆయన అనుకున్నట్టుగా సాగిపోయింది. కానీ ఏడోసారి మాత్రం ఆయనకు చుక్కలు కనిపించాయి. చివరకు గట్టెక్కినా కొన్ని రౌండ్లలోనయినా వెనుకబాటు తప్పలేదు. దాంతో 2019 ఎన్నికల ఫలితం చంద్రబాబుకి పూర్తి సంతృప్తినివ్వలేదనే చెప్పాలి. రాష్ట్రంలో ఘోర పరాజయంతో పోలిస్తే తన సొంత నియోజకవర్గంలో ఓ మేరకు ఓట్లు తగ్గడం పెద్ద విశేషం కాదని ఆయన సరిపెట్టుకున్నారు.

చివరకు అదే చంద్రబాబు కొంపల మీదకు వచ్చింది. ఇప్పుడు చుక్కలు చూపిస్తోంది. తొలిసారిగా స్థానిక ఎన్నికల్లో టీడీపీ చిత్తయిపోయింది. వైసీపీ విజయకేతనం కుప్పం కోటలను చేధించింది. చంద్రబాబు ఆశలపై నీళ్లు జల్లింది. తొలుత పంచాయతి, జిల్లా పరిషత్ ఎన్నికల్లో టీడీపీ పతనం ప్రారంభంకాగా,మునిసిపల్ ఎన్నికల్లో ఓటమి ఆపార్టీని పూర్తిగా కుంగతీసింది. చంద్రబాబు, లోకేష్ స్వయంగా ప్రచారంలో దిగినా కుప్పంలో గట్టెక్కలేకపోవడం టీడీపీని కలవరపరిచింది. అందుకు అనేక కారణాలుండగా చివరకు చంద్రబాబు చేయలేని పనిని జగన్ చేశారనే సానుకూలత కూడా తోడ్పడింది.

చంద్రబాబు దాదాపు 30 ఏళ్లకు పైగా ప్రాతినిధ్యం వహించిన సొంత నియోజకవర్గం కేవలం పంచాయతీగానే మిగిలిపోగా జగన్ వచ్చిన తర్వాత దానిని అప్ గ్రేడ్ చేశారు. నగర పంచాయతీ హోదా కట్టబెట్టారు. మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ లోకి తీసుకొచ్చారు. దాంతో కుప్పం వాసులకు పలు ప్రయోజనాలు లభించే అవకాశం ఏర్పడింది. ముఖ్యంగా కుప్పం అభివృద్ధికి అది దోహదపడుతుందనే అభిప్రాయం వ్యక్తమయ్యింది.జనాభిప్రాయం ఓట్ల రూపంలో వెల్లడయ్యింది. జగన్ చేసిన అభివృద్ధికి జనం పట్టం కట్టడంతో టీడీపీకి ఘోరపరాభవం ఎదురయ్యింది. ఈ ఓటమితో కళ్లు తెరిచిన చంద్రబాబు కుప్పం కాపాడుకునేందుకు మరింత శ్రమించాలనే నిర్ణయానికి వచ్చారు. పదే పదే అక్కడికి పర్యటనలకు వెళుతున్నారు. అన్నింటికీ మించి కుప్పంలో సొంతంగా ఇల్లు కట్టుకోవడానికి కూడా సిద్దమయ్యారు. ఇవన్నీ ఓటర్లలో మళ్లీ విశ్వాసాన్ని కలిగించడానికి ఏమేరకు తోడ్పడతాయన్నది పెద్ద ప్రశ్నగానే ఉంది.

అదే సమయంలో జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కుప్పం స్థాయిని మరో మెట్టు ఎక్కించేందుకు పూనుకుంటున్నారు. త్వరలో కుప్పం రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకి రంగం సిద్ధం చేస్తున్నారు. దాంతో మారుమూల నగర పంచాయతీగా ఉన్న కుప్పం ఇప్పుడు పాలనలో డివిజన్ కేంద్రంగా మారుతోంది. తద్వారా కుప్పంలో ఆర్డీవో స్థాయి అధికారి ఉంటారు.కుప్పం అభివృద్ధికి తోడ్పడుతుంది. చంద్రబాబు కనీసం మునిసిపాలిటీ కూడా చేయలేకపోతే జగన్ ఏకంగా ఆర్డీవో కేంద్రం స్థాయికి చేర్చేందుకు పూనుకోవడం కీలక పరిణామంగా భావించాలి. ఏప్రిల్ 2 నుంచి మనుగడలోకి రాబోతున్న కొత్త జిల్లాల్లో భాగంగా కుప్పం రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకి సీఎం సన్నద్దమవుతున్నారు. ఇది చంద్రబాబు ఆశలను మరింత నీరుగార్చి వైఎస్సార్సీపీ కి కుప్పం వాసుల్లో మరింత ఆదరణ పెంచేందుకు దోహద పడుతుందనే అభిప్రాయం వినిపిస్తోంది.

Show comments