iDreamPost
iDreamPost
అసలే వర్గపోరుతో సతమతం అవుతున్న కాకినాడ రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో మరో గ్రూపు పురుడు పోసుకుంది. వచ్చే ఎన్నికల్లో ఈ సీటు కోసం
పార్టీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి దంపతులు, పెద్దాపురం ఎమ్మెల్యే, మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, కన్వీనర్ పెంకే శ్రీనివాసబాబా వర్గాల మధ్య గ్రూపు రాజకీయం నడుస్తోంది. తాజాగా జెడ్పీ మాజీ చైర్మన్ జ్యోతుల నవీన్ కూడా ఈ సీటును ఆశిస్తుండడంతో వర్గపోరులో జోరు పెరిగింది. పిల్లి అనంతలక్ష్మి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందగా, ఒకసారి జెడ్పీటీసీగా సత్యనారాయణమూర్తి ఇక్కడ గెలవడంతో ఆ కుటుంబానికి పార్టీ అధిష్టానంలో మంచి పట్టు ఉండేది. అయితే ఈ సీటుపై కన్నేసిన పార్టీ నేతలు పిల్లి అనంతలక్ష్మి దంపతులపై అధిష్టానానికి అదే పనిగా ఫిర్యాదులు చేశారు. ఆ ప్రయత్నాలు ఫలించి పార్టీ అధిష్టానం వారికి ప్రాధాన్యం తగ్గించింది. ఇటీవల రాజమహేంద్రవరంలో జరిగిన సమన్వయ కమిటీ సమావేశాలకు గాని, అంతకుముందు అమరావతిలో జరిగిన మీటింగ్‌లకు గాని వారిని పార్టీ తరపున పిలువలేదు. ఈ నేపథ్యంలో కొత్తగా రంగంలోకి దిగిన జ్యోతుల నవీన్ వర్గం కూడా తనపై అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు పిల్లి సత్యనారాయణమూర్తి అనుమానిస్తున్నారు. పార్టీ ఫండ్‌ను సొంత ఆస్తుల కొనుగోలుకు తాను వినియోగించినట్టు ప్రచారం చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విలేకరుల ఎదుటే ఆవేదన..
తనపై పార్టీ నేతలు చేస్తున్న ప్రచారంపై పిల్లి సత్యనారాయణమూర్తి విలేకరుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీటీసీ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టలేనంతగా పార్టీని నాశనం చేశానని, అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చిన సొమ్ములు ఖర్చు చేయకుండా భూములు కొన్నానని ఆరోపించడం దారుణమన్నారు. తన తల్లిదండ్రులు చనిపోయాక 50 ఎకరాలతో బయటకు వచ్చాను. అవి అమ్మడం, కొనడం ద్వారా ఆస్తులు పెంచుకున్నాను కానీ, పార్టీ సొమ్ముతో ఆస్తులు కొనుక్కునేటంతగా దిగజార లేదన్నారు. ఎకరం రూ.5 వేలు, 10.వేలు ఉండగా కొన్న భూములకు ఇప్పుడు ఎకరం రూ.మూడు, రూ.నాలుగుకోట్లు ధర ఉందన్నారు. అందులో కొంతభూమి అమ్మి, ఈ మధ్య భూమికొంటే, ఎన్నికల డబ్బు ఖర్చు చేయకుండా భూములు కొన్నట్టు మా పార్టీవాళ్లే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడు, ఎక్కడ సమావేశం నిర్వహించినా, లీగల్‌గా తన ఆస్తుల వివరాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. ఏ ఎన్నికల్లోనూ సీటు ఇమ్మని అడగలేదని, అధిష్టానమే తమపై ఉన్న నమ్మకంతో పిలిచి సీటిచ్చిందని కూడా ఆయన చెప్పుకున్నారు.
పార్టీ అభిమానుల్లో ఆందోళన
నియోజకవర్గంలో గెలుపు ఓటములను నిర్ణయించే కాపు, శెట్టిబలిజ సామాజిక వర్గాల మధ్య ఆధిపత్య రాజకీయాలు నడుస్తున్నాయి. చినరాజప్ప ప్రోత్సాహంతో శెట్టిబలిజ వర్గానికి చెందిన కొందరు అనంతలక్ష్మి దంపతులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. దీనికితోడు కన్వీనర్ బాధ్యతలు చేపట్టిన బీసీ సామాజిక వర్గానికి చెందిన పెంకే శ్రీనివాసబాబా తన వర్గాన్ని తయారు చేసుకొనే పనిలో ఉన్నారు. దీంతో నియోజకవర్గంలోని కాపు, శెట్టిబలిజల్లోని కీలక నాయకులను తమ వైపు తిప్పుకొనేందుకు ఈ మూడు వర్గాలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా 25 ఏళ్ల అనుభవం, మాజీ హోంమంత్రిగా నిమ్మకాయల చినరాజప్పకు అధిష్టానంలో మంచి పలుకుబడి ఉంది. ఆయన రూరల్‌లో పాగాకు ఒక పక్క ఎత్తులు వేస్తున్నారు. కన్వీనర్ శ్రీనివాసబాబా నారా లోకేష్‌తో యూఎస్‌లో తాను ఎంఎస్ చదివినప్పటి నుంచి ఉన్న పరిచయాన్ని ఉపయోగించుకొని బలపడాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ తనయుడు నవీన్ కూడా రూరల్ సీటుపై కన్నేయడంతో పార్టీలో వర్గ పోరు మరింత పెరిగినట్టయింది. వచ్చే ఎన్నికల్లో అధిష్టానం వీరిలో ఎవరికి టికెట్ ఇచ్చినా పార్టీ గెలవాలంటే నాయకుల మధ్య సఖ్యత అవసరమని, ఈ గ్రూపులు ఇలాగే కొనసాగితే సైకిల్‌కు మళ్లీ పంక్చర్ పడుతుందని టీడీపీ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.