iDreamPost
android-app
ios-app

క‌ర్ణాట‌క మంత్రి ఈశ్వరప్పకు బిగుస్తున్న ఉచ్చు

క‌ర్ణాట‌క మంత్రి ఈశ్వరప్పకు బిగుస్తున్న ఉచ్చు

ఓ కాంట్రాక్టర్‌ ఆత్మహత్య కర్ణాటక రాజకీయాల్లో కలకలం రేపుతోంది. మంత్రికి 40 శాతం కమీషన్‌ ఇచ్చుకోలేక చనిపోతున్నానంటూ అతడు సూసైడ్‌ నోట్‌ రాయడం దుమారం రేపుతోంది. ఇప్పటికే కర్ణాటక పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి ఈశ్వరప్పపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. కానీ ఈశ్వరప్ప మాత్రం సంతోష్‌ పాటిల్‌ ఎవరో అసలు తనకు తెలియదన్నారు. మృతుడికి బీజేపీతో అసలు సంబంధమే లేదని కొట్టిపారేశారు. అంతేకాదు.. తాను రాజీనామా చేసే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. దీనిపై విపక్షాలు, బాధిత కుటుంబ సభ్యులు భగ్గుమంటున్నారు. అలాగే ఈ ఘటనపై స్పందించిన మోడీ పార్టీ కీలక నేత బీఎల్‌ సంతోష్‌ను వెంటనే ఢిల్లీకి రావాలని ఆదేశించినట్లు తెలిసింది.

ఇదిలా ఉండగా.. ఈశ్వరప్పను అరెస్టు చేసేవరకూ మృతదేహాన్ని తీసుకోబోమని మృతుడి కుటుంబం భీష్మించుకు కూర్చోవడం పెద్ద దుమారం రేపింది. ఈశ్వరప్ప వల్లే తన భర్త చనిపోయాడని మృతుడి భార్య మీడియా ముందు కన్నీటి పర్యంతమయ్యారు. తన భర్తది ఆత్మహత్య కాదని, ప్రభుత్వం చేసిన హత్య అని సంతోష్‌ భార్య జయశ్రీ పాటిల్‌ పేర్కొన్నారు. ఇందుకు మంత్రి ఈశ్వరప్ప బాధ్యత వహించాల్సిందేనన్నారు. బెళగావిలో బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ సంతోష్‌ ఎవరో తెలియదంటూ మంత్రి ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు. తన ఒంటిపై ఉన్న బంగారాన్ని సైతం కుదవ పెట్టి 108 కాంట్రాక్టు పనులకు రూ.4కోట్లకు పైగా ఖర్చు పెట్టారని, తీరా పనులు పూర్తయ్యాక బిల్లులు ఇవ్వకుండా వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు ఈ ఘటనను విపక్షాలు సీరియస్‌గా తీసుకుని కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌, ప్రతిపక్షనేత సిద్దరామయ్య సహా కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యనేతలు బుధవారం గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌ను కలిశారు. మంత్రి ఈశ్వరప్పకు 40 శాతం కమీషన్‌ ఇచ్చుకోలేకే కాంట్రాక్టర్‌ సంతోష్‌ పాటిల్‌ ఆత్మహత్యకు పాల్పడినట్టు గవర్నర్‌కు తెలియజేశారు. ఈశ్వరప్ప కమీషన్‌ కోసం వేధిస్తున్నట్లు ప్రధాని మోడీ, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ అరుణ్‌సింగ్‌, పార్టీ ముఖ్యనేత బీఎల్‌ సంతోష్‌ సహా పలువురికి కాంట్రాక్టర్‌ విన్నవించారని తెలిపారు. ముఖ్యమంత్రికీ చెప్పుకునేందుకు ఉడుపికి వెళ్లిగా, కలిసే అవకాశం లభించకపోవడంతో అక్కడే ఓ లాడ్జిలో బలవన్మరణానికి పాల్పడ్డారని వివరించారు. సంతోష్‌పాటిల్‌ మృతికి కారణమైన ఈశ్వరప్పపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.