Komatireddy Venkat Reddy: మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. కక్ష సాధించం.. కానీ తప్పులంటే మాత్రం

తెలంగాణ ఆర్ అండ్ బీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మాట్లాడుతూ.. కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..

తెలంగాణ ఆర్ అండ్ బీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మాట్లాడుతూ.. కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..

తెలంగాణ రోడ్లు, భవనాలు శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము ఎవరి మీద కక్ష తీర్చుకోమని.. కానీ తప్పు చేసినట్లు రుజువైతే మాత్రం.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. శనివారం నాడు సచివాలయంలో కోమటిరెడ్డి ఆర్ అండ్ బీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ వెంటనే మొత్తం 9 దస్త్రాలపై సంతకాలు చేశారు. వీటిలో నల్గొండ నుంచి ధర్మాపురం, ముషంపల్లి రహదారిని 4 లైన్‌లుగా చేయడం, కొడంగల్, దుడ్యాల రహదారి విస్తీర్ణానికి సంబంధించిన దస్త్రాలు కూడా ఉన్నాయి.

ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. రానున్న 2 – 3 ఏళ్లలో రహదారుల విస్తీర్ణానికి చర్యలు తీసుకుంటాము. అలానే ఎన్నికల వేళ ఇచ్చిన 6 గ్యారంటీలను వీలైనంత త్వరగా అమలు చేస్తామని తెలిపారు. ‘‘దాదాపు పదేళ్ల తర్వాత కాంగ్రెస్‌ పార్టీ తిరిగి తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా రహదారుల మెరుగుకు కృషి చేస్తాను. భువనగిరి ఎంపీ పదవికి సోమవారం రాజీనామా చేస్తా. రాష్ట్రంలోని 14 రహదారులకు జాతీయ హోదా ఇవ్వాలని, అలానే ప్రాంతీయ రింగ్ రోడ్ సౌత్ ను జాతీయ రహదారిగా గుర్తించాలని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీని కలిసి అడుగుతాను‘‘ అని తెలిపారు.

’’అలాగే విజయవాడ-హైదరాబాద్ రహదారిని 6 లైన్‌లకు, హైదరాబాద్-కల్వకుర్తి 4 లైన్‌లకు, సెంట్రల్ రోడ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (సీఆర్ఐఎఫ్)ని పెంచాలని అడుగుతాను. 9 దస్త్రాల్లో ఐదింటి అనుమతి పొందడం కోసం సోమవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలుస్తాను. హైదరాబాద్-విజయవాడ రహదారిలో మల్కాపూర్ వరకు కొంత పని అయిపోయింది. 6 నెలల్లో దానిని పూర్తి చేస్తాం. హైదరాబాద్-విజయవాడ రహదారికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి రెండున్నర గంటల్లో విజయవాడ చేరుకునేలా దాన్ని విస్తరిస్తాం‘‘ అని చెప్పుకొచ్చారు. అంతేకాక గత పదేళ్లల్లో.. బీఆర్ఎపస్ ప్రభుత్వం రోడ్ల విస్తరణ గురించి పట్టించుకోలేదని ఆరోపించారు.

’’కొత్త కౌన్సిల్‌ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. త్వరలో కొత్త కౌన్సిల్‌ భవన నిర్మాణం చేపడుతాం. పాత భవనం ఆవరణలోనే కొత్త బిల్డింగ్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఎల్‌పీ కార్యాలయాలు కూల్చి కొత్త భవనాలు నిర్మిస్తాం. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన 2 రోజుల్లోనే ఏం చేశారని హరీశ్‌రావు మాట్లాడుతున్నారు. 10 ఏళ్లుగా బీఆర్ఎస్ నేతలు ఏం చేశారు.. మీరు గత పదేళ్లుగా రహదారుల మీద శ్రద్ధ పెట్టలేదు. మేం ఎవరి మీదా.. కావాలని కక్ష సాధించం. తప్పులు ఉంటే మాత్రం వాటిపై కఠిన చర్యలు తీసుకుంటాం. రహదారుల నిర్వహణే మా మొదటి ప్రాధాన్యత’’ అని చెప్పుకొచ్చారు కోమటిరెడ్డి. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Show comments