iDreamPost
iDreamPost
ఏపీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఆసక్తిగా మారబోతోంది. రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది.అధికారపార్టీ నేతల్లో అలజడి సృష్టిస్తోంది. ఆశావాహులు నేరుగా సీఎం దృష్టిలో పడాలని తహతహలాడుతుంటే ఇప్పటికే మంత్రివర్గంలో ఉన్న వారు తమను కొనసాగిస్తారా లేదా అనే ఊగిసలాటలో ఉన్నారు. ఇప్పటికే పలువురు నాయకులు తమకు చోటు ఉండదనే లెక్కలతో తమ పని తాము చేసుకుంటున్నారు. సీఎం ఎప్పుడు కోరితే అప్పుడు మంత్రి పదవి నుంచి వైదొలిగేందుకు మానసికంగా సిద్ధమయ్యారు. మంత్రి పదవి కట్టబెట్టినప్పుడే రెండున్నరేళ్ల షరతు పెట్టినందున దానిలో విశేషం లేదని భావిస్తున్నారు. కానీ కొందరు మాత్రం ఆశావాహకంగా కనిపిస్తున్నారు. వివిధ సమీకరణాలతో కొద్దిమందిని కొనసాగించాల్సి రావచ్చునంటూ సీఎం నేరుగా శాసనసభాపక్ష సమావేశంలోనే చెప్పడంతో ఆ జాబితాలో తమ పేరు ఉండాలనే ఆశతో కనిపిస్తున్నారు.
ఈ మంత్రివర్గ మార్పుల్లో అనూహ్య పరిణామాలు తప్పవనే అభిప్రాయం బలపడుతోంది. సీనియర్లుగా ఉన్న వారు సైతం వైదొలగాల్సిందేనని అంచనాలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ ధీమాగా కనిపించిన నేతల్లో కూడా తాజా పరిణామాలతో ఆశలు సన్నగిల్లుతున్నట్టు తెలుస్తోంది. ఉత్తరాంద్రకు చెందిన సీనియర్ మంత్రి కి వివిధ సమీకరణాల రీత్యా ఆశలుండేవి. కానీ ప్రస్తుతం ఆయనకు ఉత్తరాంధ్ర పార్టీ బాధ్యతలు అప్పగించేందుకు అంతా సిద్ధమయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం విజయసాయిరెడ్డి ఆ బాధ్యతల్లో ఉండగా ఆయనకు ఇటీవలే అనుబంధ సంఘాల సమన్వయం అప్పగించారు. దాంతో ఆయన విశాఖను వదలి విజయవాడ చుట్టూ చక్కర్లు కొట్టాల్సి వస్తోంది. ఈ స్థితిలో సీనియర్ మంత్రికి ఉత్తరాంధ్ర పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఇక రాయలసీమలోని మరో సీనియర్ మంత్రి స్థానానికి కూడా ఢోకా ఉండదని తొలుత భావించినా, ప్రస్తుతం ఊగిసలాటలో ఉన్నట్టు చెబుతున్నారు. పార్టీ బాధ్యతలు తీసుకుని ముందుకు సాగాల్సి ఉంటుందని సీఎం నుంచి సంకేతాలు రావడంతో ఆయన కూడా ధీమాగా కనిపించడంలేదు. ఈ పరిణామాల మధ్య రాష్ట్ర క్యాబినెట్ లో కొత్త మంత్రులకు అవకాశం ఖాయంగా చెబుతున్నారు. ఒకరిద్దరు నాయకులు తొలిసారిగా ఎన్నికయినప్పటికీ వారికి ఛాన్స్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. దాంతో కొత్త ఎమ్మెల్యేలు కూడా ఆశావాహకంగా కనిపిస్తున్నారు. ఇక మండలి నుంచి అవకాశం కల్పించే యోచనలో సీఎం ఉన్నారని తెలుస్తోంది. గతంలో మండలి నుంచి ఇద్దరు మంత్రులకు అవకాశం ఇవ్వగా ప్రస్తుతం ఎవరూ క్యాబినెట్ లో లేరు. దాంతో మండలి నుంచి కూడా కొందరు సీనియర్లు ఆశల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈనెలాఖరులోగా కొత్త మంత్రివర్గం మీద స్పష్టత రాబోతోందనే అభిప్రాయం వినిపిస్తోంది.