Idream media
Idream media
మేనిఫెస్టోను పవిత్రమైన మతగ్రంథాలతో పోల్చిన సీఎం వైఎస్ జగన్.. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నారు. చేశామంటే చేశామనేలా కాకుండా ప్రతి ఏడాది సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. పాదయాత్రలో వివిధ వర్గాల ప్రజల కష్టాలను,సమస్యలను నేరుగా చూసిన జగన్.. అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సమస్యలను తీర్చేలా విధానపరమైన నిర్ణయాలు,సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే చిరువ్యాపారుల పెట్టుబడి కోసం పడుతున్న ఇబ్బందులు, అధికవడ్డీకి అప్పులు చేయాల్సిన పరిస్థితిని చూసిన జగన్.. ఆ ఇబ్బందులు తప్పించేందుకు ‘జగనన్న తోడు’ పేరుతో పథకాన్ని ప్రారంభించారు. తోపుడు బండ్లు, టిఫిన్ సెంటర్లు, బడ్డీ కొట్లు సహా వివిధ చిరు వ్యాపారాలు చేసుకునే వారికి వడ్డీలేకుండా, షూరిటీతోపని లేకుండా పదివేల రూపాయల రుణం ఇచ్చే కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు. ఈ రోజు మరో విడత ‘జగనన్న తోడు’ పథకంలో భాగంగా లబ్ధిదారులకు పదివేల రూపాయల చొప్పన నగదు జమ చేస్తున్నారు.
ఈ దఫా 5,10,462 మంది లబ్ధిదారులకు పదివేల రూపాయల చొప్పన 510.46 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లో సీఎం జగన్ జమ చేయబోతున్నారు. ఈ మొత్తంతోపాటు గత ఏడాది రుణాలకు సంబంధించిన వడ్డీ 16.16 కోట్ల రూపాయల మొత్తాన్ని కూడా సీఎం జగన్ విడుదల చేయబోతున్నారు. ఈ ఏడాది ఇచ్చే రుణాలతో కలిపి ఇప్పటివరకు ‘జగనన్న తోడు’ పథకం కింద 14.16 లక్షలమంది చిరు వ్యాపారులకు 1,416 కోట్ల రూపాయల రుణాలు జగన్ సర్కార్ అందించింది. సకాలం (ఏడాది)లో చెల్లించిన రుణాలకు సంబంధించిన వడ్డీ 32.51 కోట్ల రూపాయలను వైసీపీ సర్కార్ బ్యాంకులకు చెల్లించింది.
లబ్ధిదారులకు ‘జగనన్న తోడు’ పథకానికి సంబంధించి స్మార్ట్ కార్డులను జారీ చేస్తోంది. ఒకసారి ఈ పథకం కింద 10వేల రూపాయల రుణం తీసుకున్నవారు ఏడాదిలోపు చెల్లిస్తే.. మళ్లీ వారికి పదివేల రూపాయల రుణం మంజూరవుతుంది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. అర్హులైన వారు వాలంటీర్‌ను గానీ, తమ పరిధిలోని సచివాలయంలోని వెల్ఫేర్ అసిస్టెంట్‌ను గానీ సంప్రదించి, పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారుల అర్హతను పరిశీలించిన తర్వాత.. పథకాన్ని వర్తింపజేస్తారు. పథకం అమలు అయిన తర్వాత అర్హత ఉండి, లబ్ధిదారుల జాబితాలో తమ పేరు లేకపోయినా, దరఖాస్తు చేసుకోలేకపోయినా మళ్లీ నెల రోజుల లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం వల్ల చిరు వ్యాపారులు పెట్టుబడికోసం వడ్డీ వ్యాపారుల వద్ద అధికవడ్డీలకు అప్పులు చేయాల్సిన పరిస్థితి తప్పింది.