iDreamPost
android-app
ios-app

మోడీతో భేటీ అయిన తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ.. పార్టీ మార్పుపై ఊహాగానాలు

మోడీతో భేటీ అయిన తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ.. పార్టీ మార్పుపై ఊహాగానాలు

తెలంగాణ‌లో అధికార‌మే ప‌ర‌మావ‌ధిగా బీజేపీతో పాటు, కాంగ్రెస్ కూడా పోరాడుతోంది. టీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ కూడా బీజేపీ, కేంద్ర ప్ర‌భుత్వం టార్గెట్ గా విమ‌ర్శ‌లు చేస్తోంది. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ నేత‌, భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోడీతో భేటీ కావ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆయ‌న గ‌తంలో కూడా ప్ర‌ధానిని క‌లిశారు. వెంక‌ట్ రెడ్డి చూపు బీజేపీ వైపు అన్న వార్త‌లు వెల్లువెత్తాయి. ఇప్పుడు తాజాగా మోడీతో భేటీ కావ‌డమే కాకుండా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ సీనియ‌ర్లు అంద‌రూ సోనియాగాంధీ అపాయింట్మెంట్ కోరి రాష్ట్ర స‌మ‌స్య‌ల‌ను విన్న‌వించాల‌ని నిర్ణ‌యించిన రోజే అదే పార్టీకి చెందిన కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి ప్రధాని అపాయింట్మెంట్ కోరగా అరగంటలోనే వచ్చిందని తెలిపారు.

ప్ర‌ధానితో భేటీ అనంత‌రం కోమటిరెడ్డి తెలంగాణ భ‌వ‌న్ లో మాట్లాడారు. మోడీ తెలంగాణ సమస్యలు అడిగి తెలుసుకున్నారని పేర్కొన్నారు. మూసినదిలో నీరు శుద్ధి చేయకుండా కిందికి వెళ్లడం వలన ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కొందరు చనిపోతున్నారని ప్రధానికి తెలిపినట్లు వివరించారు. నమామి గంగ తరహాలో మూసినది ప్రక్షాళన చేయాలని కోరినట్లు తెలిపారు. హైదరాబాద్ నుంచి విజయవాడ హైవే 6 లైన్ నిర్మాణం పై చర్చించామని పేర్కొన్నారు. నాలుగు లక్షల కోట్లు అప్పుచేసిన రాష్ట్ర ప్రభుత్వం మూసీ ప్రక్షాళన చేయలేకపోయిందా అని మోడీ ఆశ్చర్యం వ్యక్తం చేశారని కోమటిరెడ్డి తెలిపారు.

తెలంగాణలో మైనింగ్ కుంభకోణం జరుగుతున్నదనే విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లగా, చర్యలు తీసుకుంటామని చెప్పారన్నారు. ఏ రంగాల్లో అవినీతి జరుగుతున్నదో ప్రధాని అడిగి తెలుసుకున్నారని, తెలంగాణ పై దృష్టి పెడతామని అన్నట్లు తెలిపారు. 2022 ఏప్రిల్ లో హైదరాబాద్ – విజయవాడ హైవే నిర్మాణం ప్రారంభించాల్సి ఉండగా జీఎంఆర్ సంస్థ ఆర్బిట్రేషన్ కు వెళ్లి మొండిగా వ్యవహరిస్తున్నదని ఎంపీ కోమటిరెడ్డి తెలిపారు. 2025లో నిర్మిస్తామని చెబుతున్నదని, ఈ విషయాన్ని గడ్కరీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. మంగళవారం హైవే నిర్మణం పై రివ్యూ చేస్తున్నట్లు గడ్కరీ తెలిపారన్నారు. జీఎంఆర్ నిర్మించకపోతే కొత్త సంస్థతో పనులు చేపడుతామని, అవసరమైతే కోర్టుకు కూడా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని గడ్కరీ అన్నట్లు తెలిపారు.