Idream media
Idream media
నిరుద్యోగ భృతి, ఉద్యోగాల నోటిఫికేషన్‌ల కోసం బీజేవైఎం మిలియన్ మార్చ్‌కు సిద్ధమవుతున్న వేళ కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. ‘‘ఎవరు అడిగినా అడగకపోయినా ఎవరికి ఏమిచేయాలో నాకు తెలుసు. నిరుద్యోగుల కోసం బుధవారం అసెంబ్లీలో ప్రకటన చేస్తాను. నిరుద్యోగులంతా రేపు ఉదయం 10 గంటలకు టీవీలు చూడండి. నేను చెప్పే ప్రకటన వింటే ఆశ్చర్యపోతారు’’ అంటూ వనపర్తి బహిరంగసభలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విపక్షాలకు చెక్ పెట్టేలా, వచ్చే ఎన్నికల్లో యువతను ఆకట్టుకునేలా భారీ స్థాయిలోనే ఉద్యోగాల ప్రకటన ఉంటుందన్న విషయం స్పష్టం అవుతోంది. అయితే, నిరుద్యోగ భృతి ప్రకటిస్తారా, కొలువులా అనే సందేహాలూ ఉన్నాయి. మొదటిదశలో 50 వేలకుపైగా ఖాళీలను గుర్తించినట్లు సమాచారం. ఈ వివరాలను సీఎస్ సోమేశ్ కుమార్ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందజేశారు. వాటి భర్తీపై బుధవారం అసెంబ్లీలో సీఎం ప్రకటన చేస్తారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
సీఎస్ సోమేశ్ కుమార్ ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఓ నివేదిక అందజేశారు. ఇటీవల ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియ కొలిక్కి వచ్చిన తర్వాత శాఖలు, విభాగాధిపతుల వారీగా గుర్తించిన ఖాళీల వివరాలు ఆ నివేదికలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో అసెంబ్లీ సాక్షిగా బుధవారం సీఎం కేసీఆర్ మొదటి విడతలో 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ ప్రకటన చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. నోటిఫికేషన్లు, వాటి షెడ్యూల్ తదితర వివరాలను అసెంబ్లీలో వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉద్యోగుల సర్దుబాటుతో ఆయా జిల్లాల్లో ఏర్పడిన ఖాళీలను వెంటనే భర్తీ చేసేలా, నోటిఫికేషన్ జారీకి అవసరమైన నివేదికను అందించాలని నిర్దేశిస్తూ ఈ ఏడాది జనవరిలో నలుగురు ఐఏఎస్ అధికారులతో సీఎం కేసీఆర్ ఓ కమిటీని నియమించారు. ఈ కమిటీతోపాటు ఆర్థిక, సాధారణ పరిపాలన శాఖలు నివేదికను రూపొందించి ఇటీవల సీఎస్ సోమేశ్‌కు అందించాయి. దానిని ఆయన ముఖ్యమంత్రికి సమర్పించారు.
ఏ శాఖలో ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి, వేటిని అత్యవసరంగా భర్తీ చేయాల్సి ఉంది? ఏ పోస్టుల భర్తీకి ఎంతమేర ఆర్థికభారం పడనుంది? తదితర వివరాలు ఆ నివేదికలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ మాదిరిగా జాబ్ క్యాలెండర్ ప్రకటన కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే భర్తీ చేయబోయే వాటిలో ఎక్కువగా పోలీసు, వైద్య ఆరోగ్యం, విద్యా శాఖల్లో ఖాళీలు ఉన్నట్లు తెలిపింది. ప్రధానంగా టీచర్ల ఖాళీలు ఎక్కువగా ఉన్నాయని వివరించింది. వాటి ఆధారంగానే సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. బుధవారం చేసే ప్రకటనలో మొదటిదశ ఉద్యోగ ఖాళీలను ప్రకటిస్తారని ఆ వర్గాలు వివరించాయి. బీసీలకు ఉద్యోగ రిజర్వేషన్ల వయసు పెంపు నిబంధనను మరో పదేళ్లకాలానికి పొడిగిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. ఇది కూడా ఉద్యోగ ప్రకటన వెలువడుతుందనడానికి ఊతమిస్తోంది.