Idream media
Idream media
కొంటారా.. కొనరా, ఎలా కొనరో చూస్తాం.. కొనే వరకూ ఊరుకోం.. అంటూ వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వాన్ని కొన్నాళ్లుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇరకాటంలో పెడుతున్నారు. ఆందోళనలు చేస్తున్నారు. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఇలా బాయిల్డ్ రైస్ తీసుకోవడానికి ససేమిరా అంటున్న కేంద్ర ప్రభుత్వాన్ని రైతుల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేశారు.
రెండురోజుల క్రితం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ఆందోళనలో కూడా కేంద్రంపై కేసీఆర్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. 24 గంటల్లో కేంద్రం వరి కొనుగోళ్లు జరపాలని డెడ్‌లైన్ విధించారు. అదే రోజు మర్నాడు కేబినెట్ భేటీ ఉంటుందని, కీలక నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. డెడ్‌లైన్ తర్వాత అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ భేటీలో తెలంగాణలోని యాసంగి ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటుందని ప్రకటించారు. దీని వెనుక కేసీఆర్ మాస్టర్ మైండ్ ఉందనే ప్రచారం జరుగుతోంది. ముందు కేంద్రాన్ని దోషిగా నిలబెట్టి.. తర్వాత రాష్ట్ర ప్రభుత్వమే వరి కొనుగోలు చేస్తే రైతుల్లో మైలేజ్ వస్తుందనే స్కెచ్‌ను కేసీఆర్ వ్యూహాత్మకంగా అమలు చేసినట్లుగా కనిపిస్తోంది.
యాసంగి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయటంలేదని ఆందోళనలు చేసిన తర్వాత.. వరి కొనుగోలు నిర్ణయం ప్రకటించాలని ముఖ్యమంత్రి వ్యూహం రచించారు. ఆ వ్యూహం ప్రకారమే.. టీఆర్‌ఎస్ వరుస ఆందోళనలకు శ్రీకారం చుట్టినట్లు అర్థమవుతోంది. అంతేకాదు.. ఢిల్లీలో ధర్నా చేసిన తర్వాత.. కేబినేట్ భేటీ నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుందని ప్రకటించాలని ముందే నిర్ణయించినట్లుగానే తెలుస్తోంది. కేసీఆర్ తాజా నిర్ణయంతో యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు వివాదానికి తెరపడినట్లయింది.
ఇదిలా ఉండగా.. నాడు కేసీఆర్ మాటకు కట్టుబడి ధాన్యం పండించని రైతులు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. వరి వేస్తే ఉరి వేసుకున్నట్లేనని, యాసంగిలో వరి సాగు చేయొద్దని, ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలని సీఎం కేసీఆర్.. ఈ సీజన్ ఆరంభంలో ప్రకటించటంతో కొందరు రైతులు వెనక్కి తగ్గారు. సుమారు 20 లక్షల ఎకరాల్లో వరి సాగుచేయలేదు. గతేడాది యాసంగిలో 55 లక్షల ఎకరాల్లో వరి సాగుచేస్తే.. ఈసారి 35 లక్షల ఎకరాల్లో వరి వేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకే రైతులు 20 లక్షల ఎకరాల్లో వరి సాగుచేయలేదని సీఎం కేసీఆర్ కూడా ప్రకటించారు. కానీ ఆ రైతులు ఇప్పుడు ఆందోళనకు గురవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొంటుందని ముందే తెలిస్తే.. తాము కూడా వరి వేసేవాళ్లమని చెబుతున్నారు.