Idream media
Idream media
ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఏపీ చరిత్రలోనే మరో సంచలనానికి తెర తీశారు. రెండున్నరేళ్లకే కేబినెట్ లోని మొత్తం మంత్రులతో రాజీనామాలు చేయించారు. ఏప్రిల్ 11న మంత్రి వర్గాన్ని పునర్‌వ్యవస్థీకరిస్తున్న నేపథ్యంలో కేబినెట్‌లోని 24 మంది మంత్రులు రాజీనామా చేశారు. మంత్రులంతా తమ రాజీనామా లేఖలను సీఎం జగన్‌కు అందజేశారు. ఆదిలోనే ఈ విషయం మంత్రులకు స్పష్టంగా చెప్పారు. 2019 మే 30న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. జూన్ 8న మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. రెండున్నరేళ్ల తర్వాత కొత్త వారికి మంత్రులుగా అవకాశం కల్పిస్తామని, మంత్రివర్గం నుంచి బయటకు వచ్చినవారికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తామని తెలిపారు. రెండున్నరేళ్లకు ఒకసారి చొప్పున ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని సీఎం వైఎస్ జగన్ స్పష్టత ఇచ్చారు. కరోనా మహమ్మారి వల్ల మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో కొంత జాప్యం జరిగింది. ఆ ప్రభావం పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టారు.
ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే.. జగన్ తన కొత్త టీంలో కూడా సామాజిక న్యాయానికి పెద్ద పీట వేసినట్లుగా సమాచారం. రాజకీయంగా పోస్టు ఏదైనా.. అన్నింటిలోనూ ఆయన ఇదే పంథా అవలంబిస్తున్నారు. తొలి మంత్రివర్గంలో సామాజిక న్యాయానికి సీఎం జగన్ పెద్దపీట వేశారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో 60 శాతం మంత్రి పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఇచ్చి సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపించారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఐదుగురికి, బీసీల నుంచి ఏడుగురికి, ఎస్టీల నుంచి ఒకరికి, మైనార్టీల నుంచి ఒకరికి, కాపు సామాజిక వర్గం నుంచి నలుగురికి, కమ్మ సామాజిక వర్గం నుంచి ఒకరికి, రెడ్డి సామాజిక వర్గం నుంచి నలుగురికి, క్షత్రియుల నుంచి ఒకరికి, వైశ్య సామాజిక వర్గం నుంచి ఒకరికి మంత్రివర్గంలో అవకాశం కల్పించారు.
ఉప ముఖ్యమంత్రులుగా ఐదుగురిని నియమించగా వారిలో నలుగురు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలవారే కావడం గమనార్హం. తొలిసారిగా ఎస్సీ మహిళ మేకతోటి సుచరితను హోంమంత్రిగా నియమించారు. ఇప్పుడు కూడా అదే పంథాను కొనసాగిస్తూ సామాజిక న్యాయానికి పెద్దపీట వేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే జాబితా కొలిక్కి వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో అవసరం మేరకు కొద్ది మంది సీనియర్లను కొనసాగించాలని అనుకుంటున్నామని జగన్ పేర్కొన్నారు. ఈ మేరకు రకరకాల పేర్లు తెరపైకి వస్తున్నాయి కానీ స్పష్టత లేదు. ఇక నేడో రేపో మంత్రివర్గంపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.